
వెంకయ్యకు ఎయిర్ ఇండియా క్షమాపణ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడుకు ప్రభుత్వ విమానాయాన సంస్థ ఎయిర్ ఇండియా (ఏఐ) క్షమాపణ చెప్పింది. ఆయన ప్రయాణించాల్సిన విమానం ఆలస్యం కావడంపై దర్యాప్తుకు ఆదేశించినట్టు తెలిపింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చేందుకు మంగళవారం మధ్యాహ్నం ఆయన ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. అయితే పైలట్ ఆలస్యంగా రావడంతో ఆయన ఇంటికి తిరిగి వెళ్లిపోయారు.
ఎయిర్ ఇండియా నిర్వాకంతో ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయానని ట్విటర్ ద్వారా వెంకయ్య వెల్లడించారు. దీనిపై స్పందించిన ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం కావడంపై విచారం వ్యక్తం చేసింది. పైలట్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడంతో సమయానికి ఎయిర్ పోర్టుకు రాలేకపోయాడని ఏఐ అధికార ప్రతినిధి తెలిపారు.
'గుర్గావ్, సెక్టార్ 21లో నివసిస్తున్న పైలట్ ను తీసుకురావడానికి ఎయిర్ పోర్ట్ నుంచి ఉదయం 9.45 గంటలకు కారు పంపించాం. ట్రాఫిక్ చిక్కుపోవడంతో మరో కారు చూసుకోవాలని పైలట్ కు కారు డ్రైవర్ ఫోన్ చేశాడు. పైలట్ మరో వాహనంలో ఎయిర్ పోర్ట్ కు బయలు దేరాడు. అయితే అతడు కూడా ఢిల్లీ-గుర్గావ్ మార్గంలో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడు. ట్రాఫిక్ జామ్ కారణంగానే పైలట్ ఆలస్యంగా ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడ'ని ఏఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.