
సాక్షి,న్యూఢిల్లీ: తీవ్ర కాలుష్య కోరల్లో చిక్కిన దేశ రాజధాని దీపావళి సందర్భంగా అక్కడక్కడా పేలే బాణాసంచాతో మరింత ప్రమాదంలో పడనుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దివాళీ నేపథ్యంలో వాయు కాలుష్యం పీక్స్‌కు చేరి ఢిల్లీ ఎమర్జెన్సీ జోన్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.ఢిల్లీలో బుధవారం ఎయిర్ క్వాలిటీ అత‍్యంత పేలవ స్థాయికి చేరగా, మంగళవారం అదే స్థాయిలో ఉండటంతో ఢిల్లీ అంతటా డీజిల్ జనరేటర్లపై నిషేధం విధించారు. వాయుకాలుష్యానికి అడ్డుకట్టవేసేందుకు అంతకుముందు ఢిల్లీ,ఎన్‌సీఆర్‌లో టపాసుల అమ్మకాన్నీ సుప్రీం కోర్టు తాత్కాలికంగా నిషేధించిన విషయం తెలిసిందే. మరోవైపు డీజిల్ జనరేటర్ల వాడకంతో పాటు భద్రాపూర్ పవర్ ప్లాంట్‌ను మార్చి 15 వరకూ నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. నిషేధం నుంచి ఆస్పత్రులు, మెట్రో సర్వీసులను మినహాయించారు.
ఢిల్లీలో వాయు కాలుష్యం ఆందోళనకరంగా పెరగడం వల్ల పలు దుష్పరిణామాలు ఎదురవనున్నాయని శాస్త్రవేత్తలు, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ)కు చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత ప్రమాణాల ప్రకారం వాయుకాలుష్యాన్ని తెలిపే పీఎం 2.5 స్థాయి (పర్టిక్యులేట్ మ్యాటర్) 60ని మించకూడదు. అంతకుమించిన పీఎం 2.5 స్థాయి పెరిగితే ఆ గాలిని పీల్చినప్పుడు అది ఊపిరితిత్తులు, రక్త కణాల్లో చేరి శరీరాన్ని కబళించే పెను ప్రమాదం ఉంది. అయితే బుధవారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పీఎం 2.5 స్ధాయి అత్యంత గరిష్టస్థాయిలకు పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఆనంద్ విహార్‌లో ఇది 244.85గా ఉండగా, ఢిల్లీ టెక్నలాజికల్ వర్సిటీ వద్ద 218, షాదీపుర్ వద్ద 214, ఎన్‌ఎస్‌ఐటీ ద్వారకా 185, పంజాబి బాగ్ 163, మందిర్ మార్గ్ వద్ద 175గా నమోదైంది.ఢిల్లీలో వాయుకాలుష్యం ఇప్పటికే ప్రమాదకర స్థాయిలో ఉంటే బాణాసంచా పేల్చడంతో అది మరింత క్షీణించే అవకాశం ఉందని సీనియర్ సైంటిస్ట్, క్లీన్ ఎయిర్ క్యాంపెయిన్ ప్రాజెక్ట్ మేనేజర్ వివేక్ ఛటోపాథ్యాయ ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment