
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, కేరళ జట్ల మధ్య రంజీ ట్రోఫీ తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో కేరళ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. రెండో రోజు రెండో సెషన్ సమయానికి కేరళ 134.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ మొహమ్మద్ అజహారుద్దీన్ (105 నాటౌట్), సల్మాన్ నిజర్ (40 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు.
కేరళ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సచిన్ బేబి (69) అర్ద సెంచరీతో రాణించగా.. అక్షయ్ చంద్రన్, రోహన్ కున్నుమ్మల్, జలజ్ సక్సేనా తలో 30 పరుగులు చేశారు. వరుణ్ నయనార్ 10 పరుగులకు ఔటయ్యాడు. గుజరాత్ బౌలర్లలో అర్జన్ నగస్వల్లా 2, పి జడేజా, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.
చరిత్ర సృష్టించిన మొహమ్మద్ అజహారుద్దీన్
ఈ మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కిన మొహమ్మద్ అజహారుద్దీన్ రికార్డుబుక్కుల్లోకెక్కాడు. రంజీ సెమీఫైనల్లో సెంచరీ చేసిన తొలి కేరళ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రంజీల్లో కేరళ గతంలో ఒకే ఒక సారి సెమీస్‌కు చేరుకుంది. 2018-19 సీజన్‌లో కేరళ ఫైనల్ ఫోర్‌కు అర్హత సాధించింది. అయితే ఆ సీజన్ సెమీస్‌లో ఏ కేరళ ఆటగాడు సెంచరీ చేయలేదు. అజహారుద్దీనే రంజీల్లో కేరళ తరఫున సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ప్రస్తుత రంజీ సీజన్‌లో కేరళ అద్భుతమైన ప్రదర్శనలతో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఎలైట్ గ్రూప్-సిలో కేరళ 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 4 డ్రాలతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్లో కేరళ.. జమ్మూ అండ్ కశ్మీర్‌పై ఒక్క పరుగు ఆధిక్యం (తొలి ఇన్నింగ్స్‌లో) సాధించి సెమీస్ బెర్త్ దక్కించుకుంది.
మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో విదర్భ, ముంబై జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్ శివమ్ దూబే ఐదు వికెట్లతో రాణించాడు. షమ్స్‌ములానీ, రాయ్‌స్టన్ డయాస్ తలో రెండు, శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశారు.
విదర్భ ఇన్నింగ్స్‌లో దృవ్ షోరే (74), దినిశ్ మాలేవార్ (79), యశ్ రాథోడ్ (54) అర్ద సెంచరీలతో రాణించగా.. కరుణ్ నాయర్ (45), కెప్టెన్ అక్షయ్ వాద్కర్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అథర్వ తైడే 4, పార్థ్ రేఖడే 23, హర్ష్ దూబే 18, భూటే 11, యశ్ ఠాకూర్ 3 పరుగులు చేసి ఔట్ కాగా.. దర్శన్ నల్కండే 12 పరుగులతో అజేయంగా నిలిచాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై.. 18 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. దర్శన్ నల్కండే బౌలింగ్‌లో దనిశ్ మలేవార్‌కు క్యాచ్ ఇచ్చి ఆయుశ్ మాత్రే (9) ఔటయ్యాడు. ప్రస్తుతం ఆకాశ్ ఆనంద్ (29), సిద్దేశ్ లాడ్ (19) క్రీజ్‌లో ఉన్నారు. 23 ఓవర్ల అనంతరం ముంబై తొలి ఇన్నింగ్స్ స్కోర్ 62/1గా ఉంది. విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ముంబై ఇంకా 321 పరుగులు వెనుకపడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment