ccb police
-
హేమకు వైద్య పరీక్షలు.. అలా కనిపించి షాక్ ఇచ్చిన నటి!
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనే ఆమెకు పాజిటివ్ రావడంతో పోలీసులు నోటీసులిచ్చారు. మొదటిసారి అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేదు. హేమకు పోలీసులు రెండోసారి నోటీసులు పంపించగా వివిధ కారణాలు చెప్పి డుమ్మా కొట్టింది. సీసీబీ పోలీసులు మూడోసారి నోటీసులిచ్చారు. దీంతో ఇవాళ సీసీబీ పోలీసుల ఎదుట ఆమె హాజరయ్యారు. విచారణ పూర్తయిన అనంతరం హేమను పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం హేమకు ప్రభుత్వాస్పత్రిలో హేమకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే వైద్య పరీక్షలకు హేమ బురఖా ధరించి హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఈ కేసులో హేమను రేపు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచనున్నారు. రేవ్ పార్టీ నిర్వహణలో హేమ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..బెంగళూరు నగరశివారులోని హెబ్బగోడిలో మే 19 రాత్రి నుంచి మే 20 తెల్లవారు జాము వరకు రేవ్ పార్టీ జరిగింది. వాసు అనే వ్యక్తి పుట్టినరోజు పేరు చెప్పి 'సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ' పేరిట పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీలో ఎండీఎంఏ పిల్స్, హైడ్రో గాంజా, కొకైన్ ఇతర మాదకద్రవ్యాలు తీసుకున్నారు. పార్టీకి ప్రధాన కారకులైన నిందితులు రణధీర్, మహ్మద్ సిద్ధిఖి, వాసు, అరుణ్‌కుమార్, నాగబాబును పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు.#Tollywood actress #Hema has been arrested by @CCBBangalore wen she came in Burqa to appear today after two notices in related to to Rave party which was held in #anekal, #bengaluru . Including Hema, more than 80+ people tested positive with Drug in 101 samples collected. pic.twitter.com/qxvQAUIFtx— Madhu M (@MadhunaikBunty) June 3, 2024 -
ఐదుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను నగర సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో బాంబు పేలుళ్ల ద్వారా విధ్వంసానికి పాల్పడేందుకు ఈ ఐదుగురు ముష్కరులు సుహైల్, ఉమర్, తర్బేజ్, ముదాసీర్, ఫైజల్ కుట్ర పన్నినట్లు పోలీసులు చెప్పారు. వారిని ఎన్ఐఏ కోర్టులో హాజరుపర్చగా, ఐదు రోజుల పాటు సీసీబీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దేశద్రోహ కార్యకలాపాలకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న సీసీబీ పోలీసులు హెబ్బాళ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఇంటిపై దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై హెబ్బాళ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి ఏడు దేశవాలీ పిస్తోళ్లు, 45 బుల్లెట్లు, వాకీటాకీ సెట్స్, 12 మొబైల్ ఫోన్లు, రెండు శాటిలైట్ ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. బెంగళూరులో రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లకు ప్రణాళికలు రూపొందించినట్లు విచారణలో నిందితులు అంగీకరించాని పోలీసులు వెల్లడించారు. -
ఇంట్లోనే డ్రగ్స్ ఫ్యాక్టరీ
బనశంకరి: బెంగళూరులో ఇంట్లోనే డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టిన నైజీరియన్‌ని సీసీబీ పోలీసులు అరెస్టు చేసి రూ.2 కోట్ల విలువచేసే 4 కేజీల ఎండీఎంఏ క్రిస్టల్ (సింథటిక్ డ్రగ్స్), డ్రగ్స్ తయారీకి వాడే రసాయనాలను సీజ్ చేశారు. నిందితుడు డేవిడ్ జోమలవే అని పోలీసులు తెలిపారు. 2018లో డేవిడ్ భారత్‌కు చేరుకుని సోదరునితో కలిసి డ్రగ్స్ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బెంగళూరులోని ఎల్రక్టానిక్ సిటీ వద్ద గల చాముండీలేఔట్లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఒక ఫ్యాక్ట రీలో పనిచేస్తున్నట్లు ఇంటి యజమానికి చెప్పేవా డు. ఆ తరువాత డ్రగ్స్ తయారీకి ఉపయోగించే ముడి రసాయనాలు, అలాగే ఉపకరణాలను ఆన్లైన్లో కొనుగోలు చేసి ఇంట్లోనే ఉత్పత్తిని ప్రారంభించాడు. ఎండీఎంఏ (ఎక్స్టసీ) డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు పంపుతూ భారీగా డబ్బు సంపాదించినట్లు పోలీస్‌కమిషనర్ కమల్‌పంత్ తెలిపారు. బూట్ల కింద దాచి స్మగ్లింగ్ బూట్ల కింది భాగంలో ఎండీఎంఏ క్రిస్టల్స్‌ను దాచిపెట్టి కొరియర్ ద్వారా న్యూజిల్యాండ్, ఆ్రస్టేలియాలతో పాటు వివిద దేశాలకు సరఫరా చేసేవాడు. కస్టమర్లు ఇచి్చన డబ్బును ఢిల్లీలో ఉన్న తన సోదరుని బ్యాంక్ అకౌంట్లో జమచేయించుకునే వాడని పోలీసులు తెలిపారు. ఇతడు నైజీరియన్ కాగా, ఉగాండా, మొజాంబిక్ దేశాల పాస్‌పోర్టును కలిగి ఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
డ్రగ్ కేసు: వివేక్ ఒబెరాయ్ బావమరిది అరెస్టు
బెంగళూరు: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో 6వ నిందితుడైన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ బావమరిది ఆదిత్య అల్వాను సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఆదిత్య నాలుగు నెలలుగా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆదిత్య కోసం గాలిస్తున్న సీసీబీ అతడిని సోమవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా బెంగళూరు జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్ మీడియాతో మాట్లాడుతూ.. శాండల్‌వుడ్ డ్రగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదిత్య అల్వా నాలుగు నెలలుగా పరారీ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడిని సోమవారం రాత్రి చెన్నైలో అరెస్టు చేశాం. అతడు చెన్నైలోని ఓ రిసార్టులో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో మా బృందం అతడు ఉంటున్న రిసార్టుపై దాడి చేసి అరెస్టు చేసింది’ అని ఆయన పేర్కొన్నారు. ఆదిత్య మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు, బాలీవుడ్ నటుడు వివేక్ బెరాయ్ భార్య ప్రియాంక అల్వా సోదరుడు. కాగా ఆదిత్య పరారీలో ఉండటంతో అతడి బావ అయిన వివేక్ ఒబెరాయ్ ఇంటిలో సీసీబీ సెప్టెంబర్‌లో దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. (చదవండి: వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సోదాలు) కాగా ప్రస్తుతం పోలీసులు ఆదిత్యను బెంగళూరులోని చమరాజ్పేటలోని సీసీబీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) కేసుల్లో అతన్ని ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. క్‌డౌన్ సమయంలో ఆదిత్య బెంగళూరు హెబ్బాల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన పార్టీల్లో డ్రగ్స్ సరఫరా చేయడమే కాక అతడు డ్రగ్ పెడ్లర్లతో సన్నిహితంగా ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. పార్టీలో డ్రగ్స్ సేకరించి, సరఫరా చేయడంలో ఆదిత్య ప్రధాన పాత్ర పోషించాడని ఇప్పటికే ఎన్సీబీ విచారిస్తున్న నిందితుడు రవిశంకర్ అంగీకరించాడు. ఆదిత్య అల్వా పేరు వెలుగులోకి రావడంతో సెప్టెంబర్ 4 నుంచి పరారీలోకి వెళ్లిపోయాడు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు అవడంపై ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇంతవరకు ఆయనకు ఉపశమనాన్ని కలిగించలేదు. క్రైమ్ బ్రాంచ్ అతనికి లుక్అవుట్ నోటీసు జారీ చేసింది. ఆదిత్యను అరెస్టు చేయడానికి సిద్ధమంది. కాగా ఈ కేసులో శాండల్‌వుడ్‌కు సంబంధించిన ప్రముఖులు ఇప్పటికే అరెస్టైయిన విషయం తెలిసిందే. (చదవండి: మాజీ మంత్రి తనయుడి ఇంట్లో డ్రగ్స్) -
నటి రాధికపై సీసీబీ ప్రశ్నల వర్షం
యశవంతపుర : అక్రమ నగదు బదిలీ ఆరోపణపై నోటీసు అందుకున్న నటి రాధిక కుమార స్వామి శుక్రవారం సీసీబీ ముందు హాజరయ్యారు. ఉదయం తన సోదరుడు రవిరాజ్‌తో పాటు చామరాజపేటలోని సీసీబీ కార్యాలయానికి వచ్చిన ఆమెపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. నిందితుడు యువరాజ్ అకౌంట్ నుండి పెద్దమొత్తంలో నగదు బదిలీపై రాధిక వివరణ ఇచ్చారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఓ సినిమాకు సంబంధించి తన ఖాతాకు రూ. 60 లక్షలు జమ అయినట్లు చెప్పారు. అయితే సదరు చిత్ర బృందంతో ఎలాంటి ఒప్పందం లేకుండా నగదు జమ అయినట్లు తెలిపారు. ఆ నగదును తిరిగి వెనక్కి ఇచ్చేసానన్నారు. త్వరలో ఈడీ, ఐటీ అధికారులు కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
డ్రగ్స్‌తో బాలీవుడ్ డ్యాన్సర్ పట్టివేత
యశవంతపుర: మత్తు పదార్థాలను తరలిస్తున్న బాలీవుడ్‌కు చెందిన నటుడు కిశోర్ శెట్టిని మంగళూరులో సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలీవుడ్లో ఎబీసీడీ అనే సినిమాలో నటించిన కిశోక్శెట్టి ఒక డ్యాన్సర్. బాలీవుడ్లో సంచలనం రేకెత్తించిన సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి, డ్రగ్స్ లింక్‌పై ముమ్మర దర్యాప్తు నేపథ్యంలో కిశోర్‌శెట్టి పోలసులకు చిక్కాడు. కిశోర్ మిత్రుడు ప్రతీక్‌శెట్టిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు డ్రగ్స్ కేసులో అరెస్టయిన నటి రాగిణి ద్వివేది బెయిల్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదాపడింది. -
నటి సంజన అరెస్ట్
యశవంతపుర: కర్ణాటక సినీరంగాన్ని డ్రగ్స్ భూతం కుదిపేస్తోంది. డ్రగ్స్ రవాణా ఆరోపణలపై తాజాగా బహుభాషా నటి సంజనా గల్రానిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఉంటున్న బెంగళూరులోని ఇందిరానగర రోడ్డు సాయితేజ్ అపార్ట్‌మెంట్‌పై మంగళవారం తెల్లవారుజామున దాడి చేసి అరెస్ట్ చేశారు. ఆమె నివాసంలో ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, పెన్‌డ్రైవ్‌తో పాటు అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో సంజనా సన్నిహితులు రాహుల్, పృథ్వీశెట్టి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెను అరెస్టు చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో గత శుక్రవారం ప్రముఖ నటి రాగిణి ద్వివేదిని అరెస్టు చేసి విచారిస్తుండడం తెలిసిందే. అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడు నటి సంజనా.. నోటీసు లేకుండా ఎలా వస్తారని ప్రశ్నించడంతో పోలీసులు ఆగ్రహించారు. నీవు చెప్పినట్లు మేం నడుచుకోలేం అని స్పష్టంచేశారు. కోర్టు వారంట్‌ను చూపించి అరెస్టు చేశారు. కాగా, ఓ ఎమ్మెల్యే తనయుడు, ఓ వర్ధమాన నటి, ఇద్దరు సీరియల్ నటుల పేర్లు బయటపడినట్లు సమాచారం. -
పోలీసుల ఎదుట హాజరైన గాలి
సాక్షి, బెంగళూరు: మూడు రోజులుగా ఆచూకీ లేకుండా పోయిన కర్ణాటక మాజీ మంత్రి, గనుల వ్యాపారి గాలి జనార్దన రెడ్డి ఎట్టకేలకు శనివారం బెంగళూరులో తన లాయర్ చంద్రశేఖర రెడ్డితో కలిసి పోలీసుల ఎదుట హాజరయ్యారు. యాంబిడంట్ కేసులో తనపై వస్తున్న ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఉందనీ, ఈ కేసుతో తనకు అసలు ఏ సంబంధమూ లేదని జనార్దన రెడ్డి చెప్పారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు. నేను తప్పు చేశానని నిరూపించేలా పోలీసుల వద్ద ఒక్క పత్రమూ లేదు’ అని అంతకుముందు ఆయన ఓ వీడియో విడుదలచేశారు. ఆదివారం తమ ఎదుట హాజరు కావాల్సిందిగా సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) జనార్దన రెడ్డికి నోటీసులు పంపడం తెల్సిందే. ‘యాంబిడంట్ కంపెనీ యజమాని ఫరీద్ ప్రతి ఒక్క రాజకీయ నేతతో ఫోటో దిగుతాడు. బెంగళూరులో ఎంతోమంది నాయకులతో అతనికి పరిచయం ఉంది. నేనెందుకు భయపడాలి, పారిపోవాలి?’ అని అన్నారు. యాంబిడంట్ సంస్థ ఆర్థిక పథకాల పేరుతో వందలాది మంది దగ్గర దాదాపు రూ. 600 కోట్లు వసూలు చేసి అనంతరం మోసానికి పాల్పడింది. ఈ కేసు నుంచి బయటపడేసేందుకు జనార్దన∙రెడ్డి రూ. 18 కోట్లు లంచం అడిగారని ఫరీద్ ఆరోపించడం తెలిసిందే -
ఆ ఇన్స్పెక్టర్కు రూ.కోటి ఇవ్వాలట
కర్ణాటక, శివాజీనగర: సీసీబీ పోలీస్ అధికారి ఒకరు రూ.1 కోటికి పైగా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తనపై 3 తప్పుడు కేసులను నమోదు చేసి అమానుషంగా దాడి జరిపారని, తక్షణమే ఆయనను సస్పెండ్ చేయాలని నగరానికి చెందిన స్పందనా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు జీ.టీ.వీణా డిమాండ్ చేశారు. సోమవారం ఆమె ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ సీసీబీ ఇన్స్పెక్టర్ షరీఫ్.. డబ్బు ఇవ్వాలని తనను బెదిరింపులకు గురిచేయటమే కాకుండా మానసిక వేధింపులకు గురిచేశారని తెలిపారు. ఆ అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హోమ్‌శాఖ మంత్రికి, పోలీసు అధికారులకు విన్నవించినా ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం రాలేదని ఆమె వాపోయారు. ఖాళీపత్రాలు, చెక్కులపై సంతకాలు పెద్ద నోట్ల రద్దు సమయంలో తన ట్రస్ట్‌కు అక్రమంగా రూ.4 కోట్ల నిధులు వచ్చాయని ఆరోపిస్తూ పోలీసు స్టేషన్‌కు పిలిపించి 7 రోజుల పాటు కస్టడీలో పెట్టి అసభ్యకరమైన పదజాలంతో దూషించటమే కాకుండా తీవ్రంగా దాడి జరిపారని వీణా చెప్పారు. ఆ సందర్భంలో పలు పత్రాలు, 10 ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించుకున్నారని చెప్పారు. ఈ విషయాన్ని లోకాయుక్త, పోలీసు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసి వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశానని పేర్కొన్నారు. డబ్బు ఇవ్వాలని వేధిస్తున్న ఇన్స్పెక్టర్ షరీఫ్‌ను సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో న్యాయం లభించేవరకు పోరాటం చేపడుతానని చెప్పారు. వీణా కుమార్తె మేఘనా మాట్లాడుతూ ఇన్స్పెక్టర్ షరీఫ్ బెదిరింపులు తట్టుకోలేక మిత్రుల నుంచి రూ.1 లక్ష సరిచేసి ఆగస్టు 22న షరీఫ్‌కు ఇచ్చామన్నారు. అతనిపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆయన వల్ల తాము మానసికంగా, శారీరకంగా నలిగి పోయామని, ఈ విషయంలో న్యాయస్థానానికి మొరపెట్టుకొంటామని తెలిపారు. -
హీరోని హత్య చేయాలని కుట్ర
యశవంతపుర: పోలీసు కాల్పుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బెంగళూరు రౌడీ సైకిల్ రవి సీసీబీ పోలీసుల విచారణలో విస్తుగొలిపే సమాచారాన్ని బయటపెడుతున్నాడు. కన్నడ సినీ హీరో యశ్‌ను హత్య చేయాలని అతడు కుట్ర రచించినట్లు వెల్లడించినట్లు తెలిసింది. రెండేళ్ల క్రితమే ఈ కుట్ర పన్నాడు. అప్పట్లో ఈ విషయం తెలిసిన యశ్, నిర్మాత జయణ్ణ బెంగళూరు పోలీసు కమిషనర్‌కు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. దీని తరువాత సీసీబీ పోలీసులు నగరంలోని అనేక మంది ముఖ్యమైన రౌడీలను అరెస్టు చేసి, మరి కొందరికి హెచ్చరికలు చేసి వదిలేశారు. అప్పట్లో రౌడీసైకిల్ రవి, త్యాగరాజనగర కోదండరామ పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నారు. కోదండరామ ఇప్పటికీ ఎక్కడున్నాడో తెలియటం లేదు. తాజా విచారణలో రవి పాతకుట్రను సవివరంగా బయటపెట్టాడు. బెంగళూరుకు సమీపంలో జరిగిన ఒక మందు పార్టీలో హత్య విషయమై చర్చించినట్లు చెప్పాడు. ప్లాన్ వేసిన మాట నిజమేగాని హత్య చేసే వరకు వెళ్లలేదని తెలిపాడు. దీంతో ఇప్పుడు రౌడీ కోదండరామ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతన్ని పట్టుకుంటే మరింత సమాచారం దొరుకుతుందని ఆశిస్తున్నారు. సినీ నిర్మాతతో గొడవకు సంబంధిం చి యశ్‌పై రౌడీ రవి పగ పెంచుకున్నాడు. పెద్ద విషయం కాదు: సీసీబీ యశ్ హత్యకు కుట్ర విషయాన్ని సీసీబీ ఉన్నతాధికారులు తీవ్రత తగ్గించి చూపుతున్నారు. ఇది పాత కథేనని అంటున్నారు. కేవలం సమాచారాన్ని మాత్రమే రవి నుండి సేకరిస్తున్నట్లు విచారణ అధికారి ఒకరు పేర్కొన్నారు. మద్యం తాగిన మత్తులో ఏదో కుట్ర పథకం వేశారని చెబుతున్నారు. సుమారు 20 సిమ్ కార్డుల ద్వారా సైకిల్ రవి పలు రంగాల ముఖ్యులతో మాట్లాడేవాడని విచారణలో బయట పడింది. చిన్న సంగతే: నటుడు యశ్ తనను హత్య చేయటానికి కుట్రపై నటుడు యశ్ స్పందిస్తూ, ఇది చిన్న విషయమని అన్నారు. రెండేళ్ల క్రితం దీనిని పోలీసు కమిషనర్‌కు దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. నిర్మాత జయణ్ణ కారుపై కొందరు రాళ్లు విసిరిన ఘటనపై పోలీసు కమిషనర్‌ను కలిసినట్లు తెలిపారు. ఆ తరువాత మైసూరు, బెంగళూరు ప్రాంతాల్లో అనేక మంది రౌడీలను పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. -
లేడీ కిలాడి ఎంత పని చేసింది..
మైసూరు: నకిలీలా మోత సమాజంలో రోజురోజుకు పెరుగుతూ పోతోంది. తినే వస్తువు నుంచి చదువు దాకా నకిలీలు ఎక్కువయ్యాయి. కష్టపడి చదివి పాస్ అయితే వచ్చే మార్కుల జాబితాలను కూడా నకిలీ రూపంలో అందిస్తున్నారు. రాష్ట్రంలో వివిధ విశ్వ విద్యాలయాలకు చెందిర నకిలీ మార్కుల జాబితాలను విక్రయిస్తున్న మహిలను నగరంలో సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని గోకులంకు చెందిన యశస్విని(45) వద్ద నుంచి పోలీసులు వివిధ విద్యాలయాలకు చెందిన నకిలీ మార్క్స్కార్డులను స్వాధీనం చేసుకున్నారు. శనివారం మైసూరులోని నజరబాద్ లో ఉన్న పంచాయతీ కార్యాలయం వద్దకు కారులో యశస్విని వచ్చింది. అక్కడ పోలీసులను చూసి పారిపోవడానికి యత్నిచింది. దీంతో అనుమానించి సీఐ చంద్రకళ వెంబడించి సదరు మహిళను పట్టుకుని విచారణ చేయడంతో అసలు విషయం వెల్లడించింది. వివిధ విశ్వ విద్యాలయాలకు చెందిన మార్క్స్ కార్డులను నకిలీవి తయారు చేసి ఒక్కొక్కటి రూ. 30 నుంచి 50 వేల వరకు విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు విచారణలో పేర్కొంది. ఆమెకు సహకరిస్తున్న మరో ఇద్దరి కోసం పోలీసులుగాలిస్తున్నారు. -
ఐటీ రాజధానిలో డ్రగ్స్ కలకలం
- భారీగా కొకైన్ పట్టివేత.. నలుగురి అరెస్ట్ బెంగళూరు: ఒకపక్క హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా, దానితో సంబంధాలున్నవారిపై కఠిచ చర్యలకు అధికారులు సిద్ధమవుతోన్నవేళ అటు భారత ఐటీ రాజధాని బెంగళూరులో సైతం భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడటం కలకలంరేపింది. బెంగళూరు నగరంలోని బయప్పనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సీసీబీ పోలీసులు మంగళవారం జరిపిన దాడుల్లో సుమారు రూ.8లక్షల విలువైన కొకైన్‌ను స్వాదీనం చేసుకున్నారు. స్థానిక ఎన్‌జీఈఎఫ్ లేఔట్ సదానందనగర మెయిన్‌రోడ్డుకు సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన విదేశీయులను తనిఖీ చేయగా, వారి వద్ద కొకైన్ లభించినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌తోపాటు పట్టుబడిన నలుగురిని నైజీరియాకు చెందిన ఆంటోనిఎగ్వోబా, బ్రిటన్ నివాసి ఓవెన్‌పెన్‌హాలిజన్, మోజాంబికాలుగా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి ఏడు సెల్ఫోన్లు, ఐపాడ్, రెండు పాస్పోర్ట్స్, కారు, బైక్ స్వాధీనం చేసుకున్నామని, అన్య అనే వ్యక్తి పేరుతో సిమ్‌కార్డు పొంది మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు గుర్తించామని వివరించారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న స్థానికులను గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. -
డేటా తెలిస్తే దోపిడీనే..
