
మోదీ సర్కార్ నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నయూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్
సాక్షి, లక్నో : ఉప ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురవడంతో ఉత్తర ప్రదేశ్ పార్టీ యంత్రాంగంలో భారీ మార్పులకు బీజేపీ సన్నద్ధమైంది. పార్టీ, ప్రభుత్వ పదవుల నియామకాల్లో సమతూకం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. మరోవైపు సంఘ్ పరివార్‌తో సమన్వయంతో పనిచేయాలని బీజేపీ అగ్రనాయకత్వం సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు సూచించింది. అధికారుల ప్రమేయాన్ని తగ్గించి పార్టీ నేతల సూచనలకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా విస్పష్ట సంకేతాలు పంపినట్టు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. బూత్ స్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గస్థాయి వరకూ పార్టీ శ్రేణుల అభిప్రాయాలకు పెద్దపీట వేసేలా చర్యలు చేపట్టాలని బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదేశించిందని వెల్లడించాయి. మారిన సంస్థాగత నిర్మాణంలో పార్టీ విస్తారక్‌లు కీలక భూమిక పోషిస్తారని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.
మరోవైపు త్వరలో చేపట్టనున్న యూపీ క్యాబినెట్ విస్తరణలో సంఘ్ పరివార్ నేపథ్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు. జులై రెండో వారంలోగా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ ఈ దిశగా కసరత్తు చేస్తున్నారు. కైరానా లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎదురైన పరాజయం నేపథ్యంలో అధికారిక నియామకాల్లో సమతూకానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది. కాగా యూపీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సునీల్ బన్సల్ పనితీరుపై యూపీ నేతలు ఫిర్యాదు చేయడంతో కేంద్ర నాయకత్వం కొద్దిరోజుల పాటు యూపీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఇన్‌చార్జ్‌లు సునీల్ బన్సల్, శివ్‌ప్రకాష్‌లకు సూచించినట్టు సమాచారం.
ఇక బన్సల్‌తో విభేదాల కారణంగా పార్టీ యూపీ వ్యవహరాల ఇన్‌చార్జ్ ఓపీ మాధుర్ సైతం అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.పార్టీ శ్రేణుల్లో నెలకొన్న విభేదాలు, అసంతృప్తిని పారదోలేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ అన్ని జిల్లాల్లో పర్యటించి పార్టీ నేతలు, కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment