స్వాతంత్ర్యానంతరం 700 పైగా ఆర్డినెన్సులు | 700 ordinances have been issued by indian govt after Independence | Sakshi
Sakshi News home page

స్వాతంత్ర్యానంతరం 700 పైగా ఆర్డినెన్సులు

Published Wed, Jan 4 2017 12:19 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

స్వాతంత్ర్యానంతరం 700 పైగా ఆర్డినెన్సులు - Sakshi

స్వాతంత్ర్యానంతరం 700 పైగా ఆర్డినెన్సులు

‘ఆర్డినెన్స్ రాజ్’పై ‘సుప్రీం’ అభిశంసన!
కాంగ్రెస్ ఖాతాలోనే అత్యధిక ఆర్డినెన్సులు
48 ఆర్డినెన్సులను మళ్లీ మళ్లీ జారీ చేసిన వైనం
5 సార్లు పునఃజారీతో మోదీ సర్కారు కొత్త రికార్డు


(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
ఆర్డినెన్సులను పదే పదే పునః జారీచేయడమంటే పార్లమెంటును మోసం చేసినట్లేనంటూ సుప్రీంకోర్టు తప్పుపట్టడం ‘ఆర్ఢినెన్స్ రాజ్’ను అభిశంసించడమేనని నిపుణులు అభివర్ణిస్తున్నారు. నిజానికి బిహార్ రాష్ట్ర ఆర్డినెన్స్కు  సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్య చేసినా.. దీనికి గతంలో సుప్రీంకోర్టు ఆర్డినెన్సులపై ఇచ్చిన కీలకమైన తీర్పే మూలం. అంతేకాదు.. ఆర్డినెన్స్ జారీ విషయంలో రాష్ట్రపతి లేదా గవర్నర్ ‘సంతృప్తి’ చెందడం ‘న్యాయ సమీక్ష’కు అతీతం కాదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం ద్వారా.. ఆర్డినెన్సుల చెల్లుబాటును సమీక్షించవచ్చునని పేర్కొంది. దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచీ కేంద్రంలోని అన్ని ప్రభుత్వాలూ ఆర్డినెన్సులు జారీ చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో ‘ఆర్డినెన్స్ పాలన’ పూర్వాపరాలివీ...

భారతదేశంలో చట్టాలు చేసే అధికారం ప్రజాప్రతినిధులతో కూడిన చట్టసభలదే. అంటే కేంద్రంలో పార్లమెంటు, రాష్ట్రాల్లో శాసనసభలు చట్టాలు చేయాలి. అయితే.. రాజ్యాంగంలోని 123 అధికరణ.. పార్లమెంటు సమావేశాలు లేనపుడు, అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైనా చట్టం చేయాల్సి వస్తే ఆర్డినెన్సు జారీ చేయాల్సిందిగా రాష్ట్రపతికి సిఫారసు చేసే వీలు కల్పిస్తోంది. అలాగే.. రాష్ట్రాల్లో శాసనసభల సమావేశాలు లేనపుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అవసరం మేరకు ఆర్డినెన్సులు జారీ చేసే అధికారం 213 అధికరణ ఇస్తోంది. ఈ వెసులుబాటును ఉపయోగించుకుని.. పార్లమెంటులో లేదా అసెంబ్లీలో ఇబ్బందులు ఎదురవుతాయనుకున్నపుడల్లా ప్రభుత్వాలు ఆర్డినెన్సుల ద్వారా తాము కోరుకున్న చట్టాలు తేవడం పరిపాటిగా మారింది.

కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సులు ఏవైనా సరే.. తర్వాత జరిగే పార్లమెంటు లేదా శాసనసభ సమావేశాల్లో వాటికి ఆమోదం పొందాల్సి ఉంటుంది. లేదంటే ఆ ఆర్డినెన్సులు చెల్లకుండా పోతాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వివాదాస్పదమైన ఆర్డినెన్సులకు పార్లమెంటు లేదా శాసనసభ ఆమోదం పొందడం కష్టమవుతుందని కానీ, జాప్యం జరుగుతుందని కానీ భావిస్తే.. ఆయా ఆర్డినెన్సుల గడువు తీరేలోగా అదే ఆర్డినెన్సును పునఃజారీ చేయడం మొదలుపెట్టాయి. ఇది మరింత తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

భారత రాజ్యాంగం ప్రకారం చట్టాలు చేసే అధికారం చట్టసభలదే. ప్రభుత్వం చేయ దలచుకున్న చట్టాన్ని చట్టసభల్లో చర్చించి, ఆమోదం పొందిన తర్వాత.. చట్టాలుగా నోటిఫై చేయడానికి రాష్ట్రపతి, గవర్నర్ల ‘స్టాంపు’ కోసం పంపించాల్సి ఉంటుంది. కానీ.. ప్రతిపక్షాలతో లేదా స్వపక్షంలోని వారితోనే ఏవైనా ఇబ్బందులు వస్తాయని తలచినపుడు.. ప్రభుత్వాలు రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితి కోసం అనుమతిచ్చిన ‘ఆర్డినెన్స్’ మార్గాన్నే ఎంచుకుంటున్నాయి. పైగా.. ఆయా ఆర్డినెన్సులకు తదుపరి పార్లమెంటు సమావేశం నాటికి ఆమోదం పొందాలన్న నిబంధనను కూడా తోసిరాజని రాష్ట్రపతి, గవర్నర్ల ద్వారా పునః జారీచేస్తున్నాయి. ఇది చట్టసభల అధికారాన్ని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఇకనైనా ప్రభుత్వాల వైఖరి మారుతుందా? అన్నది వేచి చూడాలని పరిశీలకులు చెప్తున్నారు.

బ్రిటిష్ చట్టాల నుంచి రాజ్యాంగంలోకి..: భారతదేశంలో స్వాతంత్ర్యానికి ముందు నుంచీ.. బ్రిటిష్ పాలనలోనే ఆర్డినెన్స్ల ద్వారా చట్టాలు చేసే సంప్రదాయం ఉంది. 1861 ఇండియా కౌన్సిళ్ల చట్టం ప్రకారం భారత గవర్నర్ జనరల్ అత్యవసర పరిస్థితుల్లో ఆర్డినెన్సులు జారీ చేయవచ్చు. అవి గరీష్టంగా ఆరు నెలలు అమలులో ఉంటాయి. ఆ తర్వాత వచ్చిన 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ తన వ్యక్తిగత విచక్షణతో ఆర్డినెన్సులు జారీ చేయవచ్చు. అయితే కొన్ని నిర్దిష్ట అంశాలపై మాత్రం బ్రిటన్ మహారాణి నుంచి ముందుగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే ఆర్డినెన్స్ విధానాన్ని కొన్ని మార్పులతో భారత రాజ్యంగంలో చేర్చారు.

64 ఏళ్లలో 700 పైగా ఆర్డినెన్సులు..: భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చింది. అప్పటి నుంచీ 2014 డిసెంబర్ 31 వరకూ మొత్తం 679 ఆర్డినెన్సులు జారీ చేశారు. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచీ 1952 ఏప్రిల్ 17న మొదటి లోక్సభ ఏర్పాటయ్యే వరకూ 35 ఆర్డినెన్సులు జారీ చేశారు. 2014 మేలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఇప్పటివరకూ దాదాపు 24 ఆర్డినెన్సులు జారీ చేసింది. మొత్తం కలిపితే ఆర్డినెన్సుల సంఖ్య 700 మైలురాయి దాటుతోంది.
- స్వతంత్ర దేశంలో మొట్టమొదటి ఆర్డినెన్స్ 1950 జనవరి 26వ తేదీన జారీ చేశారు. అది ‘పార్లమెంటు (అనర్హత నిరోధం) ఆర్డినెన్స్ – 1950’. కొత్త ఆర్డినెన్స్ - తాజా ఆర్డినెన్స్ పెద్ద నోట్ల రద్దుపై మోదీ ప్రభుత్వం 2016 డిసెంబర్ 30న జారీ చేసిన ఆర్డినెన్స్.
- ఈ మధ్య కాలంలో ఆర్డినెన్సుల విధానంపై, ప్రభుత్వాలు వాటిని జారీ చేస్తున్న తీరుతెన్నులపై ఎప్పటికప్పుడు విమర్శలు, వివాదాలు రేగుతూనే ఉన్నాయి. దేశాన్ని అర్థశతాబ్దానికి పైగా పరిపాలించిన కాంగ్రెస్ హయాం ఖాతాలోనే సహజంగా అత్యధిక ఆర్డినెన్సులు ఉన్నాయి.

