నేను రాజీనామా చేశా...
పుణె: ప్రముఖ టీవీ నటి, జాతీయ స్పెషల్ జ్యూరీ అవార్డు విజేత పల్లవీ జోషి భారత ఫిలిం అండ్ టెలివిజన్ సంస్థ (ఎఫ్‌టీఐఐ)కు రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ప్రసార మంత్రిత్వశాఖకు తన రాజీనామా పత్రాన్ని నాలుగు రోజులు క్రితం పంపించాననీ, సంస్థ నుంచి తనకు ఎలాంటి సమాధానం రాలేదని తెలిపారు. దీంతో గజేంద్ర చౌహాన్ నియామకానికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి నైతిక మద్దతు లభించినట్టయింది.
సాధారణంగా విద్యార్థుల ఆందోళనను సమర్ధించనంటూనే వారికి వేరే ఆప్షన్ లేకుండా పోయిందని పల్లవి పేర్కొన్నారు. చాలా మర్యాదపూర్వకంగా, శాంతియుతంగా వారు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారన్నారు. మరోవైపు చౌహాన్ నియమాకంపై స్పందించడానికి ఆమె నిరాకరించారు. రాజ్ కుమార్ హిరానీ, బాలీవుడ్ నటి విద్యాబాలన్, సినిమాటోగ్రాఫర్ శైలేష్ గుప్తా తదితర సినీ దిగ్గజాలు సభ్యులుగా పనిచేసిన ఎఫ్టీఐఐలో పల్లవీ సభ్యురాలిగా ఉన్నారు.
కాగా భారత ఫిలిం, టీవీ సంస్థ (ఎఫ్‌టీఐఐ) చైర్మన్‌గా గజేంద్ర చౌహాన్ నియామకాన్ని ప్రభుత్వం వెనుకకు తీసుకోవాల్సిందేనని, అప్పటిదాకా తమ ఆందోళన ఆగదని ఆ సంస్థ విద్యార్థులు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అధికారులతో విద్యార్థుల ప్రతినిధి బృందంతో శుక్రవారం జరిపిన చర్చలు జరిపారు. ఈ చర్చల్లో విషయం ఎటూ తేలకపోవడంతో అనంతరం వారు కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు. అయితే గజేంద్రను తొలగించే ప్రసక్తే లేదని జైట్లీ స్పష్టం చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఎఫ్‌టీఐఐ విద్యార్థుల సంఘం (ఎఫ్‌ఎస్‌ఏ) నిర్ణయించింది. జాతీయ స్థాయిలో ఎంతోమంది దిగ్గజ నటులుండగా, చిత్ర పరిశ్రమ పెద్దలు ఉండగా అనుభవం, స్థాయిలేని గజేంద్రను నియమించడంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.