
మిలిటెంట్ల దాడిలో 11మంది భద్రతా సిబ్బంది మృతి
శ్రీనగర్ : పాక్ ఉగ్రవాదులు సరిహద్దుల్లో మరోసారి రెచ్చిపోయారు. ఉగ్రవాదులకు.. భారత సైన్యానికి మధ్య హోరాహోరిగా జరిగిన కాల్పుల్లో లెఫ్టె నెంట్ కల్నల్ తో సహా ఎనిమిది మంది జవాన్లు మృతిచెందగా, ముగ్గురు పోలీసులు అసువులు బాసారు. బారాముల్లా జిల్లా యూరీ సెక్టార్‌లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 17 మంది మరణించారు. ఈ ఘటనలో ఆరుగురు మిలిటెంట్లు హతమయ్యారు.
తొలుత పోలీసులపై కాల్పులు జరుపుతూ... ఉగ్రవాదులు యూరీ సెక్టార్‌లోని ఓ బంకర్‌లోకి చొరబడ్డారు. వారిని బయటకు రప్పించడానికి సైనికులు రంగంలోకి దిగి వారిని ప్రతిఘటించారు. బంకర్‌లో భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. జమ్మూలో రెండో విడత ఎన్నికలు డిసెంబర్ 9వ తేదీన జరుగనున్న నేపథ్యంలో మిలిటెంట్లు ఈ మారణకాండకు పాల్పడ్డారు.