ఆర్డినెన్స్ మార్గంలో మోదీ సర్కారు..: కేంద్రంలో నరేంద్రమోదీ సర్కారుకు రాజ్యసభలో సంఖ్యా బలం తక్కువగా ఉండటంతో అత్యవసర ఆర్డినెన్సుల ద్వారా చాలా కీలక విధాన మార్పులను అమలులోకి తెస్తూ ‘ఆర్డినెన్స్ రాజ్’గా అపకీర్తి మూటగట్టుకుంది. విపక్షాలు అడ్డుచెప్తాయనుకున్న ప్రతిసారీ పార్లమెంటును పక్కనపెట్టి ఆర్డినెన్స్ మార్గలో చట్టాలు చేస్తోంది. అందులో భూసేకరణ చట్టానికి సవరణ, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచడం వంటి కీలక ఆర్డినెన్సులు ఉన్నాయి. భూసేకరణ చట్టాన్ని ఆర్డినెన్స్ ద్వారా సవరణ చేయాల్సినంత అత్యవసరం ఏముందని స్వయంగా రాష్ట్రపతి కూడా నాడు మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పార్లమెంటులో అవాంతరాలు కల్పిస్తున్నారన్న సాకుతో మోదీ ప్రభుత్వం కొన్ని ఆర్డినెన్సులను మళ్లీ మళ్లీ పునఃజారీ చేస్తూ పాలన సాగిస్తూ విమర్శల పాలవుతోంది. తాజాగా పెద్ద నోట్ల రద్దు విషయంలోనూ ఆర్డినెన్స్ ద్వారానే చట్టం చేసింది.

 ‘అవాంతరాలు’ ఒక సాకు మాత్రమే..: కేంద్ర ప్రభుత్వాలు ఆర్డినెన్సులు జారీ చేయడానికి.. పార్లమెంటులో అవాంతరాలను సాకుగా చెప్పడం తరచుగా జరుగుతోంది. ప్రభుత్వ అభివృద్ధి విధానాలకు ప్రతిపక్షాలు మోకాలడ్డుతున్నాయని, కాబట్టి ఆర్డినెన్సుల ద్వారానైనా ముందుకు సాగక తప్పదని సమర్థించుకుంటున్నాయి. కానీ.. స్వాతంత్ర్యానంతరం నుంచీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంటులో తగినంత మెజారిటీ దాదాపు ఎల్లప్పుడూ ఉంది. అయినా.. నెహ్రూ హయాం నుంచీ ఆర్డినెన్సులు జారీ చేయడం అలవాటుగా మారిపోయింది. ఆర్డినెన్సులనేవి ‘బానిసత్వపు లక్షణం’ అని ఒక సందర్భంలో అభివర్ణించిన జవహర్లాల్నెహ్రూ.. తను ప్రధానమంత్రిగా 66 ఆర్డినెన్సులు జారీ చేశారు. ఇక యూపీఏ హయాంలోని 14వ లోక్సభ కాలంలో ప్రకటించిన 36 ఆర్డినెన్సుల్లో.. కేవలం 6 ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు మాత్రమే పార్లమెంటులో నిలిచిపోయాయి. అలాగే.. 15వ లోక్సభ హయాంలో జారీ చేసిన 25 ఆర్డినెన్సుల్లో కేవలం 3 ఆర్డినెన్సుల బిల్లులు మాత్రమే పార్లమెంటులో స్తంభించిపోయాయి.

