ఐన్‌స్టీన్ డిగ్రీలు కేజ్రీవాల్‌కు ఓకేనా?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిగ్రీల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన, చేస్తున్న గొడవ అంతా ఇంతా కాదు. అసలు మోదీకి డిగ్రీలే లేవని ఒకసారి, అన్నీ నకిలీలు చూపిస్తున్నారని ఇంకోసారి, పేర్లు తేడా ఉన్నాయని మరోసారి ఇలా పదే పదే మోదీ డిగ్రీల గురించి ఆయన రచ్చ చేస్తూనే ఉన్నారు. దాంతో ఇప్పుడు కేజ్రీవాల్ - డిగ్రీలు అనే అంశం మీద సోషల్ మీడియాలో జోకులు, కార్టూన్లు రకరకాలుగా చక్కర్లు కొడుతున్నాయి.
అందులో తాజాగా ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా అరవింద్ కేజ్రీవాల్ దగ్గరకు వచ్చి, తన డిగ్రీలను ఆయనకు చూపించి, అవన్నీ నిజమైనవేనని సర్టిఫై చేయించుకున్నట్లుగా ఉన్న ఒక కార్టూన్ సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతోంది. ట్విట్టర్‌లో ఒక వ్యక్తి ఈ ఫొటోను ట్వీట్ చేయగా.. దాన్ని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యం స్వామి కూడా రీట్వీట్ చేశారు. దానికితోడు వాట్సాప్‌లోని పలు గ్రూపుల్లో కూడా ఈ ఫొటో సర్క్యులేట్ అవుతోంది.