
న్యూఢిల్లీ: గ్యాంబ్లింగ్, బెట్టింగ్ దందా నడుపుతున్న ముఠాను పట్టుకోవటంలో పోలీసులకు సహకరించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన నజియా(18)తోపాటు 18 మంది బాలలు ఈ ఏడాది సాహస అవార్డులకు ఎంపికయ్యారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్(ఐసీసీడబ్ల్యూ) ఇచ్చే ఈ అవార్డులకు ఐదు విభాగాల కింద బాలలను ఎంపిక చేస్తారు.
వీటిలో అత్యున్నతమైన ‘భారత్ అవార్డు’కు నజియా ఎంపికైంది. ఈమెకు దుండగుల నుంచి ఎన్నో బెదిరింపులు వచ్చాయి. అయినా లక్ష్యపెట్టకుండా తమ ప్రాంతంలోని గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ముఠా ఆటకట్టించగలిగింది. కర్ణాటకకు చెందిన నేత్రావతి ఎం.చవాన్ నీటిలో మునిగిపోతున్న ఇద్దరు బాలురను రక్షించే క్రమంలో నీట మునిగి చనిపోయింది.
ఈమెకు మరణానంతరం ఈ అవార్డు ప్రకటించారు. కాల్వలో పడి పోయిన స్కూల్ బస్సు నుంచి 15 మంది బాలలను కాపాడిన అదే బస్సులో ఉన్న పంజాబ్‌నకు చెందిన విద్యార్థి కరణ్‌బీర్ సింగ్(17) కూడా ఎంపికయ్యాడు. ఈనెల 24వ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో వీరంతా ప్రధాని చేతుల మీదుగా పతకాలు అందుకోనున్నారు. జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న అనంతరం వీరందరికీ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ విందు ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment