
దొంగల్ని చితకబాది దోచుకున్నారు..
డబ్బు దోచుకుని పారిపోతున్న ఘరానాదొంగల్ని గ్రామస్తులు పట్టుకుని చితకబాదారు. వారి నుంచి నగదు, ఆయుధాలు దోచుకున్నారు.
ఆగ్రా: డబ్బు దోచుకుని పారిపోతున్న ఘరానాదొంగల్ని గ్రామస్తులు పట్టుకుని చితకబాదారు. వారి నుంచి నగదు, ఆయుధాలు దోచుకున్నారు. గ్రామస్తులు దొంగల్ని బంధించి పోలీసులకు ఫోన్ చేశారు. ఈ వార్త వినగానే వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా పోలీసులు సంతోషించారు. ఎందుకంటే గ్రామస్తులు బందించిన వాడిలో ఓ వాంటెడ్ క్రిమినల్ ఉన్నాడు. ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన జరిగింది.
ఆదివారం రాత్రి ఆగ్రా సమీపంలో నలుగురు దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. దొంగలు రెండు బైకులపై వెళ్తూ విజయ్ సింగ్ అనే వ్యక్తిపై దాడి చేసి అతణ్నుంచి పర్స్ లాక్కొ పారిపోయారు. అయితే విజయ్ సింగ్ దొంగలను పట్టుకునేందుకు వారి వెంటపడ్డాడు. దొంగలు మాల్పురా బ్లాక్ ఖల్లావా గ్రామంలోకి వెళ్లగానే విజయ్ వారిని పట్టుకోవాల్సిందిగా కేకలు వేశాడు. గ్రామస్తులు అప్రమత్తమై దొంగల వెంటపడ్డారు. ఓ బైకులో వెళ్తున్న ఇద్దరు దొంగలు తప్పించుకోగా, మరో బైకులో ఉన్న ఇద్దరు దొంగలు దొరికిపోయారు. గ్రామస్తులు వీరిద్దరినీ చితకబాది డబ్బు, మూడు రివాల్వర్లు, ఓ ల్యాప్టాప్ దోచుకున్నారు. వారిని బందించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దొంగల్ని అదుపులోకి తీసుకున్నారు. దొంగల్లో నేత్రపాల్ సింగ్ అనే వాంటెడ్ క్రిమినల్ ఉన్నట్టు గుర్తించారు. అతడి కోసం ఫిరోజాబాద్, ఆగ్రా జిల్లాల పోలీసులు ఎప్పటి నుంచో గాలిస్తున్నారు. నేత్రపాల్ సింగ్పై చాలా కేసులున్నాయని, ఓ దొంగల ముఠాలో సభ్యుడని పోలీసులు తెలిపారు. గ్రామస్తులు మొదట డబ్బు, రివాల్వర్లను వెనక్కి ఇచ్చేందుకు నిరాకరించినా.. తర్వాత పోలీసులకు అప్పగించారు.