వేర్పాటువాది నుంచి మంత్రిగా!
జమ్మూ: హురియత్ నేత అబ్దుల్ గనీ లోన్ తనయుడైన సజ్జద్ గనీ లోన్‌కు కరడుగట్టిన వేర్పాటువాద నేతగా పేరుంది. ఈయన ఆదివారం పీడీపీ-బీజేపీ సర్కారులో మంత్రిగా ప్రమాణం చేశారు. 2002 శ్రీనగర్‌లో మిలిటెంట్ల చేతిలో తన తండ్రి హత్యకు గురికావడం సజ్జద్ జీవితాన్ని మలుపుతిప్పింది. అదే ఏడాది హురియత్ కాన్ఫరెన్స్‌లో చీలిక రావడంతో వేర్పాటువాదులు రెండుగా చీలిపోయారు. అనంతరం 2004లో తన సోదరుడు బిలాల్ గనీ లోన్‌తో కలసి తన తండ్రి ఏర్పాటు చేసిన పీపుల్స్ కాన్ఫరెన్స్‌ను పునరుద్ధరించారు. 2008లో అమర్‌నాథ్ భూఆందోళనల్లో 60 మంది మరణించడం ఆయనలో మార్పు తెచ్చింది. వేర్పాటువాదులు తమ పంథాను సమీక్షించుకోవాలని పిలుపునిచ్చారు. మొన్నటి ఎన్నికల్లో పీపుల్స్ కాన్ఫరెన్స్ నుంచి పోటీ చేసిన సజ్జద్.. హన్‌ద్వారా స్థానం నుంచి పోటీ చేసి నెగ్గారు.