Hasina
-
బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస.. 40 మందికి గాయాలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశం విడిచిపెట్టాక అక్కడి పరిస్థితులు మెరుగుపడవచ్చని అందరూ భావించారు. అయితే అందుకు విరుద్ధమైన పరిస్థితులు తిరిగి కనిపిస్తున్నాయి. ఆదివారం రాత్రి మళ్లీ హింస చెలరేగింది.రాజధాని ఢాకాలోని సచివాలయం దగ్గర గుమిగూడిన విద్యార్థులకు, అన్సార్ సభ్యులు(ఒక వర్గానికి చెందిన బృందం)మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపధ్యంలో చెలరేగిన ఘర్షణల్లో 40 మందికి పైగా జనం గాయపడ్డారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. దీనికి ముందు ఢాకా యూనివర్సిటీలోని హాస్టళ్ల నుంచి విద్యార్థులు బయటకు వచ్చి సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇంతలో అక్కడికి అన్సార్ గ్రూప్ సభ్యులు వచ్చారు.ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం విద్యార్థుల ఉద్యమ సమన్వయకర్త నహిద్ ఇస్లాంను అరెస్టు చేశారని , బంగ్లాదేశ్ అవామీ లీగ్ నేత అబుల్ హస్నత్ అబ్దుల్లాను కూడా గృహ నిర్బంధంలో ఉంచారని తెలియగానే విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో హస్నత్ అబ్దుల్లా ఫేస్బుక్లో ఒక పోస్ట్ షేర్ చేశారు. తన నిర్బంధానికి మాజీ అన్సార్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఏకేఎం అమీనుల్ హక్ బాధ్యత వహించాలని ఆయన దానిలో డిమండ్ చేశారు. ఢాకా యూనివర్శిటీలో విద్యార్థులు దీనిని వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపధ్యంలో మరోమారు అల్లర్లు చోటుచేసుకున్నాయని పోలీసులు భావిస్తున్నారు. -
వన్ ఉమన్ షో!
ఎన్నికల ‘చిత్రా’నికి పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో సర్వం సిద్ధమైంది. అక్కడ జనవరి 7న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కాకపోతే వాటి ఫలితం మాత్రం ముందే తేలిపోయింది. విపక్ష పార్టీల బాయ్‌కాట్ నేపథ్యంలో పాలక అవామీ లీగ్ విజయం, పార్టీ అధినేత్రి షేక్ హసీనా ప్రధానిగా కొనసాగడమూ లాంఛనప్రాయమే కానుంది. హసీనా వంటి నియంత చేతిలో అధికారం ఉన్నంత వరకూ ఎన్నికలు పారదర్శకంగా జరిగే అవకాశం లేదని విపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. ఆమె పదవి నుంచి తప్పుకుని తటస్థ మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని, దాని పర్యవేక్షణలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరపాలని అవి పలుమార్లు డిమాండ్ చేశాయి. వాటిని హసీనా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. దాంతో ఎన్నికల బహిష్కరణ తప్ప తమకు మరో మార్గం లేదని విపక్షాలన్నీ ఇప్పటికే ప్రకటించాయి. బేగం ఖలీదా జియా సారథ్యంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ), దాని భాగస్వాములతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్నికలను బాయ్‌కాట్ చేశాయి. ఈ నేపథ్యంలో బ్యాలెట్ పత్రాలపై కేవలం అధికార అవామీ లీగ్, దాని భాగస్వామ్య పక్షాల అభ్యర్థులు, స్వతంత్రులు మాత్రమే ఉండనున్నారు! ఇంటా బయటా విమర్శలే... హసీనా పూర్తిగా ఏకపక్ష పోకడలు పోతున్నారన్న ఆరోపణలు ఇప్పటివి కావు. బంగ్లాదేశ్‌లో 2009 నుంచీ ఆమే ప్రధానిగా అధికారం చలాయిస్తున్నారు. ఆ క్రమంలో గత పదేళ్లుగా హసీనా కరడుగట్టిన నియంతగా మారారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారని, విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కంట్లో నలుసుగా మారిన వారిని ఏకంగా చంపిస్తున్నారని మండిపడుతున్నాయి. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని కోరుతున్నాయి. వాటి వాదనలోనూ వాస్తవం లేకపోలేదు. విపక్ష నేతలు, ముఖ్యంగా బీఎన్పీకి చెందిన వారు భారీగా జైలుపాలయ్యారు. కనీసం 20 మందికి పైగా తమ నేతలు, కార్యకర్తలు జైలుపాలైనట్టు బీఎన్పీ నాయకుడు అబ్దుల్ మొయీన్ ఖాన్ ఆరోపించారు. బీఎన్పీ చీఫ్ బేగం ఖలీదా జియా కూడా అవినీతి ఆరోపణలపై గృహ నిర్బంధంలో మగ్గుతున్నారు. 78 ఏళ్ల జియా ఆరోగ్యమూ బాగా క్షీణించింది. తన నియంతృత్వం, అణచివేత బయటి ప్రపంచానికి తెలియకుండా అడ్డుకునేందుకు మీడియాపైనా హసీనా ఉక్కుపాదం మోపారని విపక్షాలు దుయ్యబడుతున్నాయి. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనిస్‌ను కేసులతో వేధించడం ఆపాలంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు ఏకంగా 170 మంది అంతర్జాతీయ ప్రముఖులు హసీనాకు గత ఆగస్టులో బహిరంగ లేఖ రాయాల్సి వచ్చింది! అయినా ఆర్థిక అవకతవకల కేసులో ఆయనకు తాజాగా ఆర్నెల్ల జైలు శిక్ష పడటం గమనార్హం! ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అణచివేత తీవ్రతరం కావడంతో నిర్బంధం నుంచి తప్పించుకునేందుకు బీఎన్పీతో పాటు పలు విపక్షాల నేతలు భారీగా అజ్ఞాతంలోకి వెళ్లారు!! జర్నలిస్టులతో పాటు ఎవరికీ బంగ్లాదేశ్‌లో సురక్షిత పరిస్థితులు లేవని ఐరాస స్వయంగా పేర్కొంది. భిన్న పార్శ్వం హసీనా ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ ప్రస్థానంలో భిన్న పార్శ్వంన్నాయి. ఒకటి పుష్కర కాలంగా దేశం సాధించిన స్థిరమైన ఆర్థిక ప్రగతి. మరొకటి ప్రధానిగా ఆమె ఒంటెత్తు పోకడలు, విచ్చలవిడి అణచివేత విధానాలు. ప్రపంచంలోని అతి పేద దేశాల్లో ఒకటిగా చెప్పే బంగ్లాదేశ్ హసీనా హయాంలో చెప్పుకోదగ్గ ఆర్థిక ప్రగతి సాధించింది. ఆర్థిక వృద్ధిలో భారత్‌ను కూడా మించిపోయింది. దేశంలో గత పదేళ్లలో తలసరి ఆదాయం మూడింతలు పెరిగింది. గత 20 ఏళ్ల కాలంలో కనీసం 2.5 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డట్టు ప్రపంచ బ్యాంకు గణాంకాలే చెబుతున్నాయి. భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు హసీనా తెర తీశారు. దుస్తుల ఎగుమతిలో చైనా తర్వాత రెండో స్థానం బంగ్లాదేశ్‌దే. అయితే ఈ అభివృద్ధంతా ప్రజాస్వామిక విలువలకు పాతరేసిన ఫలితమేనన్న వాదన ఉంది. మరోవైపు కరోనా కల్లోలం బంగ్లాను అతలాకుతలం చేసింది. జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. ద్రవ్యోల్బణం 9.5 శాతం దాటింది! విదేశీ మారక నిల్వలు క్షీణిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ నియంతగా మారిన హక్కుల నేత! 76 ఏళ్ల షేక్ హసీనా బంగ్లాదేశ్ జాతి పిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ పెద్ద కూతురు. ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. కరడుగట్టిన నియంతగా విమర్శల పాలవుతున్న ఆమె ఒకప్పుడు బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య మనుగడ కోసం ప్రముఖంగా గళమెత్తడం విశేషం! 1980ల్లో సైనిక పాలకుడు జనరల్ హుసేన్ మహమ్మద్ ఎర్షాద్ నియంతృత్వంపై ఖలీదా జియాతో పాటు అన్ని పార్టీల నేతలతోనూ కలిసి పోరాడారామె. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వారితో పాటు వీధి పోరాటాలూ చేశారు. 1996 ఎన్నికల్లో నెగ్గి తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టారు. 2001లో ఖలీదా చేతిలో ఓటమి చవిచూశారు. 2006లో అవినీతి ఆరోపణలపై నిర్బంధం పాలయ్యారు. 2008లో జైలు నుంచి విడుదలయ్యాక ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. నాటినుంచీ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆమె ఇప్పటికే మొత్తమ్మీద 19 ఏళ్లు ప్రధానిగా ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న మహిళా దేశాధినేతగా ఇప్పటికే రికార్డులకెక్కారు. -
బిడ్డ కాదు.. గడ్డ!
- పది మాసాలు మోసిన మహిళ - ప్రతినెలా స్కాన్ చేసి బిడ్డగా నిర్ధారించిన వైద్యులు సాక్షి ప్రతినిధి, చెన్నై: పది మాసాలూ మోసింది. తల్లిని కాబోతున్నానని సంబరపడింది. తీరా కాన్పునకు వెళ్తే అది బిడ్డ కాదు గడ్డ అని తేలడంతో ఆ దంపతులు నిరాశతో కుప్పకూలిపోయారు. విషాదకరమైన ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై కన్నగి నగర్‌కు చెందిన అమీర్ అలీ (29), హసీనా (28) దంపతులకు వివాహమై ఏడేళ్లరుునా సంతానం కలుగలేదు. ఇదిలా ఉండగా కొన్ని నెలల కిత్రం కడుపునొప్పి అంటున్న హసీనాను ఆమె భర్త చెన్నై ట్రిప్లికేన్‌లోని కస్తూర్బాగాంధీ తల్లీబిడ్డల ఆసుపత్రికి తీసుకెళ్లగా గర్భం దాల్చినట్లు వైద్యులు తెలిపారు. ఆ తరువాత వరుసగా పదినెలలపాటు స్కాన్ తీరుుంచినా తల్లి కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతున్నట్లు తెలిపారు. ఈనెల 18వ తేదీన ప్రసవించే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, వారంరోజుల క్రితం హసీనాకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు కడుపులో గడ్డ ఉంది, అరుునా బిడ్డకు ఎటువంటి ముప్పు లేదని, సుఖ ప్రసవం అవుతుందని ధైర్యం చెప్పి పంపారు. హసీనాకు మళ్లీ కడుపునొప్పి రావడంతో ఈనెల 22వ తేదీన అదే ఆసుపత్రిలో స్కాన్ తీసి కడుపులో గడ్డవల్లనే నొప్పి అని తేల్చారు. మరి బిడ్డ ఎలా ఉంది? అని దంపతులు ప్రశ్నించగా బిడ్డ లేదు గడ్డ మాత్రమే ఉందని బదులిచ్చారు. ఈ సమాధానంతో హతాశుడైన భర్త అమీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ వైద్యుల సూచనల మేరకు పదినెలలుగా భార్యకు పౌష్టికాహారం ఇచ్చి గర్భాన్ని కాపాడుకున్నామని, బిడ్డ ఉందన్న వైద్యులే నేడు గడ్డ అని చెప్పడం తమను తీరని విషాదంలో ముంచెత్తిందని వాపోయాడు. -
ఉగ్ర పైశాచికం
♦ ఢాకా రెస్టారెంట్లో ముష్కరుల మారణకాండ ♦ 20 మంది విదేశీ బందీలను గొంతుకోసి చంపిన వైనం ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంట్లో విదేశీయులను బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదులు ఒక భారతీయ యువతి సహా 20 మందిని అత్యంత కిరాతకంగా నరికిచంపారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బందీల మతం గురించి తెలుసుకునేందుకు వారిని ఖురాన్ వాక్యాలు చెప్పాల్సిందిగా అడిగి మరీ చెప్పలేని వారిని హింసించి చంపారు. చెప్పగలిగిన వారిని ఏమీ అనకుండా రాత్రికి భోజనాలు కూడా ఏర్పాటుచేశారు. ఢాకాలో అత్యంత భద్రత గల గుల్షన్ దౌత్య ప్రాంతం సమీపంలోని హోలీ ఆర్టిసన్ బేకరీ రెస్టారెంట్‌పై ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి దాడిచేయడం తెలిసిందే. రెస్టారెంట్లో 40 మంది విదేశీయులను బందీలుగా పట్టుకున్న ముష్కరులు.. వారిలో 20 మందిని కత్తుల వంటి పదునైన ఆయుధాలు ఉపయోగించి హత్యచేశారు. ఉగ్రవాదులు పంజా విసిరిన పది గంటల తర్వాత శనివారం ఉదయం బంగ్లాదేశ్ కమాండోలు సాయుధ చర్య చేపట్టి ఆరుగురు ఉగ్రవాదులను తుదముట్టించారు. మరొక ముష్కరుడిని ప్రాణాలతో బంధించారు. సాయుధ బలగాలు ఈ ఆపరేషన్ మొదలుపెట్టేటప్పటికే.. ఉగ్రవాదులు 20 మంది విదేశీ బందీలను గొంతుకోసి చంపేశారని మిలటరీ ఆపరేషన్స్ డెరైక్టర్ బ్రిగేడియర్ జనరల్ నయీమ్ఆష్ఫాక్ చౌదురి తెలిపారు. వీదేశీ బందీలను.. మృతుల్లో తారుషి జైన్ అనే 19 ఏళ్ల భారతీయ యువతి కూడా ఉంది. ఆమె అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీలో చదువుతోంది. ఆమె తండ్రి సంజీవ్ జైన్ గత 15-20 ఏళ్లుగా బంగ్లాలో బట్టల షాపు నడుపుతున్నారు. తారుషి సెలవులు గడిపేందుకు ఢాకా వెళ్లి రెస్టారెంట్లో ఉగ్రవాదులకు బలైంది. ఇదే సమయంలో మరో భారతీయ పౌరుడు ఉగ్రవాదుల మారణకాండ నుంచి త్రుటిలో ప్రాణాలతో తప్పించుకోగలిగాడు. అతడు బెంగాలీ భాష అనర్గళంగా మాట్లాడటంతో అతడిని బంగ్లాదేశీయుడిగా భావించిన ఉగ్రవాదులు చంపకుండా వదిలిపెట్టారు. తారుషిని మాత్రం విదేశీయురాలి కింద జమకట్టి చంపేశారు. మిగతా 19 మంది విదేశీ మృతుల్లో 9 మంది ఇటలీ పౌరులు, ఏడుగురు జపనీయులు, ఒక అమెరికన్ ఉన్నారు. ఇద్దరు మృతులను గుర్తించాల్సి ఉంది. శుక్రవారం రాత్రి ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులూ చనిపోగా, మరో 30 మంది గాయపడ్డారు. సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ ముగిసిన తర్వాత రెస్టారెంట్ నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకుని కంబైన్డ్ మిలటరీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. వారి వివరాలను ఖరారు కోసం శవపరీక్ష నిర్వహించారు. రెస్టారెంట్ సిబ్బంది ఇద్దరిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పది గంటల తర్వాత సైనిక చర్య... శుక్రవారం రాత్రి రెస్టారెంట్‌ను చుట్టుముట్టిన భద్రతాబలగాలు శనివారం ఉదయం వరకూ అంటే పది గంటల పాటు ఎటువంటి సైనిక చర్యా చేపట్టలేదు. ఉగ్రవాదులతో మాట్లాడేందుకు భద్రతాధికారులు ప్రయత్నాలు చేస్తుండగా.. అటువైపు నుంచి వారు అడపాదడపా కాల్పులు, బాంబులు విసురుతుండటంతో పోలీసు, భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఇద్దరు పోలీసు అధికారులు చనిపోవటంతో వెనక్కు తగ్గారు. శనివారం ఉదయం ప్రధానమంత్రి షేక్ హసీనా ఆదేశాలు ఇచ్చిన తర్వాత భద్రతాధికారులు సైనిక చర్య మొదలుపెట్టారు. ‘ఆపరేషన్ థండర్‌బోల్ట్’ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్య ఉదయం 7:40 గంటలకు మొదలైంది. దాదాపు గంట సేపు రెస్టారెంట్ ప్రాంతం కాల్పులు, పేలుళ్లతో దద్దరిల్లింది. స్నైపర్లు తుపాకులతో కాల్పులు జరపటం, సాయుధ సిబ్బంది వాహనాల (ఏపీసీల) నుంచి కాల్పులు జరపటం, గ్రెనేడ్లు పేల్చారు. ఆ తర్వాత ఏపీసీల సాయంతో రెస్టారెంట్ గోడలు బద్దలు కొట్టి సైనిక సిబ్బంది లోపలికి ప్రవేశించారు. ఆర్మీ పారా కమాండో యూనిట్ ఈ ఆపరేషన్ నిర్వహించగా 13 నిమిషాల్లో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. సైన్యం 13 మంది బందీలను విడిపించగా.. వారిలో ఒక భారతీయుడు, ఒక శ్రీలంక వాసి, జపాన్ పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడి చేసింది తమ వారేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ తమ తమాక్ వార్తా సంస్థ ద్వారా ప్రకటించింది. ‘ఐసిస్ కమాండోలు 24 మందిని చంపార’ని రక్తపు మడుగుల్లో పడివున్న పలు మృతదేహాల ఫొటోలను ఆ సంస్థ ఆన్లైన్లో ఉంచింది. బంగ్లాలో భారీ ఉగ్రదాడి ఇదే తొలిసారి... బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదులు తుపాకులు, బాంబులతో భారీ ఎత్తున దాడి చేసి, పెద్ద సంఖ్యలో ప్రాణాలను హరించటం ఇదే తొలిసారి. ముస్లిం మెజారిటీ దేశమైన బంగ్లాదేశ్ ఇతర ముస్లిం దేశాలకు భిన్నంగా లౌకిక దేశంగా ప్రసిద్ధికెక్కింది. అయితే.. గత రెండేళ్లుగా ఈ దేశంలో హేతువాద కార్యకర్తలు, బ్లాగర్లు, మతపరమైన మైనారిటీలపై ముస్లిం ఛాందసవాదుల దాడులు, హత్యలు పెరుగుతూ వస్తున్నాయి. ఇస్లామిక్ మిలిటెంట్లు ఈ దురాగతాలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు. శుక్ర, శనివారాల్లో హిందూ పూజారిని, బౌద్ధ నాయకుడిని ఐసిస్ ఉగ్రవాదులు కత్తులతో నరికి చంపారు. మరో హిందువు ఇలాంటి దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఉగ్రవాదులను సమూలంగా పెకలిస్తాం: హసీనా సైనిక చర్య ముగిసిన కొద్దిసేపటికే ప్రధాని షేక్ హసీనా టెలివిజన్ ప్రసారంలో ప్రసంగించారు.‘ఇది అత్యంత హీనమైన చర్య. వీళ్లు ఎటువంటి ముస్లింలు? వారికి ఎటువంటి మతమూ లేదు. ఉగ్రవాదమే వారి మతం. వారు రంజాన్ తారబి ప్రార్థనల పిలుపును ఉల్లంఘించి ప్రజలను చంపారు. వాళ్లు ప్రజలను చంపిన విధానం సహించరానిది. వారిని తుదముట్టించి బందీలను విడిపించిగలిగినందుకు నేను అల్లాకు కృతజ్ఞతలు చెప్తున్నా. ఇస్లాం శాంతియుత మతం. ఇస్లాం పేరుతో ప్రజలను చంపటం ఆపండి. దేశం నుంచి ఉగ్రవాదులను, హింసాత్మక తీవ్రవాదులను సమూలంగా పెకలించివేసేందుకు చేయాల్సిందంతా చేస్తాం’ అని పేర్కొన్నారు. రెండు రోజులు అధికార సంతాప దినాలుగా ప్రకటించారు. పిడికెడు మంది ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు దేశప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. స్వార్థశక్తులు అమాయకలు బందీలుగా పట్టుకోవటం ద్వారా దేశాన్ని అరాచకదేశంగా చూపాలని ప్రయత్నిస్తున్నాయని, స్థానిక శక్తులు అంతర్జాతీయ శక్తులతో కుట్రపన్నుతున్నాయని ధ్వజమెత్తారు. ఉగ్రవాదులను కూకటివేళ్లతో పెకలించటం ద్వారా దేశాన్ని మళ్లీ శాంతియుత దేశంగాస్థాపించగలమన్నారు. ఖురాన్ చెప్పలేదని హింస బందీలుగా పట్టుకున్న వారి మతం ఏమిటనేది ఉగ్రవాదులు తనిఖీ చేశారని.. ఖురాన్ వాక్యాలు చెప్పాలని అడుగుతూ చెప్పలేని వారిని హింసించారని.. ఈ దారుణానికి ప్రత్యక్ష సాక్షి అయిన ఒక బంగ్లాదేశీ కుటుంబం వెల్లడించింది. బంగ్లాదేశ్‌కు చెందిన హస్నత్ కరీమ్, ఆయన భార్య షార్మిన్ కరీమ్, కుమార్తెలు సాఫా (13), రాయాన్ (8)లు హోలీ ఆర్టిసన్ బేకరీలో సాఫా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా ఉగ్రవాదులు దాడి చేశారు. పది గంటల పాటు సాగిన ఉగ్రవాదుల పైశాచికత్వానికి వారు ప్రత్యక్ష సాక్షులయ్యారు. ‘‘వారు (ఉగ్రవాదులు) బంగ్లాదేశీ జాతీయులతో దురుసుగా ప్రవర్తించలేదు. పైగా బంగ్లాదేశీయులందరికీ వాళ్లు రాత్రి భోజనం కూడా ఏర్పాటుచేశారు. బందీలందరినీ ఖురాన్ వాక్యాలు చెప్పాలంటూ వారు అడిగారు. ఒకటో రెండో వాక్యాలు చెప్పగలిగిన వారిని ఏమీ అనకుండా వదలిపెట్టారు. మిగతా వారిని హింసించారు’’ అని హస్నత్ తండ్రి రేజుల్ కరీమ్ వివరించారు. సైనిక చర్యలో పలువురు ఇతర బందీలతో పాటు ఈ కుటుంబాన్ని కూడా