28 ఏళ్ల తరువాత... అమ్మ దొరికింది! | Mother found after 28 years | Sakshi
Sakshi News home page

28 ఏళ్ల తరువాత... అమ్మ దొరికింది!

Published Fri, Jul 22 2016 3:44 AM | Last Updated on Tue, Nov 6 2018 4:13 PM

28 ఏళ్ల తరువాత... అమ్మ దొరికింది! - Sakshi

28 ఏళ్ల తరువాత... అమ్మ దొరికింది!

- పేగుబంధం కోసం యూఏఈ నుంచి వచ్చిన అక్కాచెల్లెళ్లు
- పోలీసుల సాయంతో ఒక్కటైన వైనం

 
హైదరాబాద్: ‘‘మీకు తల్లి ఉంది. ఆమె పేరు నాజియా. 35 ఏళ్ల కింద హైదరాబాద్ బార్కాస్‌లో ఆమెను వివాహం చేసుకున్నా. మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు మనస్పర్థల కారణంగా విడాకులిచ్చి పంపాను..’’ చనిపోతున్న సమయంలో ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు చెప్పిన మాటలివీ! చిన్నప్పట్నుంచీ కన్నతల్లి ప్రేమకు దూరంగా బతికిన ఆ అక్కాచెల్లెళ్లు ఈ మాటలతో తల్లి అన్వేషణలో పడ్డారు. చివరికి హైదరాబాద్ పోలీసుల చొరవతో 28 ఏళ్ల తర్వాత యూఏఈ(యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్)కు చెందిన ఆ అక్కాచెల్లెళ్లకు వారి తల్లి ఆచూకీ దొరికింది.
 
 యూఏఈలో నివాసం ఉంటున్న ఆయేషా, ఫాతిమాల తండ్రి రాషెద్ ఆరు మాసాల క్రితం చనిపోయారు. కన్నుమూసే ముందు తన బిడ్డలకు హైదరాబాద్‌లో ఉంటున్న తల్లి జాడ చెప్పాడు. దీంతో ఆ అక్కాచెల్లెళ్లు యూఏఈ నుంచి ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ వచ్చి దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణను కలిశారు. తమ తల్లిని వెతికి పెట్టాలని కోరారు. పోలీసులు పూర్తి వివరాలు సేకరించి నాజియా బేగానికి సంబంధించిన ఫోటోలతో కరప్రతాలు పంపిణీ చేశారు.
 
 పెళ్లిళ్లు జరిపించే కాజీలు, ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులతో సమావేశమవగా చిన్నపాటి క్లూ దొరికింది. దాని ఆధారంగా ఎట్టకేలకు గురువారం నాజియాను గుర్తించారు. విడాకులిచ్చి భర్త వదిలేసిన అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన నాజియాకు రెండేళ్ల తర్వాత ఆమె తల్లిదండ్రులు కర్ణాటకలోని బీదర్‌కు చెందిన పండ్ల వ్యాపారితో పెళ్లి చేశారు. ప్రస్తుతం ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు ఆయేషా, ఫాతిమాను, తల్లి నాజియాను డీసీపీ కార్యాలయానికి పిలిపించి కలిపారు.

చిన్నప్పటి జ్ఞాపకాలను పోలీసులు అడగ్గా.. నాజియా తన చిన్న కూతురు ఫాతిమా చేతికి ఆరు వేళ్లు ఉన్నాయని చెప్పింది. ఆమె చెప్పినట్లే ఫాతిమాకు ఆరు వేళ్లున్నాయి. దీంతో తల్లి కూతుళ్లను ఒకే దగ్గరికి తీసుకురావడంతో ఒక్కసారిగా వారు భావోద్వేగానికి గురై ఆనందభాష్పాలు రాల్చారు. ఈ జన్మలో తల్లిని చూస్తామనుకోలేదంటూ సంబరపడ్డారు. తల్లి అంగీకరిస్తే తమతోపాటు యూఏఈకి తీసుకెళ్తామని అక్కాచెల్లెళ్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement