Diwali 2017
-
ఆ రాత్రి ఇండియా ఇలా...
సాక్షి,న్యూఢిల్లీ: దీపావళి రాత్రి వెలుగులు విరజిమ్మే సమయంలో దేశం ఎలా వెలిగిపోతుందో చూడాలని అనుకోవడం సహజం. అయితే కోట్లాది భారతీయుల కలలను సాకారం చేశారు ఆస్ర్టోనాట్ పోలో నెస్పొలి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఈఎస్ఏ ఆస్ట్రోనాట్ ఈ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు. స్పేస్ నుంచి కెమెరాలో బంధించిన సప్తవర్ణ రంజితమైన భారత్ దీపావళి శోభను ప్రతిబింబించే ఇమేజ్ను అక్టోబర్ 19న పోస్ట్ చేశారు. భారతీయుల వెలుగుల పండుగ దివాళీ ఇవాళే ప్రారంభం..అందరికీ దీపావళి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఐఎస్ఎస్ సిబ్బంది తమ స్సేస్ స్టేషన్ నుంచి భూభాగంలో చోటుచేసుకునే అద్భుత దృశ్యాలను చిత్రించి వీక్షకులకు అందిస్తుంటారు. దీపావళి రాత్రి తళుకులీనుతున్న భారత్‌ను తన ఇమేజ్‌తో కళ్లకు కట్టిన 60 ఏళ్ల పాలో నెస్పొలి ఇటాలియన్ ఆస్ర్టోనాట్. నెస్పోలి పోస్ట్ చేసిన దివాళీ రాత్రి ఇమేజ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కొన్నేళ్లుగా దివాళీ రాత్రి భారత్ దీపకాంతులతో వెలుగొందుతోందని, అంతరిక్షం నుంచి తీసిన చిత్రాలంటూ కొన్ని ఫోటోలు హల్చల్ చేసినా ఆ తర్వాత అవి నకిలీవని తేలిన క్రమంలో తాజా ఇమేజ్ మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తోంది. -
మార్కెట్లకు శుక్రవారం సెలవు
సాక్షి,ముంబై: దీపావళి పర్వదినం సందర్భంగా మార్కెట్లకు సెలవు. అయితే దీపావళి స్పెషల్ ముహూరత్ ట్రేడింగ్‌తో స్టాక్ మార్కెట్లలో 2074 ఏడాది ప్రారంభమైంది. ఈ మూరత్ ట్రేడింగ్‌లో ట్రేడర్లు లాభాల స్వీకరణకుదిగడంతో మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 194 పాయింట్లు క్షీణించి 32,390 వద్ద, నిఫ్టీ 64 పాయింట్లు నష్టపోయి 10,146 వద్ద స్థిరపడ్డాయి. దీపావళి లక్ష్మీపూజ అనంతరం షేర్లలో లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుగా స్టాక్ ఎక్స్ఛేంజీలు సాయంత్రం గంటపాటు మూరత్(ముహూరత్) ట్రేడింగ్ నిర్వహించడంఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. కాగా శుక్రవారం(20న) బలి ప్రతిపాద సందర్భంగా మార్కెట్లకు సెలవు. దీంతో లాంగ్ వీకెండ్ తరువాత సాధారణ ట్రేడింగ్ తిరిగి సోమవారం(23) ఉదయం 9.15కు యధావిధిగా మార్కట్లు ప్రారంభమవుతాయి. -
సాక్షి పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు
-
‘ఎమర్జెన్సీ జోన్లోకి ఢిల్లీ’
సాక్షి,న్యూఢిల్లీ: తీవ్ర కాలుష్య కోరల్లో చిక్కిన దేశ రాజధాని దీపావళి సందర్భంగా అక్కడక్కడా పేలే బాణాసంచాతో మరింత ప్రమాదంలో పడనుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దివాళీ నేపథ్యంలో వాయు కాలుష్యం పీక్స్‌కు చేరి ఢిల్లీ ఎమర్జెన్సీ జోన్లోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.ఢిల్లీలో బుధవారం ఎయిర్ క్వాలిటీ అత్యంత పేలవ స్థాయికి చేరగా, మంగళవారం అదే స్థాయిలో ఉండటంతో ఢిల్లీ అంతటా డీజిల్ జనరేటర్లపై నిషేధం విధించారు. వాయుకాలుష్యానికి అడ్డుకట్టవేసేందుకు అంతకుముందు ఢిల్లీ,ఎన్సీఆర్లో టపాసుల అమ్మకాన్నీ సుప్రీం కోర్టు తాత్కాలికంగా నిషేధించిన విషయం తెలిసిందే. మరోవైపు డీజిల్ జనరేటర్ల వాడకంతో పాటు భద్రాపూర్ పవర్ ప్లాంట్‌ను మార్చి 15 వరకూ నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. నిషేధం నుంచి ఆస్పత్రులు, మెట్రో సర్వీసులను మినహాయించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఆందోళనకరంగా పెరగడం వల్ల పలు దుష్పరిణామాలు ఎదురవనున్నాయని శాస్త్రవేత్తలు, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ)కు చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత ప్రమాణాల ప్రకారం వాయుకాలుష్యాన్ని తెలిపే పీఎం 2.5 స్థాయి (పర్టిక్యులేట్ మ్యాటర్) 60ని మించకూడదు. అంతకుమించిన పీఎం 2.5 స్థాయి పెరిగితే ఆ గాలిని పీల్చినప్పుడు అది ఊపిరితిత్తులు, రక్త కణాల్లో చేరి శరీరాన్ని కబళించే పెను ప్రమాదం ఉంది. అయితే బుధవారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పీఎం 2.5 స్ధాయి అత్యంత గరిష్టస్థాయిలకు పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఆనంద్ విహార్‌లో ఇది 244.85గా ఉండగా, ఢిల్లీ టెక్నలాజికల్ వర్సిటీ వద్ద 218, షాదీపుర్ వద్ద 214, ఎన్ఎస్ఐటీ ద్వారకా 185, పంజాబి బాగ్ 163, మందిర్ మార్గ్ వద్ద 175గా నమోదైంది.ఢిల్లీలో వాయుకాలుష్యం ఇప్పటికే ప్రమాదకర స్థాయిలో ఉంటే బాణాసంచా పేల్చడంతో అది మరింత క్షీణించే అవకాశం ఉందని సీనియర్ సైంటిస్ట్, క్లీన్ ఎయిర్ క్యాంపెయిన్ ప్రాజెక్ట్ మేనేజర్ వివేక్ ఛటోపాథ్యాయ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారత సంతతిపై ట్రంప్ ప్రశంసల జల్లు
న్యూయార్క్ : దీపావళి వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. వైట్ హౌస్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన కూతురు ఇవాంకతోపాటు పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వైట్ హౌస్ అధికారులు, భారత అమెరికన్లు కూడా పాల్గొన్న ఈ వేడుకల్లో సరదాగా ట్రంప్ టపాసులు కాలుస్తూ ఆనందంగా గడిపారు. అనంతరం అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా భారతీయ అమెరికన్లను పొగిడేస్తూ అమెరికాకు శాస్త్రసాంకేతిక, వ్యాపార, విద్యా రంగాల్లో వారి సేవలు చిరస్మరణీయం అని చెప్పారు. ముఖ్యంగా తమ సైన్యంలో పనిచేస్తున్న భారత సంతతి అమెరికన్ సైనికులు అద్భుత సేవలు అందిస్తారని, ఎలాంటి ప్రమాదం సంభవించిన ముందు వారే స్పందిస్తారని కొనియాడారు. హిందూ మతంపై విశ్వాసం కలిగి ఉండి, ప్రపంచంలో సువిశాల ప్రజాస్వామ్య దేశాన్ని నిర్మించిన భారత ప్రజలను గుర్తు చేసుకుంటూ ప్రత్యేకంగా నేడు ఈ దీపావళి వేడుకలు జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన జరుపుతున్న తొలి దీపావళి వేడుకలు ఇవే. -
సాక్షి పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు
'సాక్షి' పాఠకులకు, అభిమానులకు, యావత్ తెలుగు ప్రజానీకానికి దీపావళి శుభాకాంక్షలు. అమవాస్య రోజున చీకట్లను చీల్చే చిరుదివ్వెలవలె మీ కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని మీ అభిమాన 'సాక్షి' మనసారా కోరుకుంటోంది. -
