హీరో.. డ్రైవర్ సలీం
53 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్
శ్రీనగర్/సూరత్: జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా ఖానాబల్ ప్రాంతం... సోమవారం రాత్రి 8.20 గంటలు.. అమర్‌నాథ్ యాత్ర నుంచి తిరిగొస్తున్న వాహన శ్రేణి అప్పటికే ఆ ప్రాంతాన్ని దాటేసింది. టైరు పంక్చర్ కావడంతో ఓం ట్రావెల్స్ బస్సు ఆలస్యంగా అక్కడకు చేరింది. ఇంతలో బస్సుపై ఉగ్రవాదుల బుల్లెట్ల వర్షం... మరోవైపు కటిక చీకటిలో మంచు కొండలపై ప్రయాణం. బస్సును చుట్టుముట్టిన ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు మొదలుపెట్టారు. బస్సు డ్రైవర్ సలీం ఎంతో సాహసం చేసి అనేక మంది ప్రాణాల్ని కాపాడాడు. బస్సును ఆపితే ఎంతటి ఘోరం జరుగుతుందో ఊహించిన సలీం తన వైపు దూసుకొస్తున్న బుల్లెట్ల నుంచి తప్పించుకుంటూనే స్టీరింగ్‌ను వదలకుండా.. బస్సును సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. అప్పటికే ఏడుగురు ప్రాణాలు కోల్పోయినా మరో 53 మందికి ప్రాణదాతగా నిలిచాడు.
దక్షిణ గుజరాత్‌లోని వల్సాద్ పట్టణా నికి చెందిన ఓం ట్రావెల్స్ బస్సు గుజరాత్, మహారాష్ట్రకు చెందిన 60 మందిని ఎక్కించుకుని అమర్‌నాథ్ యాత్రకు బయల్దేరింది. మంచు శివలింగాన్ని దర్శించుకుని ఖానాబల్‌కు చేరగానే తూటాల వర్షం మొదలైంది. ‘ప్రయాణికులంతా హాహాకారాలు చేస్తూ.. సీట్ల కింద తలదాచుకున్నారు. ఇంతలో బస్సు ముందు నుంచి కాల్పులు మొదలయ్యాయి. తలను కిందకు వంచి స్టీరింగ్ తిప్పుతూ బస్సును ముందుకు నడిపించాను. నా పక్కన కూర్చున్న బస్సు యజమాని హర్ష దేశాయ్ శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ బస్సు ఆపకుండా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాను. యాత్రికుల ప్రాణాల్ని కాపాడేందుకు దేవుడే నాకు ధైర్యమిచ్చాడ’ని సూరత్ ఎయిర్‌పోర్ట్‌లో సలీం వెల్లడించారు.
దేశాయ్ శరీరంలో తూటాలు దిగినా ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఎయిర్‌పోర్ట్‌లో దేశాయ్ మాట్లాడుతూ.. ‘మేం దారి లో ఉండగా బాణా సంచా పేలుస్తున్నట్లు తూటాల శబ్దం వినిపించింది. ఇంతలోనే అది ఉగ్రదాడని మాకు అర్థమైంది. పెద్ద ఎత్తున కాల్పుల మోత కొనసాగుతున్నా ముందుకు సాగడం వల్లే అనేక మంది ప్రాణాల్ని కాపాడగలిగామ’ని చెప్పారు. సలీం తమ ప్రాణ దాత అంటూ తోటి ప్రయాణికులు ప్రశంసల వర్షం కురిపించారు. సలీంకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం రూ. 3 లక్షలు, గవర్నర్ వోహ్రా రూ. 2 లక్షల పారితోషికం ప్రకటించారు. సలీంను జాతీయ సాహస అవార్డుకు సిఫార్సు చేస్తామని గుజరాత్ సీఎం రూపానీ తెలిపారు.
టైర్ పంక్చర్ కాకపోయుంటే..
యాత్రికుల బస్సు టైర్ పంక్చర్ కావడంతో దారి మధ్యలో ఆగిపోవాల్సి వచ్చిందని, పంక్చర్ కాకపోయుంటే ఉగ్రదాడి తప్పేదని అధికారులు తెలిపారు. ‘బస్సు సోమవారం సాయంత్రం 5 గంటలకు శ్రీనగర్ నుంచి వంద కి.మీ. దూరంలోని జమ్మూకు బయల్దేరింది. హైవేపై రాత్రి 7 గంటలకు భద్రత ఉపసంహరించేలోపే జమ్మూ చేరుకోవాలి. అయితే దారి మధ్యలో సంగం వద్ద టైర్ పంక్చరైంది. డ్రైవర్ బస్సును ఆపి టైర్ మార్చాడు. ప్రయాణం గంట ఆలస్యమైంది’ అని భద్రతా అధికారులు వివరించారు.
సంబంధిత కథనం
బుల్లెట్ల వర్షం కురుస్తున్నా.. డ్రైవర్ సాహసం