
150 గంటల్లో సీఎం యోగి రికార్డు నిర్ణయాలు
లక్నో: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ రాష్ట్రాలకు కొత్త వ్యక్తులు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటికీ వారిలో ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి పేరు మాత్రం అటు ప్రధాన వార్తల్లో, ఇటు సోషల్ మీడియాలో వాయువేగంతో దూసుకెళుతోంది. ఆయనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రోజుకు కనీసం ఓ నాలుగైదుసార్లు వార్తల్లో నిలుస్తున్నారు. ఈ వారం రోజుల్లో ఆయన పనితీరును గమనిస్తే నిజంగానే అలుపంటూ లేకుండా పనిచేస్తున్నారనే విషయం అర్ధమవుతుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. సరిగ్గా ఆయన పగ్గాలు చేపట్టి దాదాపు 150 గంటలు కావొస్తుంది.
ఈ గడువులో ఆయన ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారో తెలిస్తే కచ్చితంగా నొరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఆయన ఈ 150గంటల్లో 50 నిర్ణయాలు తీసుకొని వాటిని శరవేగంగా అమలుచేయించేందుకు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఒక్క కేబినెట్ సమావేశం కూడా నిర్వహించకుండానే వారం గడువులోనే దాదాపు అర్ధసెంచరీ నిర్ణయాలు తీసుకున్న తొలి ముఖ్యమంత్రి ఒక్క యోగి అని చెప్పడం కూడా పెద్ద ఆశ్చర్యం అనిపించదు. ఆయన నిర్ణయాలు ఎంత వేగంగా తీసుకున్నారో దానికి మిశ్రమ స్పందన కూడా అంతే వేగంతో వస్తోంది. ఈవ్ టీజింగ్ నియంత్రణకు, ప్రభుత్వ అధికారుల సమయపాలన, పారిశుధ్య పనులు, రోడ్ల నిర్మాణం తదితరమైనవి మొత్తం 50 నిర్ణయాలు యోగి తీసుకున్నారు. అందులో టాప్ 15 నిర్ణయాలు ఒకసారి పరిశీలిస్తే..
1. రాష్ట్రంలోని అన్ని రహదారులు బీతావాహంగా మారాయి. వీటికి జూన్ 15నాటికి విముక్తి ప్రసాదించాలి
2.మహిళల సంరక్షణ కోసం ప్రత్యేక రోమియో టీములు
3.ప్రభుత్వ కార్యాలయాల్లోకి పాన్, గుట్కా, పాలిథిన్ కవర్లు నిషేధం
4.ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించేలా సిటిజన్స్ చార్టర్ ఏర్పాటు
5.ప్రతి నెల ప్రతి శాఖ అభివృద్ధి పనులపై నివేదిక అందించాలి
6.ప్రభుత్వ గుర్తింపు లేని కబేళాల, మాంసం విక్రయశాలల మూసివేత.
7.అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
8.అలహాబాద్, మీరట్, ఆగ్రా, గోరఖ్‌పూర్, ఝాన్సీలో మెట్రో రైలు
9.ప్రభుత్వ ఫైళ్లను ఇంటికి తీసుకెళ్లడంపై నిషేధం
10.రాజకీయ నాయకుల భద్రతపై సమీక్షలు
11.అధికారులు, మంత్రుల ఆస్తుల వివరాల అందజేతకు ఆదేశాలు
12.అన్ని సహకార సంఘాలు పనిచేసేలా చర్యలు
13.ఉపాధ్యాయులు పాఠశాలల్లో టీ షర్ట్‌లు వేయకుండా నిషేధం
14.అత్యవసరంలో తప్ప సాధారణ సమయాల్లో టీచర్ల ఫోన్ వాడకంపై నిషేధం
15.ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో బయోమెట్రిక్ ఏర్పాటు