స్థానబలిమిని బట్టి మారిపోయే మాట..: ప్రభుత్వ విధానాల విషయంలో పార్టీల వైఖరి అధికారంలో ఉన్నప్పటికి, ప్రతిపక్షంలో ఉన్నప్పటికి ఎంతో మారిపోతుంటుంది. పార్లమెంటులో వ్యవహరించే శైలి కూడా అలాగే తలకిందులవుతుంది. యూపీఏ సర్కారు హయాంలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ కూడా పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేసే రాజకీయాలు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్, ఇతర విపక్షాలు పార్లమెంటులో అదే పాత్ర పోషిస్తున్నాయి. ఆర్డినెన్సుల విషయంలోనూ పార్టీల అభిప్రాయం ఇదే విధంగా అవి ఉన్న ‘స్థానాన్ని బట్టి’ మారిపోతుంటుంది. ప్రస్తుత ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ సహా చాలా మంది యూపీఏ సర్కారును ‘ఆర్డినెన్స్ రాజ్’గా అభివర్ణిస్తూ.. చట్టం చేసే అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అదే అరుణ్ జైట్లీ ఆర్థికమంత్రిగా ఉండగా.. 2014లో మోదీ సర్కారు బీమా సంస్థల్లో ఎఫ్డీఐ పరిమితిని 49 శాతానికి పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత మాట్లాడుతూ.. రాజ్యసభ ఈ బిల్లును చేపట్టకుండా వాయిదా వేస్తున్నా కూడా.. దేశం ఇక ఏమాత్రం వేచిచూడజాలదని ప్రపంచానికి, పెట్టుబడిదారులకు ఆ ఆర్డినెన్స్ ప్రకటిస్తోందని వ్యాఖ్యానించారు.

పునః జారీకి ఆద్యుడు పీవీ.. మోదీ కొత్త రికార్డు: ఆర్డినెన్సుల కాలం తీరిని తర్వాత వాటిని పునః జారీ చేసే విధానానికి కేంద్రంలో పి.వి.నరసింహారావు సర్కారు 1993 జనవరి 2న శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచీ ఇప్పటివరకూ ప్రతి ప్రభుత్వమూ (1996లో వాజపేయి 13 రోజుల ప్రభుత్వం మినహా) ఆర్డినెన్సులను పునః జారీ చేస్తూనే ఉంది. ఇలా ఇప్పటివరకూ కేంద్రం 48 ఆర్డినెన్సులను మళ్లీ మళ్లీ జారీ చేసింది. ఇందులో అత్యధికంగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (సవరణ) ఆర్డినెన్స్ – 2010 ని అత్యధికంగా నాలుగు సార్లు పునః జారీచేశారు. తాజాగా మోదీ సర్కారు ఈ రికార్డును అధిగమించింది. ఎనిమీ ప్రాపర్టీ (సవరణ) ఆర్డినెన్సును గత నెలలో ఐదోసారి పునఃజారీ చేసింది.  రాష్ట్రపతి ప్రణబ్ దీనిపై సంతకం చేసినప్పటికీ.. ఐదోసారి ఎందుకు ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ‘నోట్’ పంపించారు. ఇది దేశ ప్రాధాన్యతకు సంబంధించిన అంశం కాబట్టి తాను ఆమోదం తెలిపానని.. అయితే ఒక ఆర్డినెన్సును ఇన్నిసార్లు పునఃజారీ చేయడం సరికాదని ఆ నోట్లో రాష్ట్రపతి పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఆర్డినెన్స్ మినహా ఇప్పటివరకూ కేంద్రం స్థాయిలో మరే ఆర్డినెన్సునూ ఐదు సార్లు పునఃజారీ చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement