సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పాలక ఆప్ మంగళవారం పార్టీ మేనిఫెస్టోను వెల్లడించింది. దేశ రాజధాని ప్రజలందరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్యం, సురక్షిత నీరు, 24 గంటల విద్యుత్ అందిస్తామని భరోసా ఇచ్చింది. ఇంటింటికీ రేషన్ సరుకుల సరఫరా, పది లక్షల మంది సీనియర్ సిటిజన్లకు ఉచిత యాత్రాసౌకర్యం కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పష్టం చేశారు. రెండు భాగాలుగా రూపొందిన మేనిఫెస్టోలో తొలి భాగం పది హామీలతో ఇప్పటికే విడుదల కాగా రానున్న ఐదేళ్లలో ఏం చేస్తామనేది రెండవ భాగంలో ఆప్ పొందుపరించింది.
ఆప్ ప్రభుత్వం 2015లో ఆమోదించిన ఢిల్లీ జన్ లోక్‌పాల్ బిల్లు నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపింది. పాఠశాల విద్యలో ప్రవేశపెట్టిన హ్యాపినెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కరిక్యులమ్ విజయవంతమైన క్రమంలో త్వరలో దేశభక్తికి సంబంధించిన సిలబస్‌ను ప్రవేశపెడతామని పేర్కొంది. ప్రపంచ శ్రేణి రహదారుల నిర్మాణం, యమునా నదీతీరంలో అభివృద్ధి పనులు, ఢిల్లీ మెట్రో విస్తరణ, యువతకు స్పోకెన్ ఇంగ్లీష్‌లో శిక్షణ, పారిశుద్ధ కార్మికుల సంక్షేమ చర్యలు వంటి పలు హామీలను ఆప్ తన మేనిఫెస్టోలో గుప్పించింది.
Comments
Please login to add a commentAdd a comment