టపాసులపై నిషేధం సమంజసమేనా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బాణాసంచా అమ్మకాలను నిషేధిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేయడాన్ని త్రిపుర గవర్నర్ తథాగత్ రాయ్ తప్పు పట్టడంలో అర్థం ఉంది. కానీ మున్ముందు హిందువుల అంత్యక్రియలపై కూడా నిషేధం విధిస్తారేమోనన్న ఆయన వ్యాఖ్యలు అర్థరహితం. ఏ కారణంగా తాము బాణాసంచా విక్రయాలను నిషేధించాల్సి వచ్చిందో సుప్రీం కోర్టు సరిగ్గా వివరించక పోవడం పట్ల ఎక్కువ మంది విశ్లేషకులు ఆ తీర్పును విమర్శిస్తున్నారు. వాతావరణ కాలుష్యం కారణంగా వీటి అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించిన సుప్రీం కోర్టు, నిషేధం విధించాల్సినంతగా వాటి నుంచి కాలుష్యం వెలువడుతుందా? అన్న విషయాన్ని వెల్లడించలేదు. తన తీర్పును ఢిల్లీకి మాత్రమే పరిమితం చేయడం, అదీ ఒక్క దీపావళి పండుగకు మాత్రమే పరిమితం చేయడంలో కూడా అర్థం కనిపించడం లేదు. దీపావళి అంటే నిజంగా దీపాల పండుగే. కాంతుల కోసమే టపాసులను కాల్చే సంస్కృతిని మనం అలవాటు చేసుకున్నాం. కానీ ఇప్పటి టపాసులు కాంతులకన్నా శబ్దాన్నే ఎక్కువ విడుదల చేస్తున్నాయి. ధడేల్ మనే ఆ శబ్దాలు కూడా ప్రజల కర్ణ భేరీలు పగిలే అంతా లేదా చెవుడు వచ్చే అంత ఉంటున్నాయి. టపాసులు కూడా మూడు రోజుల దీపావళి పండుగకే పరిమితం కావడం లేదు. గేణ్శ్ విసర్జన పండుగ నుంచే టాపాసులు పేలుతున్నాయి. ఏదో కారణంగా నూతన సంవత్సరం వేడుకల వరకు టపాసులు కాల్చడం కొనసాగుతోంది. 1970, 1980 దశకాల్లో బాణాసంచా కాల్చడం ఎక్కువగా ఉండేది. వాతావరణం కాలుష్యం పట్ల ప్రజల్లో అవగాహన పెరగడం, పాఠశాలల్లో కూడా విద్యార్థులకు వీటి కాలుష్యం గురించి చెప్పడం వల్ల ఇప్పుడు వీటిని కాల్చడం ఒక్క ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా తగ్గింది. గతంలో ఇదే కోర్టు చైనా నుంచి బాణాసంఛా దిగుమతిని నిషేధించింది. ఆ నిషేధం ఎంత ప్రభావం చూపించింది, ఎలాంటి ప్రభావం చూపించిందన్న అంశాన్ని కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకోలేదు. బాణాసంచా పుట్టినిల్లు చైనాలో కూడా వీటిని నిషేధించాలనే ప్రతిపాదనలు పదే పదే వస్తున్నా ఇప్పటికీ నిషేధం విధించలేకపోతున్నారు. ఢిల్లీ కన్నా బీజింగ్ లాంటి నగరాలు అత్యధిక కాలుష్య నగరాలనే విషయం తెల్సిందే. చైనాలో 1400 సంవత్సరాల క్రితం బాణాసంచాను తయారు చేయడం కనుగొన్నారు. ఆ తర్వాత రెండు, మూడు వందల సంవత్సరాలకు భారత్‌లో వీటి తయారీ మొదలైందన్నది నిపుణుల అంచనా. బాణాసంచా వల్ల కలుగుతున్న కాలుష్యం ఎంతో తెలుసుకునేందుకు ఓ నిపుణుల కమిటీని వేయాల్సిందిగా భారత సుప్రీం కోర్టు 2016, నవంబర్ 11వ తేదీన కేంద్ర కాలుష్య నియంత్రణా బోర్డును ఆదేశించింది. మూడు నెలల్లో నివేదికను అందజేయాల్సిందిగా గడువు కూడా నిర్దేశించింది. అది తన డ్యూటీ కాదంటూ సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయలేదు. ‘పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్’ను నివేదికు అడగాల్సిందిగా సూచించింది. కాలుష్యానికి సంబంధించి సమగ్ర నివేదిక లేకుండా సుప్రీం కోర్టు బాణాసంచా అమ్మకాలను ఢిల్లీ నగరంలో నిషేధించడం ఎంత మేరకు సమంజసం ? సుప్రీం కోర్టు ఉత్తర్వులను కూడా ఖాతరు చేయని కాలుష్యం నియంత్రణ బోర్డుపై కోర్టు ధిక్కారం లేదా ప్రభుత్వ విధుల పట్ల నిర్లక్ష్యం కింద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అమ్మకాల నిషేధం వల్ల ఇప్పటకే కోట్ల రూపాయల సరకును తెచ్చిపెట్టుకున్న వ్యాపారస్థులు ఏమి కావాలి? వారిలో దివాలా తీసేవారు ఉండరా? కాల్చడంపైన నిషేధం లేదు కనుక ఢిల్లీ ఇరుగు, పొరుగు ప్రాంతాల నుంచి ప్రజలు బాణాసంచాను కొనలేరా? వ్యాపారస్థులే స్మగ్లింగ్ చేయరా? అసలు ఢిల్లీ ఒక్కటే దేశంలో కాలుష్య నగరమా? ఉత్తరాది నగరాల్లో కాలుష్యం ఎక్కువగా లేదా? సుప్రీం కోర్టు పరిధి దేశం మొత్తానికా, ఢిల్లీ నగరానికే పరిమితమా!? -
దీపావళి బరిలోకి ఇళయదళపతి
ఇళయదళపతి విజయ్ మరోసారి దీపావళి బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నారన్నది తాజా వార్త. విజయ్ చిత్రం విడుదలవుతుందంటే ఆయన అభిమానుల్లో పెద్ద పండగ వాతావరణమే నెలకొంటుంది. అలాగే చిత్ర పరిశ్రమలోనూ ఆ సందడి ఉంటుంది. ఇక పెద్ద పండగ రోజునే విజయ్ చిత్రాలు తెరపైకి వస్తే అభిమానులకు రెండు పండగలు ఒకే వచ్చినంత సంతోషం కలుగుతుందని వేరే చెప్పాలా? అలాంటి రెట్టింపు ఆనందం వచ్చే ఏడాది విజయ్ అభిమానులకు కలగనుంది. విజయ్ తాజాగా నటిస్తున్న 60వ చిత్రం భైరవా. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. భరతన్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స పతాకంపై బి.వెంకటరామిరెడ్డి సమర్పణలో బి.భారతీరెడ్డి నిర్మిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ చిత్రంలో కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తున్నారు. సంతోష్‌నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్న భైరవా చిత్రాన్ని 2017 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇది వరకే వెల్లడించారు. కాగా ఇళయదళపతి తన 61వ చిత్రానికీ సైన్ చేసిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు విజయ్‌తో తెరి వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు అట్లీ ఆయన 61వ చిత్రానికీ దర్శకత్వం వహించనున్నారు. ఈ భారీ చిత్రాన్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించనుంది. దీని షూటింగ్ ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానుందన్నది తాజా సమాచారం. కాగా చిత్ర విడుదలను 2017 దీపావళి సందర్భంగా చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిసింది. కాగా ఇంతకు ముందు విజయ్ నటించిన కత్తి చిత్రం 2014 దీపావళికి విడుదలై ఘన విజయం సాధించిందన్నది గమనార్హం. -
2017 దీపావళికి రోబో సీక్వల్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 2.0. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, బ్రిటీష్ బ్యూటి ఎమీజాక్సన్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను 2017 దీపావళికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాను సమ్మర్లోనే రిలీజ్ చేయాలని భావించినా.. భారీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా ఆలస్యమవుతోంది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్ధాయి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.