దీపావళి బరిలోకి ఇళయదళపతి
దీపావళి బరిలోకి ఇళయదళపతి
Published Mon, Nov 21 2016 5:07 AM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM
ఇళయదళపతి విజయ్ మరోసారి దీపావళి బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నారన్నది తాజా వార్త. విజయ్ చిత్రం విడుదలవుతుందంటే ఆయన అభిమానుల్లో పెద్ద పండగ వాతావరణమే నెలకొంటుంది. అలాగే చిత్ర పరిశ్రమలోనూ ఆ సందడి ఉంటుంది. ఇక పెద్ద పండగ రోజునే విజయ్ చిత్రాలు తెరపైకి వస్తే అభిమానులకు రెండు పండగలు ఒకే వచ్చినంత సంతోషం కలుగుతుందని వేరే చెప్పాలా? అలాంటి రెట్టింపు ఆనందం వచ్చే ఏడాది విజయ్ అభిమానులకు కలగనుంది.
విజయ్ తాజాగా నటిస్తున్న 60వ చిత్రం భైరవా. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. భరతన్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్‌స పతాకంపై బి.వెంకటరామిరెడ్డి సమర్పణలో బి.భారతీరెడ్డి నిర్మిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ చిత్రంలో కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తున్నారు. సంతోష్‌నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్న భైరవా చిత్రాన్ని 2017 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇది వరకే వెల్లడించారు. కాగా ఇళయదళపతి తన 61వ చిత్రానికీ సైన్ చేసిన విషయం తెలిసిందే.
ఇంతకు ముందు విజయ్‌తో తెరి వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు అట్లీ ఆయన 61వ చిత్రానికీ దర్శకత్వం వహించనున్నారు. ఈ భారీ చిత్రాన్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించనుంది. దీని షూటింగ్ ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానుందన్నది తాజా సమాచారం. కాగా చిత్ర విడుదలను 2017 దీపావళి సందర్భంగా చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిసింది. కాగా ఇంతకు ముందు విజయ్ నటించిన కత్తి చిత్రం 2014 దీపావళికి విడుదలై ఘన విజయం సాధించిందన్నది గమనార్హం.
Advertisement
Advertisement