
స్టాట్యూ మ్యాన్ ఆఫ్ ఇండియా..
ఎవరైనా కదలకుండా ఎంతసేపు నిలబడగలరు..? ఓ ఐదు నిమిషాలు.. అరగంట.. అంతకుమించి అయితే చాలా కష్టం కదూ! నిజంగానే మనం అసలేమాత్రం కదలకుండా అంతకన్నా ఎక్కువసేపు నిలబడడం సాధ్యం కాదు. కానీ ఓ వ్యక్తి మాత్రం ప్రతి రోజూ, నిర్విరామంగా ఆరు గంటలసేపు కదలకుండా, విగ్రహంలా నించుంటున్నాడు. అది కూడా దాదాపు మూడు దశాబ్దాలకు పైగా! అందుకే అతడ్ని ‘స్టాట్యూ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అంటున్నారు. అతడి పేరు అబ్దుల్ అజీజ్. ఇంతకీ అతనెక్కడ ఉంటాడో.. ఎందుకలా నిలబడుతున్నాడో తెలుసుకుందాం..
సందర్శకుల కోసం..
అది చెన్నైలోని ఓ ప్రైవేటు బీచ్ రిసార్టు. కుటుంబం, స్నేహితులతో సరదాగా గడిపేందుకు, బీచ్‌కు సమీపంలో ఉన్న ఈ రిసార్టుకు ప్రతిరోజూ వందల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. వారికి అనేక రకాలుగా వినోదం పంచడం రిసార్టు నిర్వాహకుల బాధ్యత. పర్యాటకుల్ని ఆకర్షించే ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి ఆ రిసార్టులో. అయితే అన్నింటికంటే ఎక్కువగా పర్యాటకుల్ని ఆకర్షించేది మాత్రం ఓ వ్యక్తి. ఇంతకీ అతనేం చేస్తాడో తెలుసా.. కదలకుండా, ఓ విగ్రహంలా నిలబడి ఉంటాడు. అది కూడా వరుసగా ఆరు గంటలపాటు. కళాత్మకంగా, వివిధ శిల్పాలతో తీర్చిదిద్దిన సెట్ల మధ్య అతడు ఓ శిల్పంలా నిలబడి ఉండి అందరినీ ఆకట్టుకుంటాడు. సందర్శకుల్ని ఆకర్షించే ఉద్దేశంతో, రిసార్టు యాజమాన్యం అతడ్ని విగ్రహంలా నిలబడే ఏర్పాటు చేసింది.
మూడు దశాబ్దాలుగా..
శిల్పంలా నిలబడి ఉంటున్న అతడి పేరు అబ్దుల్ అజీజ్. 54 ఏళ్ల వయసున్న అజీజ్ ఈ రిసార్టులో దాదాపు 1985 నుంచి ఇదే పని చేస్తున్నాడు. ఒక వ్యక్తి 32 ఏళ్లుగా, ప్రతి రోజూ, ఆరు గంటలపాటు విగ్రహంలా నిలబడి ఉండడం అంత సులభమైన విషయం కాదు. కానీ, అజీజ్, దీన్ని ఇన్నేళ్లుగా విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. అందువల్లే అతడిని ‘స్టాట్యూ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తున్నారు. విదేశాల్లో కూడా ఇలా శిల్పంలా నిలబడి ఉండే కళాకారులు చాలా మందే ఉన్నారు. కానీ దీర్ఘకాలం పాటు ఇదే పని కొనసాగిస్తున్న వారు ప్రపంచంలో చాలా అరుదు. బహుశా, ఇంత ఎక్కువ కాలం పాటు విగ్రహంలా నిలబడి ఉంటున్న వ్యక్తి ఇతడే అయ్యుండొచ్చు.
యజమాని ఆలోచన..
ఇది 1985 నాటి సంగతి. అప్పుడు అబ్దుల్ అజీజ్ వయసు 22 ఏళ్లు ఉంటుంది. ఉపాధి కోసం చెన్నైలోని ఓ రిసార్టులో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. తనతోపాటు, రిసార్టులో మరో నలుగురైదుగురు సెక్యూరిటీ గార్డులుగా పనిచేసేవారు. ఈ సమయంలో రిసార్టు యజమాని తన కుటుంబంతో కలిసి బ్రిటన్ పర్యటనకు వెళ్లాడు. అక్కడ కొన్ని పర్యాటక ప్రదేశాల్లో ఇలా విగ్రహంలాగా, కొందరు నిలబడి ఉండడాన్ని చూశాడు. వీరు పర్యాటకుల్ని బాగా ఆకట్టుకోవడాన్ని గమనించిన ఆయనకు ఓ ఐడియా తట్టింది. ఇండియాలోని తన రిసార్టులో కూడా ఇలా శిల్పంలాగా ఓ వ్యక్తిని నియమించాలనుకున్నాడు.