విడిపించగా.. వారిని వెంటనే విచారణ నిమిత్తం డిటెక్టివ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలించారు. బంగ్లా సోదరులకు అండగా ఉన్నాం: మోదీ ఢాకా మారణహోమం తమకు మాటలకందని బాధ కలిగించిందని ప్రధాని మోదీ ట్విటర్లో తీవ్ర విచారం వ్యక్తంచేశారు. శనివారం బంగ్లా ప్రధాని హసీనాకు ఫోన్ చేసి మాట్లాడానని, దాడిని తీవ్రంగా ఖండించానని తెలిపారు. ఈ విచార సమయంలో బంగ్లాదేశ్ సోదరసోదరీమణుల సరసన భారత్ దృఢంగా నిలుచుని ఉందన్నారు. భారతీయ యువతి తారుషి జైన్‌ని ఉగ్రవాదులు హత్యచేయటం తనను ఎంతో కలచివేసిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. ఆమె తండ్రి సంజీవ్జైన్తో మాట్లాడానన్నారు. ఢాకా మారణకాండను కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్‌కు సంఘీభావం ప్రకటించారు. దుండగులపై ఉమ్మడిగా, నిర్ణయాత్మక చర్య చేపట్టాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దు వెంట బీఎస్ఎఫ్ నిఘాను పటిష్టం చేసింది. -
ఢాకా దాడిని ఖండించిన మోదీ..
న్యూఢిల్లీః బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భారత ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ లో మాట్లాడారు. శుక్రవారం ఢాకాలో జరిగిన దాడి ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఐసిస్ ముష్కరులు జరిపిన దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన మోదీ... గాయాలైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఢాకాదాడులపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితులపై తెలుసుకున్న ఆయన.. దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ఆయన పలు ట్వీట్లు చేశారు. ఢాకా దాడులు ఎంతో బాధను కలిగించాయని, ప్రధాని షేక్ హసీనాతోనూ, ఇతర అధికారులతోనూ మాట్లాడినట్లు తన ట్వీట్స్ లో తెలిపిన మోదీ.. దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యుల్లాంటి బంగ్లాదేశ్ ప్రజలకు భారత్ అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ధృఢంగా ఉండాలని మోదీ సూచించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని కేఫ్ లో బంధించి, ఇస్టామిక్ స్టేట్ తీవ్ర వాదులు దారుణంగా చంపేసిన 20 మందిలో భారతదేశానికి చెందిన బాలిక తరుషి జైన్ కూడ ఉన్నట్లు విదేంశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మరో ట్వీట్లో పేర్కొన్నారు. -
హసీనాకు త్రుటిలో తప్పిన బాంబు ప్రమాదం
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శనివారం బాంబు పేలుళ్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఢాకాలోని రద్దీ వాణిజ్య ప్రాంతం కార్వాన్ బజార్ గుండా ప్రధాని కాన్వాయ్ వెళ్లిన 10 నిమిషాల తర్వాతే, అక్కడ బాంబు పేలుళ్లు సంభవించాయి. బంగ్లా జాతిపిత, ఆమె తండ్రి షేక్ ముజీబుర్ రెహ్మాన్ 1971లో చేసిన చారిత్రక ప్రసంగాన్ని పురస్కరించుకొని అవామీ లీగ్ ఏర్పాటు చేసిన ర్యాలీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక పోలీసు అధికారి స్వల్పంగా గాయపడ్డారు. విపక్షాలు దేశవ్యాప్తంగా రవాణా దిగ్బంధానికి పాల్పడుతున్న నేపథ్యంలో ఈ పేలుళ్లు సంభవించాయి.