ఈ సినిమా నిడివి 30 రోజులు..! | Ambiance Movie is worlds longest film! 30 days - 720 Hour | Sakshi
Sakshi News home page

ఈ సినిమా నిడివి 30 రోజులు..!

Published Thu, Jul 20 2017 10:19 PM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

ఈ సినిమా నిడివి 30 రోజులు..! - Sakshi

ఈ సినిమా నిడివి 30 రోజులు..!

ఒక సినిమా నిడివి ఎంతుంటుంది. రెండు నుంచి రెండున్నర గంటలు. అరుదుగా కొన్ని సినిమాలు మూడు గంటలు, అంతకుమించినవి కూడా ఉన్నాయి. కానీ, ఇంత ఎక్కువ నిడివిగల సినిమాలు ఇటీవలి కాలంలో రావట్లేదు. ఎందుకంటే ప్రేక్షకులకు అంతసేపు కూర్చుని సినిమా చూసే ఓపిక ఉండట్లేదు. రెండున్నర గంటల నిడివి గల సినిమా చూడడమే భారంగా ఫీలవుతున్న ఈ రోజుల్లో 720 గంటలు (30 రోజులు) నిడివి గల సినిమాను చూడగలరా..? ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తారో లేదో తెలీదుకానీ, ఇంత నిడివి గల సినిమాను తీసేందుకు సిద్ధమయ్యాడో దర్శకుడు. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటీ.. దాని విశేషాలేంటో తెలుసుకుందామా..  

స్వీడిష్‌ డైరెక్టర్‌ ఆలోచన..
స్వీడన్‌కు చెందిన దర్శకుడు ఆండర్స్‌ వెబెర్గ్‌. విజువల్‌ ఎఫెక్టŠస్‌తోపాటు ఇతర సినీ విభాగాలపైనా అతడికి పట్టుంది. అతడు 2020లో సినీ రంగం నుంచి రిటైర్‌ అవ్వాలనుకుంటున్నాడు. ఈలోగా ఏదో ఒక రకంగా తన ప్రత్యేకత చాటుకోవాలనుకున్నాడు. దీనిలో భాగంగా ప్రపంచంలో అత్యంత నిడివిగల సినిమాను రూపొందించాలనుకున్నాడు. అలా 30 రోజుల నిడివిగల సినిమాకు శ్రీకారం చుట్టాడు.

యాంబియెన్స్‌..
30 రోజుల నిడివితో రూపొందుతున్న ఈ సినిమా పేరు యాంబియెన్స్‌. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తైంది. మూడునాలుగేళ్ల క్రితం నుంచే ఈ సినిమాను సొంత నిర్మాణంలో ఆండర్స్‌ తెరకెక్కిస్తున్నాడు. దీనిలో దాదాపు వంద మంది నటీనటులు నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ప్రత్యేకంగా కథ, సంభాషణలు అంటూ ఏమీ లేవు. అసలు సినిమాలో డైలాగులే ఉండవు. కేవలం దృశ్యాల్ని మాత్రమే చిత్రీకరించి, వాటికి ఎక్కువగా విజువల్‌ ఎఫెక్టŠస్‌ జోడించి సినిమాను రూపొందిస్తున్నాడు. నిరంతరం యాంబియెన్స్‌కి సంబంధించిన పని కొనసాగుతోంది.

ట్రైలర్‌ నిడివి 72 గంటలు..
ప్రతి సినిమాకూ ట్రైలర్‌ ఉన్నట్లే దీనికీ ట్రైలర్లను విడుదల చేశారు. 2014లో ఏడు నిమిషాల నిడివితో తొలి ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఇక రెండో ట్రైలర్‌ను గతేడాది విడుదల చేశారు. దీని నిడివి ఏడు గంటలు. 720 గంటల సినిమా కాబట్టి, దర్శకుడు ఏడు గంటల ట్రైలర్‌ను రూపొందించాడు. వచ్చే ఏడాది చివరి ట్రైలర్‌ విడుదల కానుంది. దీని నిడివి 72 గంటలు ఉండనున్నట్లు ఆండర్స్‌ తెలిపాడు. పూర్తి సినిమా 2020లో వచ్చే అవకాశం ఉంది.

ఒక్కసారే ప్రదర్శన..
చిత్రీకరణ పూర్తయ్యాక సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ఆండర్స్‌ భావిస్తున్నాడు. అన్ని దేశాల్లోనూ ఒకే సమయంలో ప్రదర్శించాలనుకుంటున్నాడు. 30 రోజులపాటు నిరంతరంగా ఈ సినిమా పద్రర్శిస్తారు. ఒక్కసారి ప్రదర్శన పూర్తయ్యాక మళ్లీ ఈ సినిమాను చూసే అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రదర్శన పూర్తైన తర్వాత ఈ సినిమాను ఎవరికీ చిక్కకుండా నాశనం చేయాలని ఆండర్స్‌ ఆలోచన. ఇక ఆ తర్వాత ఈ సినిమాను మళ్లీ ఎవరూ చూసే అవకాశం లేదు.– సాక్షి, స్కూల్‌ ఎడిషన్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement