ఇన్‌సెట్లో ఆళ్వార్ ఘటనలో మృతి చెందిన రక్బార్‌ఖాన్
ఆల్వార్/రాజస్థాన్: ఆళ్వార్ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న మూకహత్యపై దేశవ్యాప్తంగా విమర్శలు, ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతుండగా.. గోరక్షకుల దాడిలో చనిపోయిన రక్బార్‌ఖాన్ పోస్టుమార్టం రిపోర్టు విడుదలైంది. మూకదాడిలో చనిపోయిన వ్యక్తి మృతికి పోలీసులు కారణం కాదని ఈ నివేదిక వెల్లడించింది. పోస్టుమార్టం జరిగే సమయానికి 12 గంటల క్రితం తగిలిన గాయాల వల్లే బాధితుడు కన్నుమూసినట్టు నివేదిక చెప్తోంది. అంటే రక్బార్‌ఖాన్‌పై శనివారం అర్ధరాత్రి దాడి జరిగినట్టు లెక్క.
కానీ, అది అవాస్తవమనీ రక్బార్‌ఖాన్‌ను పోలీసులు చితకొట్టడం వల్లే చనిపోయారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. మొత్తం మీద దాడి జరిగిన తర్వాతే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నట్టు, మృతదేహంపై ఉన్న గాయాలకూ పోలీసులకు సంబంధం లేనట్టు నివేదిక పేర్కొంది.
వివరాలు.. రక్బార్‌ఖాన్, అతని మిత్రుడు అస్లాంలు రెండు ఆవులను కొనుగోలు చేసి తమ స్వగ్రామానికి తీసుకెళ్తుండగా కాపుకాసిన కొందరు దుండగులు ఆళ్వార్ పట్టణ సమీపంలో వారిపై మూకదాడిచేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రక్బార్‌ఖాన్‌ను ఆస్పత్రికి తరలించడంలో పోలీసులు తీవ్ర జాప్యం చేయడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. క్షతగాత్రున్ని అయిదు కిలోమీటర్ల దూరంలో గల ఆస్పత్రికి చేర్చడానికి వారికి నాలుగు గంటల సమయం పట్టింది.
ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా తీరిగ్గా టీ, కాఫీలు తాగి ఆస్పత్రికి చేరుకోవడంతో రక్బార్‌ఖాన్ అప్పటికే మృతి చెందాడనీ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ హోంమంత్రి గులాబ్‌చంద్ కటారియా విచారణ నిమిత్తం నలుగురు సభ్యులతో కమిటీ వేశారు. అయితే, పోస్టుమార్టం రిపోర్టు మాత్రం పోలీసులకు అనుకూలంగా రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. మొత్తానికి పోలీసులు నాలుగు గంటల పాటు టీ, కాఫీలే తాగారా..! లేదా అమాయకున్ని చూసి ఆడుకున్నారా అనే విషయం మరుగున పడినట్టయింది.
Comments
Please login to add a commentAdd a comment