బెంగళూరులో నకిలీ క్రెడిట్ కార్డుల ముఠా అరెస్టు జయనగర (బెంగళూరు): క్రెడిట్ కార్డుల సమాచారాన్ని తస్కరించి అత్యాధునిక టెక్నాలజీతో నకిలీ కార్డులు చేసి దండుకుంటున్న ముఠా గుట్టు రట్టయింది. శ్రీలంక పౌరునితో పాటు ముగ్గురిని శనివారం బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ ప్రవీణ్‌సూద్ తెలిపారు. శ్రీలంకలోని జాఫ్నా నివాసి దివ్యన్, బెంగళూరుకు చెందిన నవాజ్ షరీఫ్, నదీమ్ షరీఫ్ అనే ముగ్గురు కలిశారు. దివ్యన్ స్నేహితుడు టౌమ్జో అనే వ్యక్తి పేరుతో జాలహళ్లిలోని ఓ ఖరీదైన అపార్టుమెంట్లో ఫ్లాట్ తీసుకుని నకిలీ క్రెడిట్ కార్డుల దందా నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. సీసీబీ డీసీపీ రామ్నివాస్ ఆధ్వర్యంలో దాడి జరిపి వీరిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 144 క్రెడిట్ కార్డులు, 36 బయటి రాష్ట్రాల దుకాణాల కార్డు స్వైపింగ్ మిషన్లు, 16 నకిలీ డ్రైవింగ్ లైసెన్సులు, ల్యాప్‌టాప్‌తోపాటు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలా మోసం చేసేవారు అమెరికా, జపాన్ తదితర దేశాల్లోని పౌరుల క్రెడిట్ కార్డు దారుల సమాచారాన్ని ఇంటర్నె ట్లో సేకరిస్తారు. అమెజాన్, అలీబాబా తదితర షాపింగ్ వెబ్సైట్ల నుంచి ఖాళీ మ్యాగ్నటిక్ స్వైప్ కార్డులను పొందేవారు. వాటిలోకి తాము తస్కరించిన విదేశీ పౌరుల కార్డుల సమాచారాన్ని లోడ్ చేస్తారు. క్రెడిట్‌కార్డు ప్రింటింగ్ మిషన్ సాయంతో ఆ కార్డులపై అచ్చం అసలైన కార్డులపై ఉన్నట్లుగానే ఖాతా నంబర్లను ఉబ్బెత్తుగా ముద్రించేవారు. అనంతరం పుదుచ్చేరి, హరియాణా, ముంబై తదితర నగరాల్లోని ఏజెంట్ల ద్వారా దుకాణదారుల నుంచి అంతర్జాతీయ క్రెడిట్‌కార్డు స్వైపింగ్ మిషన్లను తెప్పించి వాటిలో నకిలీ క్రెడిట్ కార్డులను స్వైప్ చేసి నగదును వ్యాపారుల ఖాతాల్లోకి మళ్లించేవారు. అం దులో దుకాణదారులు, ఏజెంట్లు, నిందితులు వాటాలు వేసుకుని పంచుకునేవారు. కాగా, దివ్యన్ అక్రమంగా చెన్నైకు వచ్చాడు. అతనిపై అక్కడ రెండు చీటింగ్ కేసులున్నాయి. మరో వంచకుడు నదీమ్‌పై బెంగళూరులో చీటింగ్ కేసులు విచారణలో ఉన్నా యి. బాధితులు సుదూర ప్రదేశాల్లో ఉండడం, ఫిర్యాదు చేయడం సాధ్యం కాకపోవడంతో దుండగుల వంచన నిరాఘాటంగా సాగిపోయిందని కమిషనర్ సూద్ చెప్పారు. కొందరు బాధితులు క్రెడిట్ కార్డులను బ్లాక్ చేయగా, మరికొందరు నిర్లక్ష్యంగా ఉండిపోయి భారీగా డబ్బు పోగొట్టుకున్నారు. -
వేశ్యావాటికపై దాడులు
ముగ్గురి అరెస్ట్, విదేశీ యువతికి విముక్తి బెంగళూరు(బనశంకరి) : నందిదుర్గ రోడ్డులో ఉన్న ఓ ఇంటిలో నిర్వహిస్తున్న వేశ్యావాటికపై బుధవారం ఉదయం సీసీబీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులైన కోల్‌కత్తాకు చెందిన సుమనాసహ, పరిమల్పాల్, మండ్యకు చెందిన వినయ్‌ను అరెస్ట్ చేశారు. ఉజ్జెకిస్తాన్‌కు చెందిన యువతిని సంరక్షించి పునరావాస కేంద్రానికి తరలించారు. నిందితులు ఉద్యోగాల పేరుతో విదేశీ యువతులను ఆకర్షించి వ్యభిచారం ఉబిలోకి దింపినట్లు విచారణ లో వెలుగుచూసిందని పోలీసులు తెలిపారు. నిందితులపై జయమహాల్ పోలీస్‌స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కమర్షియల్ స్ట్రీట్‌లో.... వేశ్యావాటిక నిర్వహిస్తున్న కమర్షియల్స్ట్రీట్లోని వీరపిళ్లైస్ట్రీట్లో గ్రీన్బ్లాసమ్ మసాజ్ పార్లర్‌పై బుధవారం సీసీబీ పోలీసులు దాడి చేశారు. అయ్యప్పనగర కు చెందిన సందీఫ్, వేణుగోపాల్పుర నివాసి హరీశ్, మదర్సాహేబ్ లేఔట్ వాసి శ్యామ్,, బసరాళు నివాసి సంతోష్, సంతకెరెహళ్లికి చెందిన నవీన్, యరప్పగార్డెన్ నివాసి ప్రవేశ్, బీటీఎం లేఔట్ కు చెందిన మహమ్మద్తబ్రేజ్ను అరెస్ట్ చేశారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన నలుగురి మహిళలను కాపాడారు. ఉద్యోగం పేరుతో యువతులను నగరానికి తీసుకువచ్చి వేశ్యావాటిక నిర్వహిస్తున్నట్లు విచారణలో నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. పేకాట కేంద్రం పై దాడి ఎస్జే.పార్కులో పేకాట నిర్వహిస్తున్న కేంద్రంపై బుధవారం సీసీబీ పోలీసులు దాడిచేసి ఆలం అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.5840 నగదు, పేకాటకు వినియోగించే 30 స్లిప్‌లను స్వాధీనం చేసుకొని నిందితులపై ఎస్జే.పార్కు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు డీసీపీ. గిరీష్ తెలిపారు. -
రూ.50 కోట్లకు కుచ్చుటోపీ
దేశ విదేశాల్లో 32 వేల మందిని గొలుసుకట్టు పేరుతో మోసం చేసిన న్యూజిలాండ్ మహిళ కర్ణాటకలో 300 మంది, హైదరాబాద్‌లో 100 బాధితులు మహిళతో సహా నలుగురి అరెస్ట్ బెంగళూరు : గొలుసుకట్టు వ్యాపారం పేరుతో రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్న విదేశీయురాలితో సహా నలుగురు వ్యక్తులను నగర సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విదేశీయురాలి చేతిలో దేశ విదేశాల్లో కలిపి దాదాపు 32 వేల మంది మోసపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు మీడియాకు గురువారం వెల్లడించిన వివరాల మేరకు.. మూలతహా న్యూజిల్యాండ్‌కు చెందిన డేనిసే అనే మహిళ చట్టవ్యతిరేకంగా గొలుసుకట్టు వ్యాపారం నిర్వహిస్తోంది. ఈ సంస్థలో ప్రాథమిక సభ్యుడిగా చేరేవారు రూ.8 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక సంస్థలో ఏజెంట్‌గా విధులు నిర్వర్తించేవారు రూ.25 వేలు చెల్లించాలి. ప్రాథమిక సభ్యత్వం పొందినవారు కాని ఏజెంట్‌గా చేరిన వారు కాని తర్వాత మరో ఇద్దరిని చేర్చాలి. ఇందుకు గాను ప్రాథమిక సభ్యత్వం పొందిన వ్యక్తికి ఒక్కొక్క సభ్యున్ని చేర్పించినందుకు గాను 25 నుంచి 50 శాతం సంస్థ కమీషన్‌గా చెల్లిస్తుంది. అదే విధంగా నూతనంగా చేరిన వారు మరో ఇద్దరిని చేర్చాల్సి