సీఎం సన్నిహితుడిపై ఆరేళ్ల వేటు
Published Sat, Oct 22 2016 3:51 PM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM
ఉత్తరప్రదేశ్‌లో మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయనగా.. అధికార పార్టీలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఒకవైపు అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం మీద ప్రశంసలు కురిపిస్తూనే.. మరోవైపు అఖిలేష్ సన్నిహిత సహచరుడిపై పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరేళ్ల పాటు బహిష్కరణ వేటు వేశారు. రాష్ట్రంలో పట్టాలుతప్పిన ఆర్థిక వ్యవస్థను అఖిలేష్ ప్రభుత్వం గాడిలో పెట్టిందని, దాంతోపాటు అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కారని ఆయన అన్నారు. తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం పెద్ద విజయమని ఆయన చెప్పారు. అయితే.. ఇలా అంటూనే మరోవైపు అఖిలేష్ యాదవ్‌కు సన్నిహిత సహచరుడైన ఎమ్మెల్సీ యుద్ధవీర్‌సింగ్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధన అఖిలేష్ యాదవ్ మీద చేతబడి చేయిస్తోందంటూ లేఖరాసి సంచలనం సృష్టించింది కూడా ఈ యుద్ధవీర్ సింగే.
యూపీలో శాంతిభద్రతలు సరిగా లేవని గొడవ పెట్టేవాళ్లు ఒక్కసారి జాతీయ నేర రికార్డుల బ్యూరో లెక్కలు చూడాలని.. దేశంలోని 26 రాష్ట్రాల కంటే యూపీ మెరుగ్గా ఉందని ములాయం చెప్పారు. వీటన్నింటి గురించి ఆయన మాట్లాడారు గానీ, మూడో తేదీ నుంచి ముఖ్యమంత్రి ప్రారంభిస్తానన్న రథయాత్ర గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేదు.
ఇక కుటుంబంలో చెలరేగిన వివాదం నేపథ్యంలో.. అఖిలేష్ యాదవ్ సన్నిహిత సహచరుడైన యుద్ధవీర్‌సింగ్‌పై ఆరేళ్ల పాటు బహిష్కరణ వేటు పడింది. అఖిలేష్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేయాలంటూ యుద్ధవీర్‌సింగ్ ములాయంకు లేఖ రాశారు. దానికి ముందు.. నేతాజీ (ములాయం)కు వ్యతిరేకంగా మాట్లాడేవారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ సీనియర్ నాయకుడు బేణీ ప్రసాద్ వర్మ అన్నారు. మరోవైపు.. ముఖ్యమంత్రి ఏదైనా సమావేశానికి పిలిస్తే తాను వెళ్తానని ములాయం సోదరుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ చెప్పారు. ముఖ్యమంత్రి రథయాత్రలో కూడా తాను పాల్గొంటానని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement