అహ్మదాబాద్‌కు అరుదైన గుర్తింపు
ప్రపంచ వారసత్వ నగరంగా అహ్మదాబాద్
అహ్మదాబాద్: గుజరాత్‌లో 600 ఏళ్ల చరిత్ర కలిగిన అహ్మదాబాద్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించింది. దీంతో అహ్మదాబాద్ పారిస్, వియన్నా, కైరా, బ్రసెల్స్, రోమ్ వంటి ప్రఖ్యాత నగరాల సరసన చేరింది. పోలండ్‌లోని క్రాకౌలో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో ఢిల్లీ, ముంబై నగరాలను వెనక్కినెట్టి అహ్మదాబాద్ ఈ గౌరవాన్ని అందుకుంది. భారత దేశంలో ఈ ఘనత దక్కించుకున్న తొలి నగరంగా అహ్మదాబాద్ నిలిచింది. భారత్‌లోని చరిత్రాత్మక అహ్మదాబాద్‌ను ప్రపంచ వారసత్వ నగరంగా ప్రకటిస్తున్నామని ‘యునెస్కో’ శనివారం రాత్రి ట్విటర్ ద్వారా తెలిపింది.
యునెస్కో నిర్ణయంతో భారత్ చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అహ్మదాబాద్ వారసత్వ నగరంగా ఎంపిక కావడం ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయమని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. అహ్మదాబాద్ ఇంత గొప్ప గుర్తింపు పొందడం అత్యంత సంతోషదాయకమని గుజరాత్ ముఖ్యమంత్రి రూపాని వ్యాఖ్యానించారు. తమ నగరానికి అరుదైన గుర్తింపు దక్కడం పట్ల అహ్మదాబాద్ వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.