గ్యాస్ లీక్.. 50 మంది విద్యార్థులకు అస్వస్థత
దక్షిణ ఢిల్లీలో తెల్లవారుజామునే పెనుప్రమాదం త్రుటిలో తప్పింది. తుగ్లకాబాద్‌కు సమీపంలోని పుల్ పెహ్లాద్‌పూర్ ప్రాంతంలో ఉన్న రాణీ ఝాన్సీ స్కూలు సమీపంలో ఓ కంటెయినర్ నుంచి గ్యాస్ లీకైంది. దాంతో వంద మంది విద్యార్థులను స్కూలు నుంచి వెంటనే బయటకు తీసుకొచ్చేశారు. వారిలో 50 మంది అస్వస్థత పాలు కావడంతో వారిని వెంటనే సమీపంలో ఉన్న మూడు వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. ఘటన స్థలానికి అంబులెన్సులతో పాటు పోలీసులు చేరుకున్నారు.
గ్యాస్ లీకేజికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్యాస్ లీకైన సమయానికి ఎక్కడా మంటలు లేకపోవడం.. సమయానికి అప్రమత్తమై విద్యార్థులను బయటకు తీసుకొచ్చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. గతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ పైపులైన్ల నుంచి గ్యాస్ లీకైనప్పుడు టీ పెట్టేందుకు స్టవ్ వెలిగించాలని అగ్గిపుల్ల గీస్తే.. ఆ మంటలు ఊరంతా వ్యాపించిన గ్యాస్‌కు అంటుకుని భారీ ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.