యశవంతపుర: పోలీసు కాల్పుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బెంగళూరు రౌడీ సైకిల్ రవి సీసీబీ పోలీసుల విచారణలో విస్తుగొలిపే సమాచారాన్ని బయటపెడుతున్నాడు. కన్నడ సినీ హీరో యశ్‌ను హత్య చేయాలని అతడు కుట్ర రచించినట్లు వెల్లడించినట్లు తెలిసింది. రెండేళ్ల క్రితమే ఈ కుట్ర పన్నాడు. అప్పట్లో ఈ విషయం తెలిసిన యశ్, నిర్మాత జయణ్ణ బెంగళూరు పోలీసు కమిషనర్‌కు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. దీని తరువాత సీసీబీ పోలీసులు నగరంలోని అనేక మంది ముఖ్యమైన రౌడీలను అరెస్టు చేసి, మరి కొందరికి హెచ్చరికలు చేసి వదిలేశారు. అప్పట్లో రౌడీసైకిల్ రవి, త్యాగరాజనగర కోదండరామ పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నారు. కోదండరామ ఇప్పటికీ ఎక్కడున్నాడో తెలియటం లేదు.
తాజా విచారణలో రవి పాతకుట్రను సవివరంగా బయటపెట్టాడు. బెంగళూరుకు సమీపంలో జరిగిన ఒక మందు పార్టీలో హత్య విషయమై చర్చించినట్లు చెప్పాడు. ప్లాన్ వేసిన మాట నిజమేగాని హత్య చేసే వరకు వెళ్లలేదని తెలిపాడు. దీంతో ఇప్పుడు రౌడీ కోదండరామ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతన్ని పట్టుకుంటే మరింత సమాచారం దొరుకుతుందని ఆశిస్తున్నారు. సినీ నిర్మాతతో గొడవకు సంబంధిం చి యశ్‌పై రౌడీ రవి పగ పెంచుకున్నాడు.
పెద్ద విషయం కాదు: సీసీబీ
యశ్ హత్యకు కుట్ర విషయాన్ని సీసీబీ ఉన్నతాధికారులు తీవ్రత తగ్గించి చూపుతున్నారు. ఇది పాత కథేనని అంటున్నారు. కేవలం సమాచారాన్ని మాత్రమే రవి నుండి సేకరిస్తున్నట్లు విచారణ అధికారి ఒకరు పేర్కొన్నారు. మద్యం తాగిన మత్తులో ఏదో కుట్ర పథకం వేశారని చెబుతున్నారు. సుమారు 20 సిమ్ కార్డుల ద్వారా సైకిల్ రవి పలు రంగాల ముఖ్యులతో మాట్లాడేవాడని విచారణలో బయట పడింది.
చిన్న సంగతే: నటుడు యశ్
తనను హత్య చేయటానికి కుట్రపై నటుడు యశ్ స్పందిస్తూ, ఇది చిన్న విషయమని అన్నారు. రెండేళ్ల క్రితం దీనిని పోలీసు కమిషనర్‌కు దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. నిర్మాత జయణ్ణ కారుపై కొందరు రాళ్లు విసిరిన ఘటనపై పోలీసు కమిషనర్‌ను కలిసినట్లు తెలిపారు. ఆ తరువాత మైసూరు, బెంగళూరు ప్రాంతాల్లో అనేక మంది రౌడీలను పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment