
గుర్రంతోపాటు బావిలో పడ్డ వరుడు.. వైరల్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ పెళ్లి వేడుకలో అపశృతి చోటచేసుకుంది. అప్పటివరకూ ఎంతో ఉత్సాహంగా ఉన్న వధూవరుల బంధువులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. పెళ్లికొడుకును గుర్రంపై ఊరేగింపుగా తీసుకెళ్తున్న సమయంలో దురదృష్టవశాత్తూ గుర్రంతో పాటే వరుడు ఓ బావిలో పడిపోయాడు. దీంతో ఏం జరుగుతుందోనని వరుడి బంధువులు ఆందోళన చెందారు. ఈ ఘటన యూపీలోని గొండాలో బుధవారం చోటుచేసుకుంది.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుంది. శుభకార్యం జరిగే సమయంలో ఇలా జరగడంపై వధూవరుల బంధువుల ఆనందం ఆవిరైంది. అయితే జేసీబీ సాయంతో గుర్రాన్ని ప్రాణాలతో బయటకు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బావి మరీ ఎక్కువ లోతు లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. అ వరుడిని బావి నుంచి బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటన ఎలా జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.