
ఓలా, ఉబర్ క్యాబ్‌లు ఎక్కేముందు జాగ్రత్త!
సాక్షి, న్యూఢిల్లీ: వేగవంతం అయిన నగర జీవితంలో క్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాక నగర జీవికి కాస్త ఊరట కలిగిన విషయం తెల్సిందే. క్యాబుల్లో ఒంటరిగా ప్రయాణించే ఆర్థిక స్థోమత లేనివారి కోసం ఓలా షేర్, ఉబర్ పూల్ పేరిట రైడ్ షేరింగ్‌లు వచ్చి మరింత ఊరటనిచ్చాయి. ఈ రైడ్ షేరింగ్‌లకు ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మినహా దేశంలో మరే రాష్ట్రంలో చట్టపరంగా అనుమతి లేదన్న విషయం ఎందరికి తెలుసో తెలియదుగానీ, ఇక ముందు తెలుసుకొని షేర్ రైడింగ్ క్యాబ్‌లు ఎక్కడం ఎందుకైనా మంచిది.
మోటార్ వాహనాల చట్టంలోని 66వ సెక్షన్ కింద ప్రయాణికులను ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు క్యాబ్‌లకు లైసెన్స్‌లు మంజూరు చేస్తారు. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం కారు సామర్థ్యాన్నిబట్టి ప్రయాణికుడు లేదా ప్రయాణికులను ఓ చోట పికప్ చేసుకొని మరోచోట డ్రాప్ చేయాలి. మధ్య మధ్యలో ఆపడానికి వీల్లేదు. మరొకరిని ఎక్కించుకోవడానికి వీల్లేదు. అలా చేయాలంటే సెట్విన్ బస్సుల్లాగా స్టేజ్ క్యారేజ్ లైసెన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు అదనపు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. స్టేజ్ క్యారేజ్ పర్మిషన్లు జిల్లా ట్రాన్స్‌పోర్ట్ యంత్రాంగం పరిధిలోకి వస్తాయి.
ఈ కారణంగానే కర్ణాటక రాష్ట్రం ఓలా షేర్, ఉబర్ పూల్ రైడ్స్‌ను ఇటీవల నిషేధించింది. కర్ణాటకతోపాటు తమిళనాడు రాష్ట్రంలోని 1989నాటి మోటార్ వాహనాల చట్టం వీటిని అనుమతించడం లేదు. అందుకనే తమిళనాడులో చాలా ప్రాచుర్యం పొందిన ‘జిప్‌గో’ షేర్ సర్వీసులు 2015లోనే మూతపడ్డాయి. ఒడిశాలో కూడా ఓలా షేర్, ఉబర్ పూల్ సర్వీసులను రద్దుచేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెల్సిందే. ఇంతవరకు ఓలా షేర్, ఉబర్ పూల్ రైడ్స్‌కు వ్యతిరేకంగా తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, లిఖితపూర్వక ఫిర్యాదులు అందినప్పుడు తప్పకుండా ఈ అంశాన్ని పరిశీలిస్తామని కేరళ రవాణా శాఖా అధికారులు తెలియజేస్తున్నారు.
2012లో రియోలో వాతావరణ కాలుష్యంపై ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సదస్సులో ‘కార్‌పూలింగ్’ విధానాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. అంటే కారు కలిగిన ప్రైవేటు వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కో కారును తీయకుండా రోజుకొకరి కారులోనే నలుగురు కలిసి వెల్లడం మంచిదని తీర్మానించింది. ఈ తీర్మానానికి ఓటేసిన భారత్ కూడా మోటార్ వాహనాల చట్టంలోని 66వ సెక్షన్ నిబంధనలను మార్చేందుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానం గురించి తెలుసో, లేదోగానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓలా షేర్, ఉబర్ పూల్ లాంటి సర్వీసులను అనుమతిస్తూ ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది.
చట్టాలు వర్తించనప్పుడు ఇలాంటి కార్లలో రోడ్డు ప్రమాదాలకు గురయితే ప్రయాణికులకు ఎలాంటి నష్టపరిహారం వర్తించదు. అనుమతి ఉన్న ఇతర ఓలా, ఉబర్ క్యాబ్ సర్వీసుల్లో ప్రయాణించడం కూడా ఒక విధంగా రిస్కే. ఎందుకంటే, ప్రమాదాలకు తాము ఏమాత్రం బాధ్యత వహించమంటూ కంపెనీల యజమాన్యాలు డ్రైవర్లతో ఒప్పందం చేసుకుంటున్నాయి.