పెంపుడు జంతువుల కోసం కేన్సర్ క్లినిక్
Published Fri, Sep 8 2017 4:15 PM | Last Updated on Sun, Sep 2 2018 3:30 PM
తిరువనంతపురం: పెంపుడు జంతువుల్లో కేన్సర్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆంకాలజీ సెంటర్‌ను ప్రారంభించింది. దీంతో మూగజీవుల్లో కేన్సర్ లక్షణాలను ముందుగానే కనిపెట్టి చికిత్స చేపట్టేందుకు వీలుంటుందని అధికారులు తెలిపారు. పలోడెలోని ఛీఫ్ డిసీజ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీజ్(సీడీఐఓ) ఏడాది కాలంగా పరిశోధనలు చేపట్టి పెంపుడు జంతువులతో పాటు పశువుల్లోనూ కేన్సర్ కేసులు బాగా పెరిగినట్లు గుర్తించింది.
కాగా, కొత్తగా ఏర్పాటు చేసే కేన్సర్ క్లినిక్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పశువుల ఆస్పత్రుల నుంచి వచ్చే నమూనాలను పరీక్షించి కేన్సర్ ఆనవాళ్లను గుర్తించి అప్రమత్తం చేస్తుంది. అవసరమైన మేరకు చికిత్స కూడా అందిస్తుంది. మనుషుల్లో మాదిరిగానే పశువుల్లో కూడా కేన్సర్ వ్యాప్తి ఎక్కువగా ఉంటోందని సీడీఐవో పాథాలజీ విభాగం వైద్యుడు నందకుమార్ తెలిపారు. ఇప్పటి వరకు సేకరించిన నమూనాలను బట్టి ప్రాణాంతక సైనస్, బ్రెస్ట్ కేన్సర్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు.
తమ యూనిట్‌లో ఆయా జంతువులకు వచ్చిన ట్యూమర్లను పరీక్షించి అవి ఏరకమైనవో వెల్లడిస్తామని.. ప్రమాదకరమైనవైన పక్షంలో కిమోథెరపీ వంటి చికిత్సలకు సంబంధించి సూచనలిస్తామని చెప్పారు. తాజాగా ఏర్పాటు చేసే ఈ కేంద్రంలో ఆధునిక వ్యాధి నిర్థారణ వసతులు, అన్ని రకాల వ్యాధులను కనిపెట్టే పరికరాలుంటాయని అన్నారు.
Advertisement