
సాక్షి,న్యూఢిల్లీ: దీపావళి రాత్రి వెలుగులు విరజిమ్మే సమయంలో దేశం ఎలా వెలిగిపోతుందో చూడాలని అనుకోవడం సహజం. అయితే కోట్లాది భారతీయుల కలలను సాకారం చేశారు ఆస్ర్టోనాట్ పోలో నెస్‌పొలి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఈఎస్‌ఏ ఆస్ట్రోనాట్ ఈ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు. స్పేస్ నుంచి కెమెరాలో బంధించిన సప్తవర్ణ రంజితమైన భారత్ దీపావళి శోభను ప్రతిబింబించే ఇమేజ్‌ను అక్టోబర్ 19న పోస్ట్ చేశారు. భారతీయుల వెలుగుల పండుగ దివాళీ ఇవాళే ప్రారంభం..అందరికీ దీపావళి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.
ఐఎస్‌ఎస్ సిబ్బంది తమ స్సేస్ స్టేషన్ నుంచి భూభాగంలో చోటుచేసుకునే అద్భుత దృశ్యాలను చిత్రించి వీక్షకులకు అందిస్తుంటారు. దీపావళి రాత్రి తళుకులీనుతున్న భారత్‌ను తన ఇమేజ్‌తో కళ్లకు కట్టిన 60 ఏళ్ల పాలో నెస్‌పొలి ఇటాలియన్ ఆస్ర్టోనాట్. నెస్‌పోలి పోస్ట్ చేసిన దివాళీ రాత్రి ఇమేజ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కొన్నేళ్లుగా దివాళీ రాత్రి భారత్ దీపకాంతులతో వెలుగొందుతోందని, అంతరిక్షం నుంచి తీసిన చిత్రాలంటూ కొన్ని ఫోటోలు హల్‌చల్ చేసినా ఆ తర్వాత అవి నకిలీవని తేలిన క్రమంలో తాజా ఇమేజ్ మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తోంది.