
రాణించిన సల్మాన్ నిజర్
తొలి ఇన్నింగ్స్‌లో కేరళ 418/7
తేలిపోయిన గుజరాత్ బౌలర్లు
అహ్మదాబాద్: పసలేని గుజరాత్ బౌలింగ్‌పై కేరళ బ్యాటర్లు ఆధిపత్యం కనబరుస్తున్నారు. రెండో రోజు ఆటలో ఓవర్‌నైట్ బ్యాటర్ మొహమ్మద్ అజహరుద్దీన్ (303 బంతుల్లో 149 బ్యాటింగ్; 17 ఫోర్లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. సల్మాన్ నిజర్ (202 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. రెండు రోజుల్లో గుజరాత్ బౌలర్లలో ఏ ఒక్కరు కూడా ప్రభావం చూపలేకపోయారు.
177 ఓవర్లు వేసిన గుజరాత్ 7 వికెట్లనే పడగొట్టింది. మంగళవారం అజహరుద్దీన్, సల్మాన్‌ల జోడీ క్రీజులో పాతుకుపోవడంతో రోజంతా కష్టపడిన గుజరాత్ బౌలర్లకు మూడే వికెట్లు దక్కాయి. ఓవర్‌నైట్ స్కోరు 206/4తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కేరళ అదే స్కోరు వద్ద కెప్టెన్ సచిన్ బేబీ (69; 8 ఫోర్లు) వికెట్‌ను కోల్పోయింది. కీలకమైన వికెట్‌ను తీశామన్న ఆనందం లేకుండా సల్మాన్... ఓవర్‌నైట్ బ్యాటర్ అజహరుద్దీన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు.
ఇద్దరు కూడా ఏమాత్రం అనవసర షాట్‌ల జోలికి వెళ్లకుండా నింపాదిగా పరుగులు జత చేశారు. దీంతో మొదటి సెషన్‌లో మరో వికెట్ పడకుండా కేరళ 293/5 స్కోరు వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. తర్వాత జట్టు స్కోరు 300 పరుగులు దాటింది. ఇద్దరు జిడ్డుగా ఆడటంతో గుజరాత్ బౌలర్లకు ఆలసటే తప్ప వికెట్ల ఓదార్పు దక్కనే లేదు. ఈ క్రమంలో అజహరుద్దీన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
డ్రింక్స్ విరామం తర్వాత సల్మాన్ అర్ధశతకం సాధించాడు. ఈ రెండో సెషన్‌లోనూ వీళ్లిద్దరి ఆటే కొనసాగడంతో గుజరాత్ శిబిరానికి వికెట్ సంబరమే లేకుండాపోయింది. ఎట్టకేలకు ఆఖరి సెషన్ ఊరటనిచ్చింది. ఇందులో రెండు వికెట్లు పడగొట్టగలిగింది. సల్మాన్‌ను విశాల్ జైస్వాల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఆరో వికెట్‌కు 149 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
కానీ తర్వాత వచి్చన అహమ్మద్ ఇమ్రాన్ (66 బంతుల్లో 24; 3 ఫోర్లు) కూడా గుజరాత్ బౌలర్లను ఇబ్బంది పెట్టాకే నిష్క్రమించాడు. ఆదిత్య సర్వతే (10 బ్యాటింగ్; 1 ఫోర్)తో వచ్చాక అజహరుద్దీన్ జట్టు స్కోరును 400 దాటించాడు. ఆటనిలిచే సమయానికి ఇద్దరు అజేయంగా నిలిచారు. అర్జాన్‌కు 3 వికెట్లు దక్కాయి.
స్కోరు వివరాలు
కేరళ తొలి ఇన్నింగ్స్: అక్షయ్ (రనౌట్) 30; రోహన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 30; వరుణ్ (సి) ఉర్విల్ (బి) ప్రియజీత్‌సింగ్ 10; సచిన్ (సి) ఆర్య దేశాయ్ (బి) అర్జాన్ 69; జలజ్ సక్సేనా (బి) అర్జాన్ 30; అజహరుద్దీన్ (బ్యాటింగ్) 149; సల్మాన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) విశాల్ 52; ఇమ్రాన్ (సి) ఉర్విల్ (బి) అర్జాన్ 24; ఆదిత్య (బ్యాటింగ్) 10; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (177 ఓవర్లలో 7 వికెట్లకు) 418. వికెట్ల పతనం: 1–60, 2–63, 3–86, 4–157, 5–206, 6–355, 7–395.
బౌలింగ్: చింతన్ గజా 28–8–57–0, అర్జాన్ 29–8–64–3, ప్రియజీత్ సింగ్ 21–2–58–1, జైమీత్ 13–1–46–0, రవి బిష్ణోయ్ 30–7–74–1, సిద్ధార్థ్ దేశాయ్ 33–13–49–0, విశాల్ జైస్వాల్ 22–5–57–1, ఆర్య దేశాయ్ 1–0–3–0.