నేను ఇటీవలే హైదరాబాద్ శివార్లలో కొంతకాలం కొన్నాను. కొనేముందు అమ్మకందార్లు మాకు హద్దురాళ్ళు కూడా చూపించారు. భూమి కొనుగోలు చేసిన తర్వాత కొన్నాళ్ళకి మా హద్దుల ప్రకారం ఫెన్సింగ్ వేసుకుందాము అని వెళ్ళగా, మాకు భూమి అమ్మినవారు – మాకు దక్షిణాన ఉన్నవారు కూడా మా భూమి హద్దులు అవి కాదు అని, దాదాపు 10 గుంటల భూమి నష్టపోయేలా హద్దులు చూపిస్తున్నారు. అది మాత్రం కాదు కాబట్టి ఏమీ అనలేకపోతున్నాం. కోర్టుకు వెళ్తే కేసులు పరిష్కారం అయ్యేసరికి చాలాకాలం పడుతుంది. అంతవరకూ మా భూమిలో మేము ఏమీ చేసుకోలేము అంటున్నారు. దయచేసి మా సమస్యకు ఒక పరిష్కారం చూపగలరు.
– జి. రామ్మోహన్, కందుకూరు
భూమిని కొనేటప్పుడు హద్దులు సరిగా చూసుకుని, వీలైతే హద్దురాళ్ళు పాతుకుని, పక్కన ఉన్న భూమి యజమానులను కూడా సంప్రదించి కొంటే, ఇలాంటి సమస్యలు తలెత్తవు. ఏదేమైనా, మీరు ప్రభుత్వానికి సరైన స్టాంప్ డ్యూటీ కట్టి, చట్టప్రకారం రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి, అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే మీకు దగ్గరలోని ఏదైనా ‘మీ సేవా’ కేంద్రానికి వెళ్లి, ‘ఎఫ్–లైన్’ అప్లికేషన్/దరఖాస్తు చెయ్యండి.
ప్రభుత్వ నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకున్నట్లు అయితే 45 రోజుల లోగా రెవిన్యూ అధికారులు మీ భూమిని సర్వేచేసి, హద్దులు చూపిస్తారు. అలా చేయని పక్షంలో, పైఅధికార్లకు, ఆర్.డీ.ఓ కి ఫిర్యాదు/దరఖాస్తు పత్రం ఇవ్వండి. అప్పటికీ చేయకపోతే మీరు సర్వే కోసం హై కోర్టును ఆశ్రయించవచ్చు. సర్వే అనంతరం కూడా ఏమైనా సమస్య వుంటే, సివిల్ కోర్టులో వ్యాజ్యం ద్వారా మీ భూమిలో మరొకరు జోక్యం చేసుకోకుండా ఆర్డరు పొందవచ్చు.
సివిల్ కోర్టులో కేసులు ఆలస్యం అవుతాయి అనేమాట కొంతవరకూ నిజమే. కానీ త్వరితగతిన మీ కేసు పరిష్కరించటానికి చట్టపరమైన వెసులుబాట్లు కూడా ఉన్నాయి. కేసు నడిచినంతవరకు మీ భూమిలో మీరు ఏమీ చేసుకోలేరు అన్నది అవాస్తవం. హద్దుల సమస్య ఉన్నంత భూమి వరకు మీ పక్కవారు రానివ్వరు. మిగతా భూమిలో మీరు ఏమైనా చేసుకోవచ్చు.
పూర్తిగా కేసు పరిష్కారం అయ్యేలోపు మధ్యంతర ఉత్తర్వులు పొంది, మీ హక్కుని మీరు కాపాడుకోవచ్చు. కోర్టుకు వెళ్తే ఆలస్యం అవుతుంది అని కోర్టుకు వెళ్ళకపోతే భూమేపోవచ్చు కాబట్టి జాగ్రత్త! చట్టపరమైన చర్యలలో మాత్రమే పరిష్కారాలు పొందాలి. అప్పుడే శాశ్వత పరిష్కారాలు అందుతాయి. అలా కాదని అనుకుంటే ముందు ముందు సమస్యలు మరింత జటిలం కావచ్చు!
– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు.
(చదవండి: ఫేమస్ బ్రిటిష్ మ్యూజిక్ బ్యాండ్ లోగోకి ప్రేరణ కాళిమాత..!)
Comments
Please login to add a commentAdd a comment