భార్య హంతకుడికి అసెంబ్లీ టికెటా: సీఎం
సమాజ్‌వాదీ పార్టీలో మళ్లీ ముసలం మొదలైనట్లే కనిపిస్తోంది. బాబాయ్ - అబ్బాయి మధ్య పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ రాజీ చేసినా.. గొడవలు మాత్రం ఏమాత్రం తగ్గినట్లు లేవు. భార్యను చంపిన కేసులో హత్యారోపణలు ఎదుర్కొంటున్న అమన్మణి త్రిపాఠీ అనే వ్యక్తికి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ ప్రకటించిన కొద్దిసేపటికే.. అసలు అతడికి టికెట్ ఇచ్చినట్లే తనకుతెలియదని సీఎం అఖిలేష్ యాదవ్ స్పందించారు. త్రిపాఠీ తల్లిదండ్రులు మాజీ మంత్రి అమర్మణి, ఆయన భార్య మధుమణి త్రిపాఠీ కూడా హత్యకేసులలో దోషులే. అలాంటి వ్యక్తికి మహరాజ్‌గంజ్ జిల్లా నౌతన్వా నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చారు. త్రిపాఠీ భార్య రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే, ఆయనే ఆమెను చంపేసి ఉంటాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఆరోపించడంతో దీనిపై సీబీఐ విచారణకు ఇంతకుముందు సీఎం అఖిలేష్ యాదవ్ ఆదేశించారు.
ఇలాంటి కేసులో ఉన్న త్రిపాఠీకి పార్టీ టికెట్ ఇవ్వడంపై నిజాయితీగా సమాధానం ఇవ్వాలని మీడియా గట్టిగా అడిగింది. దానికి సీఎం స్పందిస్తూ.. ''ఇది పార్టీ అంతర్గత వ్యవహారం. నా అభిప్రాయం ఏంటో మీకు ఇంతకుముందే తెలుసు. నేను కొన్ని అలవాట్లు మార్చలేను. నాకు ఈ విషయం గురించి తెలియదు. నేను ఏదో కార్యక్రమ ప్రారంభంలో ఉన్నాను'' అని ఆయన సమాధానం చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి నేర చరితులను పూర్తిగా తరిమేసి.. పార్టీకి 'క్లీన్' ఇమేజి తేవాలన్నదే తన ఉద్దేశమని అఖిలేష్ పలు సందర్భాల్లో చెప్పారు. మాఫియా నాయకుడిగా ఉండి, రాజకీయాల్లో్కి వచ్చిన ముఖ్తార్ అన్సారీ స్థాపించిన ఖ్వామీ ఏక్తా దళ్‌ను సమాజ్‌వాదీలో విలీనం చేయాలని శివపాల్ యాదవ్ సహా పలువురు ప్రతిపాదించినప్పుడు అఖిలేష్ తీవ్రస్థాయిలో దాన్ని వ్యతిరేకించారు. దాంతో ఆ నిర్ణయం వెనక్కి వెళ్లింది.