ఉంటుంది. ఇందుకు గాను వారికి కూడా కమిషన్ అందుతుంది. ఈ మేరకు పాకిస్తాన్, దుబైతోపాటు చాలా దేశాల్లో ఏజెంట్లను చేర్పించుకుని గొలుసుకట్టు వ్యాపారం చేసింది. ఈ క్రమంలోనే గత అక్టోబర్‌లో బెంగళూరు నగరాన్ని చేరుకుని ఓ రాజ్‌భవన్‌కు దగ్గరగా ఉన్న పంచనక్షత్రాల హోటల్లో బసచేసింది. తర్వాత వివిధ ఇన్సురెన్స్ కంపెనీల్లో ఏజెంట్లుగా పనిచేస్తున్న మహ్మద్ కురుం, కిరణ్ మోది, హితేష్ మోదిని లోబరుచుకుని వారి ద్వారా రాష్ట్రంతోపాటు పొరుగున ఉన్న ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్రలో కూడా లావాదేవీలు ప్రారంభించారు. అక్టోబర్ నుంచి విదేశీయురాలు రాజ్‌భవన్‌కు దగ్గరలోని హోటల్లో ఉండటం, ఆమె నడవడిక అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు కూపీలాగారు. ఖచ్చితమైన సమాచారంతో ఆమె బసచేస్తున్న హోటల్‌పై దాడిచేశారు. ప్రధాన నిందితురాలు డేనిస్తోపాటు మిగిలిన ముగ్గురు నిందితులను కూడా అరెస్టు చేశారు. వారి నుంచి ఒక ల్యాప్‌ట్యాప్, కొన్ని హార్డ్‌డిస్క్‌లు, ఫోన్లు స్వాధీనం చేసుకుని నిపుణుల ద్వారా దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటి వరకూ ఈమె చేతిలో దాదాపు 32,339 మంది రూ.50 కోట్ల వరకూ మోసపోయినట్లు వెలుగుచూసింది. నిందితులను కబ్బన్‌పార్క్ పోలీస్‌స్టేషన్‌లో సీసీబీ పోలీసులు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. డేనిసే చేతిలో వివిధ దేశాల్లో మోసపోయిన వారు... అమెరిక - 2 వేల మంది, ఇండియా - 1,700, మలేషియా - 28 వేలు, న్యూజిలాండ్ - 500, దుబాయ్ - 200, పాకిస్తాన్ - 100 దేశంలోని వివిధ రాష్ట్రాల్లో... కర్ణాటక-300, మహారాష్ట్ర-800, ఢిల్లీ-100, పంజాబ్ -100, మధ్యప్రదేశ్ -300, హైదరాబాద్ -100 మంది -
చోరీలతో జల్సాలు
బెంగళూరు, చోరీలకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసిన సీసీబీ పోలీసులు వారినుంచి రూ.19.50లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు... బెంగళూరు గ్రామీణ జిల్లా బైలనరసాపురకు చెందిన పాజివ్ బాష, అవీన్ బాష జల్సాలకు అలవాటు పడ్డారు. ఈక్రమంలో కే ఆర్‌పురం, రామమూర్తినగర, మహదేవపుర, భారతీనగర, బయ్యప్పనహళ్ళి జేపీనగర, బయ్యప్పనహళ్ళి పోలీస్ స్టేషన్ల పరిధిలో రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడ్డారు. అనంతరం నగలును చింతామణి, కోలారు, హొసకోటేలలో విక్రయించి జల్సాలు చేశారు. వీరిద్దరూ శుక్రవారం అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. ఇద్దరినీ అరెస్టు చేసి పది చోరీకేసులకు సంబంధించి రూ. 19.50 లక్షల విలువైన 630 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. వీరినుంచి నగలు కొనుగోలు చేసిన కోలారులోని రాజేష్ జ్యువెలర్స్ యజమాని రాజేష్‌ను అదుపులోకి తీసుకుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.