రూ.50 కోట్లకు కుచ్చుటోపీ
దేశ విదేశాల్లో 32 వేల మందిని గొలుసుకట్టు పేరుతో మోసం చేసిన న్యూజిలాండ్ మహిళ
కర్ణాటకలో 300 మంది, హైదరాబాద్‌లో 100 బాధితులు
మహిళతో సహా నలుగురి అరెస్ట్
బెంగళూరు : గొలుసుకట్టు వ్యాపారం పేరుతో రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్న విదేశీయురాలితో సహా నలుగురు వ్యక్తులను నగర సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విదేశీయురాలి చేతిలో దేశ విదేశాల్లో కలిపి దాదాపు 32 వేల మంది మోసపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు మీడియాకు గురువారం వెల్లడించిన వివరాల మేరకు.. మూలతహా న్యూజిల్యాండ్‌కు చెందిన డేనిసే అనే మహిళ చట్టవ్యతిరేకంగా గొలుసుకట్టు వ్యాపారం నిర్వహిస్తోంది. ఈ సంస్థలో ప్రాథమిక సభ్యుడిగా చేరేవారు రూ.8 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక సంస్థలో ఏజెంట్‌గా విధులు నిర్వర్తించేవారు రూ.25 వేలు చెల్లించాలి. ప్రాథమిక సభ్యత్వం పొందినవారు కాని ఏజెంట్‌గా చేరిన వారు కాని తర్వాత మరో ఇద్దరిని చేర్చాలి. ఇందుకు గాను ప్రాథమిక సభ్యత్వం పొందిన వ్యక్తికి ఒక్కొక్క సభ్యున్ని చేర్పించినందుకు గాను 25 నుంచి 50 శాతం సంస్థ కమీషన్‌గా చెల్లిస్తుంది. అదే విధంగా నూతనంగా చేరిన వారు మరో ఇద్దరిని చేర్చాల్సి ఉంటుంది. ఇందుకు గాను వారికి కూడా కమిషన్ అందుతుంది. ఈ మేరకు పాకిస్తాన్, దుబైతోపాటు చాలా దేశాల్లో ఏజెంట్లను చేర్పించుకుని గొలుసుకట్టు వ్యాపారం చేసింది. ఈ క్రమంలోనే గత అక్టోబర్‌లో బెంగళూరు నగరాన్ని చేరుకుని ఓ రాజ్‌భవన్‌కు దగ్గరగా ఉన్న పంచనక్షత్రాల హోటల్‌లో బసచేసింది.
తర్వాత వివిధ ఇన్సురెన్స్ కంపెనీల్లో ఏజెంట్లుగా పనిచేస్తున్న మహ్మద్ కురుం, కిరణ్ మోది, హితేష్ మోదిని లోబరుచుకుని వారి ద్వారా రాష్ట్రంతోపాటు పొరుగున ఉన్న ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్రలో కూడా లావాదేవీలు ప్రారంభించారు. అక్టోబర్ నుంచి విదేశీయురాలు రాజ్‌భవన్‌కు దగ్గరలోని హోటల్‌లో ఉండటం, ఆమె నడవడిక అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు కూపీలాగారు. ఖచ్చితమైన సమాచారంతో ఆమె బసచేస్తున్న హోటల్‌పై దాడిచేశారు. ప్రధాన నిందితురాలు డేనిస్‌తోపాటు మిగిలిన ముగ్గురు నిందితులను కూడా అరెస్టు చేశారు. వారి నుంచి ఒక ల్యాప్‌ట్యాప్, కొన్ని హార్డ్‌డిస్క్‌లు, ఫోన్‌లు స్వాధీనం చేసుకుని నిపుణుల ద్వారా దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటి వరకూ ఈమె చేతిలో దాదాపు 32,339 మంది రూ.50 కోట్ల వరకూ మోసపోయినట్లు వెలుగుచూసింది. నిందితులను కబ్బన్‌పార్క్ పోలీస్‌స్టేషన్‌లో సీసీబీ పోలీసులు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.
డేనిసే చేతిలో వివిధ దేశాల్లో మోసపోయిన వారు...
అమెరిక - 2 వేల మంది, ఇండియా - 1,700, మలేషియా - 28 వేలు, న్యూజిలాండ్ - 500, దుబాయ్ - 200, పాకిస్తాన్ - 100
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో...
కర్ణాటక-300, మహారాష్ట్ర-800, ఢిల్లీ-100, పంజాబ్ -100, మధ్యప్రదేశ్ -300, హైదరాబాద్ -100 మంది