
'గుజరాత్ ఈసారి మాదే.. బీజేపీది కాదు'
న్యూఢిల్లీ: గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో ఉత్కంఠ పరిస్థితుల మధ్య విజయాన్ని సొంతం చేసుకొని మరోసారి పార్లమెంటులోకి అడుగుపెట్టిన కాంగ్రెస్ పార్టీ కీలక నేత, సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కీలక ప్రకటన చేశారు. గుజరాత్‌లో విజయం కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలే లక్ష్యంగా పనిచేస్తానంటూ పరోక్షంగా చెప్పారు.
తన గెలుపు గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహాన్ని నింపిందని, పార్టీ వర్గమంతా కొత్త శక్తిని నింపుకొందని అన్నారు. 'నేను నమ్మకంతో చెబుతున్నాను.. మేం గుజరాత్‌ను కూడా గెలుస్తాం. బీజేపీ దీనిని(రాజ్యసభ ఎన్నికలను) ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. ఇది వారి ఓటమి' అని ఆయన అన్నారు. గుజరాత్ కాంగ్రెస్ 1995 నుంచి ఆ రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉంది. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాలను లక్ష్యంగా చేసుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను తమకు నచ్చిన విధంగా వాడుకుంటున్నారని ఆరోపించారు.