Laws in India
-
కోర్టుకు వెళ్ళకపోతే భూమేపోవచ్చు..!
నేను ఇటీవలే హైదరాబాద్ శివార్లలో కొంతకాలం కొన్నాను. కొనేముందు అమ్మకందార్లు మాకు హద్దురాళ్ళు కూడా చూపించారు. భూమి కొనుగోలు చేసిన తర్వాత కొన్నాళ్ళకి మా హద్దుల ప్రకారం ఫెన్సింగ్ వేసుకుందాము అని వెళ్ళగా, మాకు భూమి అమ్మినవారు – మాకు దక్షిణాన ఉన్నవారు కూడా మా భూమి హద్దులు అవి కాదు అని, దాదాపు 10 గుంటల భూమి నష్టపోయేలా హద్దులు చూపిస్తున్నారు. అది మాత్రం కాదు కాబట్టి ఏమీ అనలేకపోతున్నాం. కోర్టుకు వెళ్తే కేసులు పరిష్కారం అయ్యేసరికి చాలాకాలం పడుతుంది. అంతవరకూ మా భూమిలో మేము ఏమీ చేసుకోలేము అంటున్నారు. దయచేసి మా సమస్యకు ఒక పరిష్కారం చూపగలరు.– జి. రామ్మోహన్, కందుకూరుభూమిని కొనేటప్పుడు హద్దులు సరిగా చూసుకుని, వీలైతే హద్దురాళ్ళు పాతుకుని, పక్కన ఉన్న భూమి యజమానులను కూడా సంప్రదించి కొంటే, ఇలాంటి సమస్యలు తలెత్తవు. ఏదేమైనా, మీరు ప్రభుత్వానికి సరైన స్టాంప్ డ్యూటీ కట్టి, చట్టప్రకారం రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి, అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే మీకు దగ్గరలోని ఏదైనా ‘మీ సేవా’ కేంద్రానికి వెళ్లి, ‘ఎఫ్–లైన్’ అప్లికేషన్/దరఖాస్తు చెయ్యండి. ప్రభుత్వ నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకున్నట్లు అయితే 45 రోజుల లోగా రెవిన్యూ అధికారులు మీ భూమిని సర్వేచేసి, హద్దులు చూపిస్తారు. అలా చేయని పక్షంలో, పైఅధికార్లకు, ఆర్.డీ.ఓ కి ఫిర్యాదు/దరఖాస్తు పత్రం ఇవ్వండి. అప్పటికీ చేయకపోతే మీరు సర్వే కోసం హై కోర్టును ఆశ్రయించవచ్చు. సర్వే అనంతరం కూడా ఏమైనా సమస్య వుంటే, సివిల్ కోర్టులో వ్యాజ్యం ద్వారా మీ భూమిలో మరొకరు జోక్యం చేసుకోకుండా ఆర్డరు పొందవచ్చు.సివిల్ కోర్టులో కేసులు ఆలస్యం అవుతాయి అనేమాట కొంతవరకూ నిజమే. కానీ త్వరితగతిన మీ కేసు పరిష్కరించటానికి చట్టపరమైన వెసులుబాట్లు కూడా ఉన్నాయి. కేసు నడిచినంతవరకు మీ భూమిలో మీరు ఏమీ చేసుకోలేరు అన్నది అవాస్తవం. హద్దుల సమస్య ఉన్నంత భూమి వరకు మీ పక్కవారు రానివ్వరు. మిగతా భూమిలో మీరు ఏమైనా చేసుకోవచ్చు. పూర్తిగా కేసు పరిష్కారం అయ్యేలోపు మధ్యంతర ఉత్తర్వులు పొంది, మీ హక్కుని మీరు కాపాడుకోవచ్చు. కోర్టుకు వెళ్తే ఆలస్యం అవుతుంది అని కోర్టుకు వెళ్ళకపోతే భూమేపోవచ్చు కాబట్టి జాగ్రత్త! చట్టపరమైన చర్యలలో మాత్రమే పరిష్కారాలు పొందాలి. అప్పుడే శాశ్వత పరిష్కారాలు అందుతాయి. అలా కాదని అనుకుంటే ముందు ముందు సమస్యలు మరింత జటిలం కావచ్చు!– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిన్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. (చదవండి: ఫేమస్ బ్రిటిష్ మ్యూజిక్ బ్యాండ్ లోగోకి ప్రేరణ కాళిమాత..!) -
కాలం చెల్లిన చట్టాలు మీకు చుట్టాలా?
కాలం చెల్లిన పురాతన చట్టాలను రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అవును పురాతన, కాలం చెల్లిన చట్టాలను కాలగర్భంలో కలపవలసిందే. కానీ అవే కాలం చెల్లిన చట్టాలను రైతుల మీద, వయోజనుల మీద, విద్యార్థుల మీద, రాజకీయ కార్యకర్తల మీద, ప్రశ్నను ఆయుధంగా మలుచుకున్నవారి మీద ప్రయోగించడాన్ని ఏమనాలి? ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న వారిని ఎప్పటిదో బ్రిటిష్ కాలంనాటి దేశద్రోహ చట్టంతో నోళ్లు మూయించడానికి ప్రయత్నించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దానికి జవాబు స్పష్టంగా అర్థం అవుతోంది. వర్గదోపిడీ ప్రయోజనాల రక్షణ కోసమే కొత్త చట్టాలు తేవాలి. ఆ ప్రయోజనాల రక్షణకు పనికొస్తాయంటే పాత చట్టాలైనా సరే వాటిని పట్టుకుని వేలాడాలి. ‘కాలం చెల్లిన పురాతన చట్టాలను రద్దు చేయక తప్పదు. తద్వారా దేశంలో వర్తక, వ్యాపార, వాణిజ్యాలను మరింత సులభతరం చేయాలి.’ –ప్రధాని మోదీ (నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకటన: 20 ఫిబ్రవరి 21) ‘మీ పాలకుడెవరో చెప్పాలి. ఆ దేశ చట్టాలు ఎలా ఉండబోతాయో చెప్తా.’ – సెయింట్ అగస్తీన్ ఇంతకూ ఆ ‘కాలం చెల్లిన చట్టాలు’ ఏమిటో ప్రధానమంత్రి వివరించలేకపోయారు. భారత పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అణచివేస్తూ వలస సామ్రాజ్య పాలకులైన బ్రిటిష్ వారు 200 ఏళ్లకు పైగా అమలు చేసిన, ఈ నాటికీ స్వతంత్ర భారతంలో ‘దేశద్రోహం’ పేరిట పౌరులపై పాలకులు కొనసాగిస్తున్న ఇండియన్ పీనల్ కోడ్ లాంటి చట్టాలకు కూడా ప్రధాని ప్రకటించిన పురాతన చట్టాల ‘రద్దు పద్దు’ వర్తిస్తుందా లేదా అన్నది తెలియదు. పురాతన చట్టాలకు ‘కాలం చెల్లినప్పుడు’ 1860 నాటి పీనల్ కోడ్, అందులోని ‘దేశద్రోహం’ అభియోగాన్ని ప్రభుత్వ ›ప్రజా వ్యతిరేక విధానాలను, చర్యలను ప్రశ్నించే భారత పౌర సమాజంపైన, ఆందోళన చేసే వయో జనుల పైన, విద్యార్థులపైన, రాజకీయ కార్యకర్తలపైన నోళ్లు నొక్కడానికి వినియోగించే వలస చట్టంలోని ‘124–ఎ’ సెక్షన్, ఆ తర్వాత క్రమంగా దేశవాళీ పాలకులు ఇండియన్ పీనల్ కోడ్‌లో చొప్పించిన ‘153–ఎ సెక్షన్లకు కూడా ‘కాలం చెల్లిన పురాతన చట్టాల రద్దు’ వర్తిస్తుందా లేదా? రైతు వ్యవసాయక ప్రయోజనాలకు వ్యతిరేకంగా రూపొం దించిన మూడు చట్టాలను రద్దుచేయాలని రైతులు, వ్యవసాయ కార్మికులు సాగిస్తున్న మహోద్యమాన్ని అణచడానికి ఉద్దేశించిన చట్టాలు కూడా ‘కాలం చెల్లిన చట్టాల’ కిందికి వస్తాయా, రావా? బ్రిటిష్ వాడి ఇండియన్ పీనల్ కోడ్ వచ్చింది 1860లో. భారత స్వాతంత్య్రం కోసం ప్రారంభమైన ప్రజల తొలి తిరుగుబాటు వచ్చిన మూడేళ్లకు. 1870లో పెనాల్టీలు విధించి, ప్రజల నోళ్లు మూయిం చడానికి 124–ఎ సెక్షన్‌ను ప్రభుత్వంపై తిరుగుబాటు అనే క్లాజు కింద ‘దేశద్రోహ’ నేరాన్ని పీనల్ కోడ్‌లోని 6వ అధ్యాయంలో దూర్చారు. ‘కామన్ లా’ చరిత్రలో ‘దేశద్రోహం’ అనే నేరారోపణను మొదటి సారిగా ఇరికించడం అదే ప్రారంభం. అయితే 1947లో మన దేశం స్వాతంత్య్రం పొందిన తరువాత దేశ రాజ్యాంగ నిర్ణయ సభ పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేసే ‘దేశద్రోహ’ అభియోగంపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది. స్వాతంత్య్ర పోరాట యోధులకు వ్యతిరేకంగా వారి భావ ప్రకటనా స్వేచ్ఛను అణచడానికి ఉద్దేశించిన బ్రిటిష్ పాలకుల చట్టం సెడిషన్ అని రాజ్యాంగ నిర్ణయ సభ ప్రకటిం చాల్సి వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ సహితం వాచా ఈ దుర్మార్గపు సెక్షన్ (124–ఎ)ను వ్యతిరేకించినవాడే. అయినా బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టిన ఈ విద్రోహ చట్టం అటు కాంగ్రెస్ హయాంలోనూ, తర్వాత బీజేపీ–ఎన్డీఏ పాలనలోనూ ఈ రోజుకీ కొనసాగుతూనే వస్తోంది. ఫలితంగా పాలకుల ప్రజా వ్యతిరేక చర్యలను ప్రతిఘటించే వ్యక్తులపైన బ్రిటిష్ వాడి ‘సెక్షన్ 124–ఎ’ కొనసాగుతున్న పాత అణచివేత చట్టాలలో ఒకటి. ప్రధాని మోదీ రద్దు కావాలని ప్రకటిం చిన కాలం చెల్లిన చట్టాలలోకి ఇది కూడా వస్తుందా, రాదా? పండిం చిన పంటకు కనీస గిట్టుబాటు ధరను చట్టబద్ధం చేయాలన్న మహో ద్యమ సమయంలో ఇటీవల 180 మంది రైతులు హతులయ్యారని మరచిపోరాదు. పార్లమెంటు స్థాయీ సంఘాలకు, విచారణ కమిటీలకు, ఆమోదించిన బిల్లులను పరిశీలించడానికి నివేదించే చట్టబద్ధ ధర్మాన్ని కూడా తోసిరాజంటున్న పాలకుల దృష్టిలో ‘కాలం చెల్లిన చట్టాల రద్దుపద్దు’ కిందికి మరే చట్టాలు వస్తాయి? ఆ విషయాన్ని కూడా మోదీ కుండబద్దలు కొట్టి చెప్పడంతో పాలక విధానాల స్వరూప, స్వభావాలు కాస్తా బయట పడిపో యాయి. ఆయన రద్దుచేయమని కోరుతున్న ‘ఆ కాలం చెల్లిన చట్టాలు’ ప్రపంచ బ్యాంకు ‘సంస్కరణల’ పేరిట ప్రవేశపెట్టిన, బడా పెట్టుబడి దారీ వర్తక వాణిజ్య ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పించేందుకు వీలుగా రద్దుచేయాలని మాత్రమే. అందుకే కేంద్రం తెచ్చిన మూడు చట్టాలు (పంటలకు కనీస మద్దతు ధరను చట్టంగా రూపొందిం చడానికి నిరాకరిస్తూ) కార్పొరేట్ వ్యవసాయ క్షేత్రాల ప్రయోజనాల రక్షణకు ఉద్దేశించినవని మరచిపోరాదు. కనుకనే రాష్ట్రాలలోని రైతాంగ వ్యవసాయ ప్రయోజనాల రక్షణ కోసం రాజ్యాంగం 7వ షెడ్యూల్లోని రెండవ జాబితాలో 14వ ఎంట్రీని చేర్చవలసివచ్చిందని 78 మంది విశ్రాంత ఐఏఎస్, ఏపీఎస్ ఉన్నతాధికారులు ఒక ప్రకట నలో గుర్తుచేయాల్సి వచ్చింది. ఈ జాబితా కింద వ్యవసాయ సంబం ధిత నిబంధనలు పూర్తిగా రాష్ట్రాల పరిధిలోని అంశాలని నిర్దేశించినా, వాటిలో బీజేపీ పాలకులు తల దూర్చడానికి కారణం వలస చట్టాలేనని గుర్తించడం అవసరం. ఈ పాత వలస చట్టాలకు కాలం చెల్లినా మన పాలకులు అనుసరించడానికి కారణం– వర్గదోపిడీ ప్రయోజనాల రక్షణ కోసమే. దేశ పౌరుల కుల, మత, వర్గ విభజనలో భాగంగా సరికొత్త ‘పౌరసత్వ సవరణ’ చట్టాన్ని,‘నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజెన్స్’ చట్టాన్ని కేంద్రం ప్రవేశపెట్టడాన్ని సుప్రీంకోర్టు, పెక్కుమంది న్యాయవాదులు నిరసించి ఆందోళన చేస్తున్నా ‘కాలం చెల్లిన పాత చట్టాలే’ మన చుట్టాలుగా అమలులో ఉంటున్నాయి. పాలకుల ప్రజావ్యతిరేక చర్యలకు నిరసనగా గత కొన్నేళ్లుగా కేంద్ర పురస్కారాలు పొందిన వివిధ రంగాలకు చెందిన పలువురు దేశ భక్తులు తమ బిరుద బీరాలను తిరిగి కేంద్ర ప్రభుత్వానికి వాపసు చేసి మరీ నిరసన తెలిపిన సంగతిని మరువరాదు. పౌర సమాజ హితాన్ని కోరి ఉద్యమించిన గోవింద్ పన్సారే, ప్రొఫెసర్ కల్బుర్గి, నరేంద్ర దబోల్కర్, గౌరీ లంకేష్ లాంటి హేతువాద ఉద్యమ ఉద్దండ మేధావులు బీజేపీ పాలనలోనే నర్మగర్భ హత్యలకు గురైనా ‘కాలం చెల్లిన చట్టాలు’ మాత్రం రద్దు కావడం లేదు. అనేక సామాజిక దురన్యాయాలపై ధ్వజమెత్తి ప్రజల పక్షాన నిలబడిన సుప్రీంకోర్టు విశిష్ట మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.బి.సవంత్, ఆయన సన్నిహిత సహచరుడు, బొంబాయి హైకోర్టు జడ్జి పి.జి.కోల్స్ పాటిల్ సంయుక్తంగా ఎల్గార్ పరిషత్ దళిత సభలు నిర్వహించారు. బ్రిటిష్ కాలం నాటి దళిత వ్యతిరేక పాలకుల దాష్టీ కాలకు నిరసనగా ఏటా జరిపే సభలను అణచడానికి కేంద్ర ప్రభుత్వం ‘దేశద్రోహ’ నేర చట్టాన్ని దుమ్ముదులిపి ఆ సభలపై ప్రయోగించింది. దానికి పైన పేర్కొన్న ఇద్దరు ప్రముఖ న్యాయ మూర్తులు హాజరైన సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఉరుమురిమి మంగళం మీద పడిన’ చందంగా సభకు హాజరుకాని పౌర ఉద్యమ కార్యకర్తలపైనా, రచయితలపైనా ‘దేశద్రోహ’ నేరంపై నిర్బంధ విధానం అమలు జరిపి ప్రభుత్వం అభాసుపాలైంది. గౌరవ సుప్రీం జస్టిస్ ధనంజయ చంద్రచూడ్, ‘నేటి పరిస్థితుల్లో ‘ఒక వ్యంగ్య చిత్రకారుడ్ని (కార్టూనిస్టు) దేశద్రోహ నేరం కింద జైలుకి పంపించడమంటే దేశ రాజ్యాంగ చట్టం విఫలమైనట్టే’ నని ప్రకటిం చడం నేడు దేశ పాలనా రంగం ఏ స్థితిలో కూరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ‘దేశద్రోహ’ నేరం కింద బ్రిటిష్ ఇండియాలో జరిగిన తొలి అరెస్టు బాలగంగాధర తిలక్‌ది కాగా, తర్వాత అరెస్టులన్నీ గాంధీ, సుభాష్ చంద్రబోస్, ఆజాద్, నెహ్రూలవి. ఇవే చట్టాల ఆధారంగా ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించింది. క్రమంగా పాలకవర్గాలు తమ విధానాల రక్షణార్థం న్యాయస్థానాల మీద ఆధార పడాల్సి రావడం, అలాగే న్యాయ మూర్తులు కొందరు తమ ప్రయో జనాల రక్షణార్థం పాలక శక్తులపై ఆధారపడవలసి రావడం వల్ల దేశంలో ప్రజాస్వామ్యానికి రానున్న ప్రమాదాన్ని గ్రహించి తన ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన న్యాయమూర్తుల పత్రికా గోష్ఠిలో (12 జనవరి 2018) జస్టిస్ చలమేశ్వర్ హెచ్చరించారని మరువరాదు. abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
స్వాతంత్ర్యానంతరం 700 పైగా ఆర్డినెన్సులు
► ‘ఆర్డినెన్స్ రాజ్’పై ‘సుప్రీం’ అభిశంసన! ► కాంగ్రెస్ ఖాతాలోనే అత్యధిక ఆర్డినెన్సులు ► 48 ఆర్డినెన్సులను మళ్లీ మళ్లీ జారీ చేసిన వైనం ► 5 సార్లు పునఃజారీతో మోదీ సర్కారు కొత్త రికార్డు (సాక్షి నాలెడ్జ్ సెంటర్) ఆర్డినెన్సులను పదే పదే పునః జారీచేయడమంటే పార్లమెంటును మోసం చేసినట్లేనంటూ సుప్రీంకోర్టు తప్పుపట్టడం ‘ఆర్ఢినెన్స్ రాజ్’ను అభిశంసించడమేనని నిపుణులు అభివర్ణిస్తున్నారు. నిజానికి బిహార్ రాష్ట్ర ఆర్డినెన్స్‌కు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్య చేసినా.. దీనికి గతంలో సుప్రీంకోర్టు ఆర్డినెన్సులపై ఇచ్చిన కీలకమైన తీర్పే మూలం. అంతేకాదు.. ఆర్డినెన్స్ జారీ విషయంలో రాష్ట్రపతి లేదా గవర్నర్ ‘సంతృప్తి’ చెందడం ‘న్యాయ సమీక్ష’కు అతీతం కాదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం ద్వారా.. ఆర్డినెన్సుల చెల్లుబాటును సమీక్షించవచ్చునని పేర్కొంది. దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచీ కేంద్రంలోని అన్ని ప్రభుత్వాలూ ఆర్డినెన్సులు జారీ చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో ‘ఆర్డినెన్స్ పాలన’ పూర్వాపరాలివీ... భారతదేశంలో చట్టాలు చేసే అధికారం ప్రజాప్రతినిధులతో కూడిన చట్టసభలదే. అంటే కేంద్రంలో పార్లమెంటు, రాష్ట్రాల్లో శాసనసభలు చట్టాలు చేయాలి. అయితే.. రాజ్యాంగంలోని 123 అధికరణ.. పార్లమెంటు సమావేశాలు లేనపుడు, అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైనా చట్టం చేయాల్సి వస్తే ఆర్డినెన్సు జారీ చేయాల్సిందిగా రాష్ట్రపతికి సిఫారసు చేసే వీలు కల్పిస్తోంది. అలాగే.. రాష్ట్రాల్లో శాసనసభల సమావేశాలు లేనపుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అవసరం మేరకు ఆర్డినెన్సులు జారీ చేసే అధికారం 213 అధికరణ ఇస్తోంది. ఈ వెసులుబాటును ఉపయోగించుకుని.. పార్లమెంటులో లేదా అసెంబ్లీలో ఇబ్బందులు ఎదురవుతాయనుకున్నపుడల్లా ప్రభుత్వాలు ఆర్డినెన్సుల ద్వారా తాము కోరుకున్న చట్టాలు తేవడం పరిపాటిగా మారింది. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సులు ఏవైనా సరే.. తర్వాత జరిగే పార్లమెంటు లేదా శాసనసభ సమావేశాల్లో వాటికి ఆమోదం పొందాల్సి ఉంటుంది. లేదంటే ఆ ఆర్డినెన్సులు చెల్లకుండా పోతాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వివాదాస్పదమైన ఆర్డినెన్సులకు పార్లమెంటు లేదా శాసనసభ ఆమోదం పొందడం కష్టమవుతుందని కానీ, జాప్యం జరుగుతుందని కానీ భావిస్తే.. ఆయా ఆర్డినెన్సుల గడువు తీరేలోగా అదే ఆర్డినెన్సును పునఃజారీ చేయడం మొదలుపెట్టాయి. ఇది మరింత తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. భారత రాజ్యాంగం ప్రకారం చట్టాలు చేసే అధికారం చట్టసభలదే. ప్రభుత్వం చేయ దలచుకున్న చట్టాన్ని చట్టసభల్లో చర్చించి, ఆమోదం పొందిన తర్వాత.. చట్టాలుగా నోటిఫై చేయడానికి రాష్ట్రపతి, గవర్నర్ల ‘స్టాంపు’ కోసం పంపించాల్సి ఉంటుంది. కానీ.. ప్రతిపక్షాలతో లేదా స్వపక్షంలోని వారితోనే ఏవైనా ఇబ్బందులు వస్తాయని తలచినపుడు.. ప్రభుత్వాలు రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితి కోసం అనుమతిచ్చిన ‘ఆర్డినెన్స్’ మార్గాన్నే ఎంచుకుంటున్నాయి. పైగా.. ఆయా ఆర్డినెన్సులకు తదుపరి పార్లమెంటు సమావేశం నాటికి ఆమోదం పొందాలన్న నిబంధనను కూడా తోసిరాజని రాష్ట్రపతి, గవర్నర్ల ద్వారా పునః జారీచేస్తున్నాయి. ఇది చట్టసభల అధికారాన్ని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఇకనైనా ప్రభుత్వాల వైఖరి మారుతుందా? అన్నది వేచి చూడాలని పరిశీలకులు చెప్తున్నారు. బ్రిటిష్ చట్టాల నుంచి రాజ్యాంగంలోకి..: భారతదేశంలో స్వాతంత్ర్యానికి ముందు నుంచీ.. బ్రిటిష్ పాలనలోనే ఆర్డినెన్స్‌ల ద్వారా చట్టాలు చేసే సంప్రదాయం ఉంది. 1861 ఇండియా కౌన్సిళ్ల చట్టం ప్రకారం భారత గవర్నర్ జనరల్ అత్యవసర పరిస్థితుల్లో ఆర్డినెన్సులు జారీ చేయవచ్చు. అవి గరీష్టంగా ఆరు నెలలు అమలులో ఉంటాయి. ఆ తర్వాత వచ్చిన 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ తన వ్యక్తిగత విచక్షణతో ఆర్డినెన్సులు జారీ చేయవచ్చు. అయితే కొన్ని నిర్దిష్ట అంశాలపై మాత్రం బ్రిటన్ మహారాణి నుంచి ముందుగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే ఆర్డినెన్స్ విధానాన్ని కొన్ని మార్పులతో భారత రాజ్యంగంలో చేర్చారు. 64 ఏళ్లలో 700 పైగా ఆర్డినెన్సులు..: భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చింది. అప్పటి నుంచీ 2014 డిసెంబర్ 31 వరకూ మొత్తం 679 ఆర్డినెన్సులు జారీ చేశారు. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచీ 1952 ఏప్రిల్ 17న మొదటి లోక్‌సభ ఏర్పాటయ్యే వరకూ 35 ఆర్డినెన్సులు జారీ చేశారు. 2014 మేలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఇప్పటివరకూ దాదాపు 24 ఆర్డినెన్సులు జారీ చేసింది. మొత్తం కలిపితే ఆర్డినెన్సుల సంఖ్య 700 మైలురాయి దాటుతోంది. - స్వతంత్ర దేశంలో మొట్టమొదటి ఆర్డినెన్స్ 1950 జనవరి 26వ తేదీన జారీ చేశారు. అది ‘పార్లమెంటు (అనర్హత నిరోధం) ఆర్డినెన్స్ – 1950’. కొత్త ఆర్డినెన్స్ - తాజా ఆర్డినెన్స్ పెద్ద నోట్ల రద్దుపై మోదీ ప్రభుత్వం 2016 డిసెంబర్ 30న జారీ చేసిన ఆర్డినెన్స్. - ఈ మధ్య కాలంలో ఆర్డినెన్సుల విధానంపై, ప్రభుత్వాలు వాటిని జారీ చేస్తున్న తీరుతెన్నులపై ఎప్పటికప్పుడు విమర్శలు, వివాదాలు రేగుతూనే ఉన్నాయి. దేశాన్ని అర్థశతాబ్దానికి పైగా పరిపాలించిన కాంగ్రెస్ హయాం ఖాతాలోనే సహజంగా అత్యధిక ఆర్డినెన్సులు ఉన్నాయి. ఆర్డినెన్స్ మార్గంలో మోదీ సర్కారు..: కేంద్రంలో నరేంద్రమోదీ సర్కారుకు రాజ్యసభలో సంఖ్యా బలం తక్కువగా ఉండటంతో అత్యవసర ఆర్డినెన్సుల ద్వారా చాలా కీలక విధాన మార్పులను అమలులోకి తెస్తూ ‘ఆర్డినెన్స్ రాజ్’గా అపకీర్తి మూటగట్టుకుంది. విపక్షాలు అడ్డుచెప్తాయనుకున్న ప్రతిసారీ పార్లమెంటును పక్కనపెట్టి ఆర్డినెన్స్ మార్గలో చట్టాలు చేస్తోంది. అందులో భూసేకరణ చట్టానికి సవరణ, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచడం వంటి కీలక ఆర్డినెన్సులు ఉన్నాయి. భూసేకరణ చట్టాన్ని ఆర్డినెన్స్ ద్వారా సవరణ చేయాల్సినంత అత్యవసరం ఏముందని స్వయంగా రాష్ట్రపతి కూడా నాడు మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పార్లమెంటులో అవాంతరాలు కల్పిస్తున్నారన్న సాకుతో మోదీ ప్రభుత్వం కొన్ని ఆర్డినెన్సులను మళ్లీ మళ్లీ పునఃజారీ చేస్తూ పాలన సాగిస్తూ విమర్శల పాలవుతోంది. తాజాగా పెద్ద నోట్ల రద్దు విషయంలోనూ ఆర్డినెన్స్ ద్వారానే చట్టం చేసింది. ‘అవాంతరాలు’ ఒక సాకు మాత్రమే..: కేంద్ర ప్రభుత్వాలు ఆర్డినెన్సులు జారీ చేయడానికి.. పార్లమెంటులో అవాంతరాలను సాకుగా చెప్పడం తరచుగా జరుగుతోంది. ప్రభుత్వ అభివృద్ధి విధానాలకు ప్రతిపక్షాలు మోకాలడ్డుతున్నాయని, కాబట్టి ఆర్డినెన్సుల ద్వారానైనా ముందుకు సాగక తప్పదని సమర్థించుకుంటున్నాయి. కానీ.. స్వాతంత్ర్యానంతరం నుంచీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంటులో తగినంత మెజారిటీ దాదాపు ఎల్లప్పుడూ ఉంది. అయినా.. నెహ్రూ హయాం నుంచీ ఆర్డినెన్సులు జారీ చేయడం అలవాటుగా మారిపోయింది. ఆర్డినెన్సులనేవి ‘బానిసత్వపు లక్షణం’ అని ఒక సందర్భంలో అభివర్ణించిన జవహర్‌లాల్‌నెహ్రూ.. తను ప్రధానమంత్రిగా 66 ఆర్డినెన్సులు జారీ చేశారు. ఇక యూపీఏ హయాంలోని 14వ లోక్‌సభ కాలంలో ప్రకటించిన 36 ఆర్డినెన్సుల్లో.. కేవలం 6 ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు మాత్రమే పార్లమెంటులో నిలిచిపోయాయి. అలాగే.. 15వ లోక్‌సభ హయాంలో జారీ చేసిన 25 ఆర్డినెన్సుల్లో కేవలం 3 ఆర్డినెన్సుల బిల్లులు మాత్రమే పార్లమెంటులో స్తంభించిపోయాయి. స్థానబలిమిని బట్టి మారిపోయే మాట..: ప్రభుత్వ విధానాల విషయంలో పార్టీల వైఖరి అధికారంలో ఉన్నప్పటికి, ప్రతిపక్షంలో ఉన్నప్పటికి ఎంతో మారిపోతుంటుంది. పార్లమెంటులో వ్యవహరించే శైలి కూడా అలాగే తలకిందులవుతుంది. యూపీఏ సర్కారు హయాంలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ కూడా పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేసే రాజకీయాలు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్, ఇతర విపక్షాలు పార్లమెంటులో అదే పాత్ర పోషిస్తున్నాయి. ఆర్డినెన్సుల విషయంలోనూ పార్టీల అభిప్రాయం ఇదే విధంగా అవి ఉన్న ‘స్థానాన్ని బట్టి’ మారిపోతుంటుంది. ప్రస్తుత ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సహా చాలా మంది యూపీఏ సర్కారును ‘ఆర్డినెన్స్ రాజ్’గా అభివర్ణిస్తూ.. చట్టం చేసే అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అదే అరుణ్ జైట్లీ ఆర్థికమంత్రిగా ఉండగా.. 2014లో మోదీ సర్కారు బీమా సంస్థల్లో ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత మాట్లాడుతూ.. రాజ్యసభ ఈ బిల్లును చేపట్టకుండా వాయిదా వేస్తున్నా కూడా.. దేశం ఇక ఏమాత్రం వేచిచూడజాలదని ప్రపంచానికి, పెట్టుబడిదారులకు ఆ ఆర్డినెన్స్ ప్రకటిస్తోందని వ్యాఖ్యానించారు. పునః జారీకి ఆద్యుడు పీవీ.. మోదీ కొత్త రికార్డు: ఆర్డినెన్సుల కాలం తీరిని తర్వాత వాటిని పునః జారీ చేసే విధానానికి కేంద్రంలో పి.వి.నరసింహారావు సర్కారు 1993 జనవరి 2న శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచీ ఇప్పటివరకూ ప్రతి ప్రభుత్వమూ (1996లో వాజపేయి 13 రోజుల ప్రభుత్వం మినహా) ఆర్డినెన్సులను పునః జారీ చేస్తూనే ఉంది. ఇలా ఇప్పటివరకూ కేంద్రం 48 ఆర్డినెన్సులను మళ్లీ మళ్లీ జారీ చేసింది. ఇందులో అత్యధికంగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (సవరణ) ఆర్డినెన్స్ – 2010 ని అత్యధికంగా నాలుగు సార్లు పునః జారీచేశారు. తాజాగా మోదీ సర్కారు ఈ రికార్డును అధిగమించింది. ఎనిమీ ప్రాపర్టీ (సవరణ) ఆర్డినెన్సును గత నెలలో ఐదోసారి పునఃజారీ చేసింది. రాష్ట్రపతి ప్రణబ్ దీనిపై సంతకం చేసినప్పటికీ.. ఐదోసారి ఎందుకు ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ‘నోట్’ పంపించారు. ఇది దేశ ప్రాధాన్యతకు సంబంధించిన అంశం కాబట్టి తాను ఆమోదం తెలిపానని.. అయితే ఒక ఆర్డినెన్సును ఇన్నిసార్లు పునఃజారీ చేయడం సరికాదని ఆ నోట్లో రాష్ట్రపతి పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఆర్డినెన్స్ మినహా ఇప్పటివరకూ కేంద్రం స్థాయిలో మరే ఆర్డినెన్సునూ ఐదు సార్లు పునఃజారీ చేయలేదు.