బిడ్డ కాదు.. గడ్డ!
- పది మాసాలు మోసిన మహిళ
- ప్రతినెలా స్కాన్ చేసి బిడ్డగా నిర్ధారించిన వైద్యులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: పది మాసాలూ మోసింది. తల్లిని కాబోతున్నానని సంబరపడింది. తీరా కాన్పునకు వెళ్తే అది బిడ్డ కాదు గడ్డ అని తేలడంతో ఆ దంపతులు నిరాశతో కుప్పకూలిపోయారు. విషాదకరమైన ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై కన్నగి నగర్‌కు చెందిన అమీర్ అలీ (29), హసీనా (28) దంపతులకు వివాహమై ఏడేళ్లరుునా సంతానం కలుగలేదు. ఇదిలా ఉండగా కొన్ని నెలల కిత్రం కడుపునొప్పి అంటున్న హసీనాను ఆమె భర్త చెన్నై ట్రిప్లికేన్‌లోని కస్తూర్బాగాంధీ తల్లీబిడ్డల ఆసుపత్రికి తీసుకెళ్లగా గర్భం దాల్చినట్లు వైద్యులు తెలిపారు. ఆ తరువాత వరుసగా పదినెలలపాటు స్కాన్ తీరుుంచినా తల్లి కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతున్నట్లు తెలిపారు. ఈనెల 18వ తేదీన ప్రసవించే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, వారంరోజుల క్రితం హసీనాకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు కడుపులో గడ్డ ఉంది, అరుునా బిడ్డకు ఎటువంటి ముప్పు లేదని, సుఖ ప్రసవం అవుతుందని ధైర్యం చెప్పి పంపారు. హసీనాకు మళ్లీ కడుపునొప్పి రావడంతో ఈనెల 22వ తేదీన అదే ఆసుపత్రిలో స్కాన్ తీసి కడుపులో గడ్డవల్లనే నొప్పి అని తేల్చారు. మరి బిడ్డ ఎలా ఉంది? అని దంపతులు ప్రశ్నించగా బిడ్డ లేదు గడ్డ మాత్రమే ఉందని బదులిచ్చారు. ఈ సమాధానంతో హతాశుడైన భర్త అమీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ వైద్యుల సూచనల మేరకు పదినెలలుగా భార్యకు పౌష్టికాహారం ఇచ్చి గర్భాన్ని కాపాడుకున్నామని, బిడ్డ ఉందన్న వైద్యులే నేడు గడ్డ అని చెప్పడం తమను తీరని విషాదంలో ముంచెత్తిందని వాపోయాడు.