
మళ్లీ పాతపాటే పాడిన పన్నీర్ సెల్వం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అమ్మ శిబిరంతో విలీనానికి ఆస్కారం లేదని పురట్చి తలైవీ శిబిరం నేత, మాజీ సీఎం పన్నీరు సెల్వం స్పష్టంచేశారు. జయలలిత మరణంతో అన్నాడీఎంకే పార్టీ అన్నాడీఎంకే అమ్మ, పురట్చి తలైవీ శిబిరాలుగా చీలిన విషయం తెలిసిందే. సీఎం పళనిస్వామి సారథ్యంలోని అమ్మ శిబిరం, మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలో సాగుతున్న పురట్చి తలైవీ శిబిరాన్ని ఏకంచేయడానికి తగ్గ ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి.
గత నెల ఇరు శిబిరాల నేతలు ప్రధాని నరేంద్ర మోదీతో వేర్వేరుగా భేటీ అయ్యారు. దీంతో విలీనం చర్చ తమిళనాడులో ఊపందుకుంది. ఈ చర్చకు ముగింపు పలుకుతూ పన్నీరు సెల్వం గురువారం మీడియాతో మాట్లాడారు. విలీన చర్చల గురించి ప్రశ్నించగా, ఆ శిబిరం నుంచి తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. ఆ శిబిరం నాయకులే ప్రశ్నలు, సమాధానాలు రెండూ ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. విలీనానికి ఆస్కారం ఉందా అని మీడియా ప్రశ్నించగా.. ఇప్పటికే తాము నిర్ణయం తీసుకుని ఉన్నామని, విలీనానికి అవకాశమే లేదని పన్నీరు సెల్వం కుండబద్దలు కొట్టారు.