
అగ్ని-5 క్షిపణి
న్యూఢిల్లీ: ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ అగ్ని–5ను ప్రవేశపెట్టేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్షిపణులతో చైనా వ్యాప్తంగా లక్ష్యాలను ఛేదించవచ్చు. 5 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని కూడా ఛేదించగలిగే ఈ అగ్ని–5.. అణ్వస్త్రాలను కూడా మోసుకెళ్లగలిగే సామర్థ్యం కలిగి ఉంది. మిలిటరీలోని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్‌ఎఫ్‌సీ) విభాగంలో ఈ క్షిపణిని ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. చైనాలోని బీజింగ్, షాంఘై, గువాంగ్‌జో వంటి నగరాలను సైతం లక్ష్యంగా చేసుకుని దాడులు చేయగలదు.
గత నెలలో ఒడిశాలోని సముద్రతీర ప్రాంతంలో అగ్ని–5ని విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. ఈ క్షిపణిని ప్రవేశపెట్టే ముందు వచ్చే కొన్ని వారాల్లో పలు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కీలకమైన ప్రాజెక్టు తుది దశకు చేరుకుందని క్షిపణి రూపకల్పనలో పాలుపంచుకున్న ఓ అధికారి పేర్కొన్నారు. అగ్ని శ్రేణిలో అగ్ని–5 చాలా సాంకేతికత పరంగా చాలా ముందు వరుసలో ఉందని, అణ్వస్త్రాలను మోసుకెళ్లడంలో బాగా అభివృద్ధి చెందిందని వివరించారు. ‘మొదటి బ్యాచ్ అగ్ని–5 క్షిపణులను ఎస్‌ఎఫ్‌సీ విభాగానికి త్వరలోనే అందించనున్నాం’అని ఆయన వెల్లడించారు.
పొరుగు దేశాల నుంచి రక్షణ పరమైన ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో అగ్ని–5ను ప్రవేశపెట్టనుండటం గుర్తించదగిన విశేషం. ఖండాంతర క్షిపణులను అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, ఉత్తర కొరియా వంటి దేశాలు మాత్రమే కలిగి ఉన్నాయి. అగ్ని–5 క్షిపణిని 2012 ఏప్రిల్ 19న తొలిసారిగా పరీక్షించగా, రెండోసారి 2013 సెప్టెంబర్ 15న, మూడోసారి 2015 జనవరి 31న, నాలుగోసారి 2016 డిసెంబర్ 26న పరీక్షించారు. ఐదోసారి ఈ ఏడాది జనవరి 18న పరీక్షించగా, అన్నింట్లో అగ్ని–5 విజయం సాధించింది. దేశ రక్షణ విషయంలో మరింత ముందుకు సాగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కీలకమైన ప్రాజెక్టులను రూపొందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment