న్యూఢిల్లీ: ఉగ్రవాదులతో జరిగిన పోరులో అమరుడైన వైమానిక దళం గరుడ్ కమాండో జ్యోతి ప్రకాశ్ నిరాలాకు కేంద్రం ‘అశోక్ చక్ర’ పురస్కారాన్ని ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 390 మందికి రాష్ట్రపతి సాహస పురస్కారాలను ప్రకటించారు. వీటిలో ఒక కీర్తి చక్ర, 14 శౌర్య చక్ర, 28 పరమ్ విశిష్ట సేవా పతకాలు, 4 ఉత్తమ్ యుద్ధ్ సేవా పతకాలు ఉన్నాయి. ఉత్తమ సేవలు అందించిన 27 మంది సీబీఐ అధికారులకు రాష్ట్రపతి పురస్కారాలు ప్రకటించారు.
2017 నవంబరులో కశ్మీర్‌లోని బందిపొర జిల్లా చందర్‌గెర్‌లోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగున్నారన్న సమాచారం మేరకు గరుడ్ ప్రత్యేక దళానికి చెందిన ప్రకాశ్‌తోపాటు మరికొందరు రంగంలోకి దిగారు. ఉగ్రవాదులు దాగున్న సంగతి తెలిసిన గరుడ్ దళం ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టింది. కార్పొరల్ ప్రకాశ్ మాత్రం ప్రమాదాన్ని లెక్కచేయకుండా స్థావరం అతి సమీపంలోకి వెళ్లి ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపి ఇద్దరిని మట్టుబెట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిరాలా తుదిశ్వాస విడిచారు. కాగా, సీఆర్పీఎఫ్‌కు చెందిన ఇద్దరు కమాండోలకు కేంద్రం శౌర్యచక్ర పురస్కారం ప్రకటించింది. జార్ఖండ్‌లోని లతేహార్‌లో ఆరుగురు మావోయిస్టులను మట్టుబెట్టటంతోపాటు ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకోవటంలో అసిస్టెంట్ కమాండెంట్ జఖార్‌తోపాటు ఆయన బృందంలోని సబ్ ఇన్‌స్పెక్టర్ రియాజ్ ఆలం కీలకంగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment