
జమ్మూ నుంచి బయల్దేరిన బస్సులో శివనామస్మరణ చేస్తున్న అమర్‌నాథ్ యాత్రికులు
జమ్మూ/శ్రీనగర్: దక్షిణ కశ్మీర్లోని హిమా లయాల్లో ఉన్న ప్రఖ్యాత అమర్‌నాథ్ ఆలయంలో మంచు శివలింగాన్ని దర్శించుకునే యాత్రికుల ‘అమర్‌నాథ్ యాత్ర’ బుధవారం మొదలైంది. రెండు నెలలపాటు సాగే ఈ యాత్రకు కశ్మీర్ ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. దాదాపు 40వేల మందిని బందోబస్తులో వాడుతోంది. బుధవారం 3,000 మంది యాత్రికులతో తొలిæ విడత యాత్రను గవర్నర్ వోహ్రా సలహాదారులు విజయ్ కుమార్, బీబీ వ్యాస్‌లు జెండా ఊపి ప్రారంభించారు. జమ్మూలోని భగవతి బేస్ క్యాంప్ నుంచి వేకువజామున 4.30 గంటల సమయంలో బయలుదేరిన ఈ బ్యాచ్‌లో యాత్రికులతో కూడిన 107 వాహనాలు, 4 బైక్‌లు ఉన్నాయి.
బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, బంకర్లు..
కశ్మీర్ పోలీసులతోపాటు పారామిలటరీ, ఎన్‌డీఆర్‌ఎఫ్(జాతీయ విపత్తు స్పందన దళం), సైన్యంతో కలిపి మొత్తం 40వేల మందిని యాత్రికుల భద్రత కోసం వినియోగిస్తున్నారు. అమర్‌నాథ్ యాత్రికుల వాహనాలకు తొలిసారిగా రేడియో ఫ్రీక్వెన్సీ(ఆర్‌ఎఫ్) ట్యాగ్‌లను, సీఆర్‌పీఎఫ్ దళాలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను, వారి హెల్మెట్లకు కెమెరాలను అమర్చారు. ప్రమాదాలకు గురైన యాత్రికులకు అత్యవసర పరిస్థితుల్లో చికిత్స చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్‌లు, మొబైల్ బుల్లెట్ ప్రూఫ్ బంకర్లను అందుబాటులోకి తెచ్చారు.
గత ఏడాది ఉగ్రవాదులు జరిపిన దాడిలో 8మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో వాహనాలకు ఆర్‌ఎఫ్ ట్యాగ్‌లను అమర్చామని, వీటి సాయంతో బెమినాలోని సెంట్రల్ కంట్రోల్ సెంటర్ నుంచి వాహనాల కదలికలు చూస్తామని 73వ బెటాలియన్ కమాండెంట్ పీపీ పౌలీ తెలిపారు. యాత్రికులు వెళ్లే మార్గంలో సీఆర్‌పీఎఫ్ బలగాలు పేలుడు పదార్థాలను పసిగట్టి ‘రోడ్ క్లియరింగ్’ ఏర్పాట్లను చూస్తాయని భద్రతా అధికారి ఒకరు తెలిపారు.
కశ్మీర్ లోయలో అల్లకల్లోల పరిస్థితులు, ఉగ్రవాదులు దాడులు చేసే ప్రమాదం ఉన్నందున యాత్రికులకు పూర్తిస్థాయి భద్రత కల్పించేందుకు అనేక చర్యలు తీసుకుంటామన్నారు.ఉగ్రదాడుల్ని తిప్పికొట్టేందుకు 100 మందితో కూడిన అదనపు బలగాలను కూడా మోహరించారు. అనారోగ్యానికి గురైన యాత్రికులు, భద్రతా సిబ్బందిని వెంటనే చికిత్సకు తరలించేందుకు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వచ్చే యాత్రికుల కోసం కూడా ఏర్పాట్లు చేపట్టామన్నారు.
రెండు లక్షల మంది యాత్రికుల నమోదు
హెలికాప్టర్‌లో వచ్చే యాత్రికులను మినహాయించి రెండు కాలినడక మార్గాల మీదుగా రోజుకు 7,500 మందిని అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 2 లక్షల మంది భక్తులు తరలివచ్చే ఈ యాత్రను విజయవంతం చేయటానికి కశ్మీర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకుంది. ప్రజల సహకారం, సైనిక, పోలీసు, పౌర అధికారుల సమన్వయంతో యాత్రికులకు వసతి, భద్రత కల్పించనున్నారు. యాత్రికుల్లో 1,904 మంది 36 కిలోమీటర్ల పొడవైన పహల్గామ్ మార్గాన్ని, 1,091 మంది 12 కిలోమీటర్ల బల్తాల్ మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ యాత్ర ఆగస్టు 26వ తేదీన ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment