డేటా తెలిస్తే దోపిడీనే..
బెంగళూరులో నకిలీ క్రెడిట్ కార్డుల ముఠా అరెస్టు
జయనగర (బెంగళూరు): క్రెడిట్ కార్డుల సమాచారాన్ని తస్కరించి అత్యాధునిక టెక్నాలజీతో నకిలీ కార్డులు చేసి దండుకుంటున్న ముఠా గుట్టు రట్టయింది. శ్రీలంక పౌరునితో పాటు ముగ్గురిని శనివారం బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ ప్రవీణ్‌సూద్ తెలిపారు. శ్రీలంకలోని జాఫ్నా నివాసి దివ్యన్, బెంగళూరుకు చెందిన నవాజ్ షరీఫ్, నదీమ్ షరీఫ్ అనే ముగ్గురు కలిశారు. దివ్యన్ స్నేహితుడు టౌమ్‌జో అనే వ్యక్తి పేరుతో జాలహళ్లిలోని ఓ ఖరీదైన అపార్టుమెంట్‌లో ఫ్లాట్ తీసుకుని నకిలీ క్రెడిట్ కార్డుల దందా నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. సీసీబీ డీసీపీ రామ్‌నివాస్ ఆధ్వర్యంలో దాడి జరిపి వీరిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 144 క్రెడిట్ కార్డులు, 36 బయటి రాష్ట్రాల దుకాణాల కార్డు స్వైపింగ్ మిషన్లు, 16 నకిలీ డ్రైవింగ్ లైసెన్సులు, ల్యాప్‌టాప్‌తోపాటు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇలా మోసం చేసేవారు
అమెరికా, జపాన్ తదితర దేశాల్లోని పౌరుల క్రెడిట్ కార్డు దారుల సమాచారాన్ని ఇంటర్నె ట్లో సేకరిస్తారు. అమెజాన్, అలీబాబా తదితర షాపింగ్ వెబ్‌సైట్ల నుంచి ఖాళీ మ్యాగ్నటిక్ స్వైప్ కార్డులను పొందేవారు. వాటిలోకి తాము తస్కరించిన విదేశీ పౌరుల కార్డుల సమాచారాన్ని లోడ్ చేస్తారు. క్రెడిట్‌కార్డు ప్రింటింగ్ మిషన్ సాయంతో ఆ కార్డులపై అచ్చం అసలైన కార్డులపై ఉన్నట్లుగానే ఖాతా నంబర్లను ఉబ్బెత్తుగా ముద్రించేవారు.
అనంతరం పుదుచ్చేరి, హరియాణా, ముంబై తదితర నగరాల్లోని ఏజెంట్ల ద్వారా దుకాణదారుల నుంచి అంతర్జాతీయ క్రెడిట్‌కార్డు స్వైపింగ్ మిషన్లను తెప్పించి వాటిలో నకిలీ క్రెడిట్ కార్డులను స్వైప్ చేసి నగదును వ్యాపారుల ఖాతాల్లోకి మళ్లించేవారు. అం దులో దుకాణదారులు, ఏజెంట్లు, నిందితులు వాటాలు వేసుకుని పంచుకునేవారు. కాగా, దివ్యన్ అక్రమంగా చెన్నైకు వచ్చాడు. అతనిపై అక్కడ రెండు చీటింగ్ కేసులున్నాయి. మరో వంచకుడు నదీమ్‌పై బెంగళూరులో చీటింగ్ కేసులు విచారణలో ఉన్నా యి. బాధితులు సుదూర ప్రదేశాల్లో ఉండడం, ఫిర్యాదు చేయడం సాధ్యం కాకపోవడంతో దుండగుల వంచన నిరాఘాటంగా సాగిపోయిందని కమిషనర్ సూద్ చెప్పారు. కొందరు బాధితులు క్రెడిట్ కార్డులను బ్లాక్ చేయగా, మరికొందరు నిర్లక్ష్యంగా ఉండిపోయి భారీగా డబ్బు పోగొట్టుకున్నారు.