ఇక మద్యంపైనా రేషన్! | Air India limits liquor supply to international passengers in airport lounges | Sakshi
Sakshi News home page

ఇక మద్యంపైనా రేషన్!

Published Mon, Dec 5 2016 8:51 AM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM

ఇక మద్యంపైనా రేషన్!

ఇక మద్యంపైనా రేషన్!

దేశంలోని అన్ని విమానాశ్రయాలలో అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారికి లాంజిలలో ఇచ్చే మద్యం మీద ఇక రేషన్ పెట్టాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. దూర ప్రయాణాలు చేసేవాళ్లలో కొంతమంది ప్రయాణికులు తోటివారి పట్ల, సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో డిపార్చర్ టెర్మినల్స్‌ వద్ద వారికి ఇచ్చే మద్యం కోటాను తగ్గించాలని ఇటీవలి కాలంలో పలు భారతీయ విమానయాన సంస్థలు పౌర విమానయాన అధికారులను కోరాయి. దాంతో ఎయిర్ ఇండియా కూడా ఇదే బాటలో.. మద్యం కోటాను తగ్గించాలని నిర్ణయించింది. 
 
ఢిల్లీ విమానాశ్రయం నుంచి విదేశాలకు బిజినెస్, ఫస్ట్ క్లాస్‌లలో ప్రయాణాలు చేసేవారికి లాంజిలలో వోడ్కా, విస్కీ, రమ్ లాంటి డ్రింకులైతే గరిష్ఠంగా మూడు పెగ్గులు మాత్రమే ఇస్తామని, అదే వైన్ అయితే రెండు గ్లాసులు, బీర్ అయితే మూడు బాటిల్స్ మాత్రమే ఇస్తామని ఎయిరిండియా తెలిపింది. వీటిలో ఏదో ఒకదాన్ని మాత్రమే ప్రయాణికులు ఎంచుకోవాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లడానికి కనెక్టింగ్ స్వదేశీ విమానాల్లో ప్రయాణించేవారికి మాత్రం మద్యాన్ని ఇవ్వబోమని స్పష్టం చేసింది. అంటే ముంబై నుంచి ఢిల్లీ వచ్చి, అక్కడి నుంచి లండన్ వెళ్లే ప్రయాణికులకు ముంబైలో మద్యం ఇవ్వరన్నమాట. 
 
ఈ ఉత్తర్వులను ఎయిరిండియా ఇచ్చింది తప్ప విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలు చూస్తన్న జీఎంఆర్ సంస్థ కాదని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. శంషాబాద్‌ విమానాశ్రయంలో కూడా ఎయిరిండియా ఇలాంటి ఉత్తర్వులను విడుదల చేసింది. తాము కూడా ఇలాంటి నియంత్రణలను అమలుచేస్తున్నట్లు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. ఇక ముంబైలో అయితే, విస్కీ, వోడ్కా, రమ్, జిన్ లాంటి డ్రింకులు మూడు పెగ్గులలో కూడా 45 మిల్లీలీటర్లకు బదులు 30 మిల్లీలీటర్లు మాత్రమే ఇస్తున్నారు. బీరు మాత్రం మూడు సీసాలు ఇస్తారు. విదేశాల్లోని విమానాశ్రయాల్లో కూడా ఇలాంటి బోర్డులు కనిపిస్తాయని ఎయిరిండియా అధికారి ఒకరు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement