
న్యూయార్క్ : దీపావళి వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. వైట్ హౌస్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన కూతురు ఇవాంకతోపాటు పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వైట్ హౌస్ అధికారులు, భారత అమెరికన్లు కూడా పాల్గొన్న ఈ వేడుకల్లో సరదాగా ట్రంప్ టపాసులు కాలుస్తూ ఆనందంగా గడిపారు. అనంతరం అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా భారతీయ అమెరికన్లను పొగిడేస్తూ అమెరికాకు శాస్త్రసాంకేతిక, వ్యాపార, విద్యా రంగాల్లో వారి సేవలు చిరస్మరణీయం అని చెప్పారు. ముఖ్యంగా తమ సైన్యంలో పనిచేస్తున్న భారత సంతతి అమెరికన్ సైనికులు అద్భుత సేవలు అందిస్తారని, ఎలాంటి ప్రమాదం సంభవించిన ముందు వారే స్పందిస్తారని కొనియాడారు. హిందూ మతంపై విశ్వాసం కలిగి ఉండి, ప్రపంచంలో సువిశాల ప్రజాస్వామ్య దేశాన్ని నిర్మించిన భారత ప్రజలను గుర్తు చేసుకుంటూ ప్రత్యేకంగా నేడు ఈ దీపావళి వేడుకలు జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన జరుపుతున్న తొలి దీపావళి వేడుకలు ఇవే.