ఎన్నికల ‘చిత్రా’నికి పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో సర్వం సిద్ధమైంది. అక్కడ జనవరి 7న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కాకపోతే వాటి ఫలితం మాత్రం ముందే తేలిపోయింది. విపక్ష పార్టీల బాయ్‌కాట్ నేపథ్యంలో పాలక అవామీ లీగ్ విజయం, పార్టీ అధినేత్రి షేక్ హసీనా ప్రధానిగా కొనసాగడమూ లాంఛనప్రాయమే కానుంది. హసీనా వంటి నియంత చేతిలో అధికారం ఉన్నంత వరకూ ఎన్నికలు పారదర్శకంగా జరిగే అవకాశం లేదని విపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి.
ఆమె పదవి నుంచి తప్పుకుని తటస్థ మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని, దాని పర్యవేక్షణలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరపాలని అవి పలుమార్లు డిమాండ్ చేశాయి. వాటిని హసీనా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. దాంతో ఎన్నికల బహిష్కరణ తప్ప తమకు మరో మార్గం లేదని విపక్షాలన్నీ ఇప్పటికే ప్రకటించాయి. బేగం ఖలీదా జియా సారథ్యంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్‌పీ), దాని భాగస్వాములతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్నికలను బాయ్‌కాట్ చేశాయి. ఈ నేపథ్యంలో బ్యాలెట్ పత్రాలపై కేవలం అధికార అవామీ లీగ్, దాని భాగస్వామ్య పక్షాల అభ్యర్థులు, స్వతంత్రులు మాత్రమే ఉండనున్నారు!
ఇంటా బయటా విమర్శలే...
హసీనా పూర్తిగా ఏకపక్ష పోకడలు పోతున్నారన్న ఆరోపణలు ఇప్పటివి కావు. బంగ్లాదేశ్‌లో 2009 నుంచీ ఆమే ప్రధానిగా అధికారం చలాయిస్తున్నారు. ఆ క్రమంలో గత పదేళ్లుగా హసీనా కరడుగట్టిన నియంతగా మారారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారని, విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కంట్లో నలుసుగా మారిన వారిని ఏకంగా చంపిస్తున్నారని మండిపడుతున్నాయి. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని కోరుతున్నాయి. వాటి వాదనలోనూ వాస్తవం లేకపోలేదు. విపక్ష నేతలు, ముఖ్యంగా బీఎన్‌పీకి చెందిన వారు భారీగా జైలుపాలయ్యారు.
కనీసం 20 మందికి పైగా తమ నేతలు, కార్యకర్తలు జైలుపాలైనట్టు బీఎన్‌పీ నాయకుడు అబ్దుల్ మొయీన్ ఖాన్ ఆరోపించారు. బీఎన్‌పీ చీఫ్ బేగం ఖలీదా జియా కూడా అవినీతి ఆరోపణలపై గృహ నిర్బంధంలో మగ్గుతున్నారు. 78 ఏళ్ల జియా ఆరోగ్యమూ బాగా క్షీణించింది. తన నియంతృత్వం, అణచివేత బయటి ప్రపంచానికి తెలియకుండా అడ్డుకునేందుకు మీడియాపైనా హసీనా ఉక్కుపాదం మోపారని విపక్షాలు దుయ్యబడుతున్నాయి.
నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనిస్‌ను కేసులతో వేధించడం ఆపాలంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు ఏకంగా 170 మంది అంతర్జాతీయ ప్రముఖులు హసీనాకు గత ఆగస్టులో బహిరంగ లేఖ రాయాల్సి వచ్చింది! అయినా ఆర్థిక అవకతవకల కేసులో ఆయనకు తాజాగా ఆర్నెల్ల జైలు శిక్ష పడటం గమనార్హం! ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అణచివేత తీవ్రతరం కావడంతో నిర్బంధం నుంచి తప్పించుకునేందుకు బీఎన్‌పీతో పాటు పలు విపక్షాల నేతలు భారీగా అజ్ఞాతంలోకి వెళ్లారు!! జర్నలిస్టులతో పాటు ఎవరికీ బంగ్లాదేశ్‌లో సురక్షిత పరిస్థితులు లేవని ఐరాస స్వయంగా పేర్కొంది.
భిన్న పార్శ్వం
హసీనా ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ ప్రస్థానంలో భిన్న పార్శ్వంన్నాయి. ఒకటి పుష్కర కాలంగా దేశం సాధించిన స్థిరమైన ఆర్థిక ప్రగతి. మరొకటి ప్రధానిగా ఆమె ఒంటెత్తు పోకడలు, విచ్చలవిడి అణచివేత విధానాలు. ప్రపంచంలోని అతి పేద దేశాల్లో ఒకటిగా చెప్పే బంగ్లాదేశ్ హసీనా హయాంలో చెప్పుకోదగ్గ ఆర్థిక ప్రగతి సాధించింది. ఆర్థిక వృద్ధిలో భారత్‌ను కూడా మించిపోయింది. దేశంలో గత పదేళ్లలో తలసరి ఆదాయం మూడింతలు పెరిగింది.
గత 20 ఏళ్ల కాలంలో కనీసం 2.5 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డట్టు ప్రపంచ బ్యాంకు గణాంకాలే చెబుతున్నాయి. భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు హసీనా తెర తీశారు. దుస్తుల ఎగుమతిలో చైనా తర్వాత రెండో స్థానం బంగ్లాదేశ్‌దే. అయితే ఈ అభివృద్ధంతా ప్రజాస్వామిక విలువలకు పాతరేసిన ఫలితమేనన్న వాదన ఉంది. మరోవైపు కరోనా కల్లోలం బంగ్లాను అతలాకుతలం చేసింది. జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. ద్రవ్యోల్బణం 9.5 శాతం దాటింది! విదేశీ మారక నిల్వలు క్షీణిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్
నియంతగా మారిన హక్కుల నేత!
76 ఏళ్ల షేక్ హసీనా బంగ్లాదేశ్ జాతి పిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ పెద్ద కూతురు. ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. కరడుగట్టిన నియంతగా విమర్శల పాలవుతున్న ఆమె ఒకప్పుడు బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య మనుగడ కోసం ప్రముఖంగా గళమెత్తడం విశేషం! 1980ల్లో సైనిక పాలకుడు జనరల్ హుసేన్ మహమ్మద్ ఎర్షాద్ నియంతృత్వంపై ఖలీదా జియాతో పాటు అన్ని పార్టీల నేతలతోనూ కలిసి పోరాడారామె.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వారితో పాటు వీధి పోరాటాలూ చేశారు. 1996 ఎన్నికల్లో నెగ్గి తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టారు. 2001లో ఖలీదా చేతిలో ఓటమి చవిచూశారు. 2006లో అవినీతి ఆరోపణలపై నిర్బంధం పాలయ్యారు. 2008లో జైలు నుంచి విడుదలయ్యాక ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. నాటినుంచీ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆమె ఇప్పటికే మొత్తమ్మీద 19 ఏళ్లు ప్రధానిగా ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న మహిళా దేశాధినేతగా ఇప్పటికే రికార్డులకెక్కారు.
Comments
Please login to add a commentAdd a comment