చెన్నైకు తిరిగి వచ్చిన వెంటనే తన సెక్యూరిటీ గార్డులను పిలిచి, ఈ విషయం చెప్పాడు. గార్డుల్లో ఒకరిని దీని కోసం నియమించాలనుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇందుకోసం సెక్యూరిటీ గార్డులకు మూడు నెలలు శిక్షణ కూడా ఇప్పించాడు. ఎక్కువసేపు కదలకుండా ఉండే వారిని దీని కోసం నియమించాలనుకున్నాడు. అలాగే ఒక్కసారి అలా నిలబడ్డాక కదలడం, నవ్వడం, మాట్లాడడం వంటివి కూడా చేయకూడదు. శిక్షణ పూర్తయ్యేలోపు వారిలోంచి అబ్దుల్ అజీజ్‌ను ఎంపిక చేశాడు. అతడు అందరిలోకీ, మంచి ప్రతిభ కనబర్చడంతో అతడ్ని ఎంపిక చేశాడు.
ఇష్టం లేకున్నా..
యజమాని తనను శిల్పంలా నిలబడే పనికి నియమించడం నిజంగా అబ్దుల్ అజీజ్‌కు ఇష్టం లేదు. కానీ, ఈ విషయం చెబితే, యజమాని సెక్యూరిటీ గార్డుగా కూడా తీసేస్తాడేమోనని భయపడ్డాడు. పైగా తనకు ఆ ఉద్యోగం ఎంతో అవసరం. దీంతో, తప్పనిసరి పరిస్థితుల్లో అజీజ్ ఈ పనికి ఒప్పుకొన్నాడు. అలా మొదలైన అతడి ప్రస్థానం మూడు దశాబ్దాలుగా, విజయవంతంగా కొనసాగుతోంది.
క్లిష్టమైన పని..
ప్రస్తుతం అజీజ్ రోజూ ఆరు గంటలపాటు కదలకుండా నిలబడుతున్నాడు. రాచరిక కాలం నాటి ప్రత్యేక దుస్తులు ధరించి, రిసార్టులో ఒకే చోట అలా నిలబడి ఉంటాడు. ఒక్కసారి అలా నిలబడడం ప్రారంభమైందంటే, సమయం పూర్తయ్యే వరకూ ఎటూ కదిలే అవకాశం ఉండదు. ఈ సమయంలో అతడు నవ్వడం, మాట్లాడడం, నడవడం, వంటివి కూడా చేయడు. అచ్చం ఓ విగ్రహంలా ఉంటాడంతే. భోజనం కూడా పని తర్వాతే. అత్యవసరమైతే తప్ప ఈ పనికి విరామం ఉండదు. విదేశాల్లోనూ పలు సంస్థలు, ఇలాంటి వ్యక్తుల్ని నియమించుకుంటాయి. అయితే వారికి ప్రతి రెండు గంటలకోసారి విరామం ఉంటుంది. షిఫ్టుల మార్పూ ఉంటుంది. కానీ, అజీజ్‌కు మాత్రం ఆరుగంటలపాటు ఇవేవీ ఉండవు. సందర్శకులు ఎవరూ లేని సమయంలో, విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటే మాత్రం కొద్దిగా రిలాక్స్ అవుతాడు.
గుర్తింపు..
ఇన్నేళ్లుగా అసాధారణమైన పని చేస్తున్న అజీజ్‌కు ఇప్పుడు మంచి గుర్తింపు దక్కింది. పలువురు సినీ సెలబ్రిటీలు సైతం, అజీజ్ పనితీరును చూసేందుకు వస్తున్నారు. అయితే, ఇలా రోజూ నిలబడి ఉండడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అతడు చెప్పాడు. కానీ, తన కుటుంబ పోషణ కోసం ఈ పని చెయ్యక తప్పడం లేదని, ఆవేదన చెందాడు.
ఇబ్బందుల్ని అధిగమించి..
తనకుతానుగా, అజీజ్ ఆరు గంటలపాటు నిలబడి ఉండగలడు. కానీ, ఇతడ్ని కదిలించేందుకు చాలా మంది సందర్శకులు ప్రయత్నిస్తుంటారు. నవ్వించేందుకు మంచి జోకులు చెబుతుంటారు. అయినా ఇతడు నవ్వడు. ఇలా నవ్వించేందుకు ప్రయత్నించడం, మొహానికి దగ్గరగా వచ్చి, వెకిలి చూపులు చూడడం, చేతుల్ని బలవంతంగా కదిలించేందుకు ప్రయత్నించడం వంటి చేష్టలతో, ఇతడ్ని సందర్శకులు ఇబ్బంది పెడుతుంటారు. అయినప్పటికీ, తన చుట్టూ ఏం జరుగుతున్నా, పట్టించుకోకుండా అలా నిలబడే ఉంటాడు. కనీసం కంటి రెప్పలు కూడా కదిలించకుండా, అలా విగ్రహంలా నిలబడే ఉంటాడు. అంతగా అజీజ్, ఈ పనికి అలవాటు పడిపోయాడు. సందర్శకుల నుంచి మరీ ఇబ్బంది ఎదురైతే మాత్రం, పక్కనే ఉండే గార్డులు వారిని దూరంగా తీసుకెళ్తారు. రిసార్టు యాజమాన్యం కూడా అప్పుడప్పుడూ ఓ పోటీ నిర్వహిస్తుంటుంది. సందర్శకులెవరైనా, అజీజ్ తనకుతానుగా కదిలేలా చేయగలిగితే, వారికి నగదు బహుమతినిస్తామని ప్రకటించింది. అయితే, ఎవరూ ఆ పని చేయలేకపోయారు. – సాక్షి, స్కూల్ ఎడిషన్