ఇప్పుడైనా వారికి బుద్ధి చెప్పండి: మోదీ
లక్నో: తన మనుగడ కోసమే ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. యూపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. త్వరలో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఆదివారం అలీగఢ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ్‌వాదిపార్టీ, కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు దోచుకునే ప్రభుత్వాన్ని, శాంతిభద్రతలు గాలికొదిలేసిన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, ఇప్పుడు మాత్రం ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు.
వివిధ కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన ఎస్పీ, కాంగ్రెస్ పార్టీకి యూపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. యూపీ ప్రజలకు న్యాయం ఇప్పించేందుకు తాను వచ్చినట్లు మోదీ తెలిపారు. సొంతమేలు, తనకులపోల్లే అనే సొంత అభిమానం గురించి తప్ప ఏనాడు తమ ప్రభుత్వ హయాంలో ఎంత అవినీతి జరుగుతుందనే విషయాన్ని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
అభివృద్ధిని గాలికొదిలేశారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వానికి పట్టంగడితే ఉత్తరప్రదేశ్‌లో వికాసాన్ని తీసుకొస్తామన్నారు. అందరికీ విద్యుత్, శాంతిభద్రతలు పునర్నిర్మాణం, రోడ్ల ఏర్పాట్లువంటివి చేస్తామని తెలిపారు. ఉద్యోగాలకోసం వెళ్లే యువతను రాజకీయ నేతలైన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటర్వ్యూలు చేస్తున్నారని, వారిని లంచాలు తీసుకురావాలని కోరుతున్నారని ఇలాంటివాటికి బీజేపీని ఎన్నుకోవడం ద్వారా అడ్డుకట్ట వేయాలని చెప్పారు.