బిగ్‌బీకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు | Amitabh Batcha Selected For DadaSaheb Phalke Award | Sakshi
Sakshi News home page

అమితాబ్‌ బచ్చన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

Published Tue, Sep 24 2019 7:34 PM | Last Updated on Wed, Sep 25 2019 12:37 AM

Amitabh Batcha Selected For DadaSaheb Phalke Award - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. అమితాబ్‌ను పురస్కార కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి  ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి (2019) గాను అవార్డు అమితాబ్‌ బచ్చన్‌ను వరించింది.  ఈ సందర్భంగా ఆయనకు దేశ వ్యాప్తంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

వన్ మాన్ ఇండస్ట్రీ.. బిగ్‌బీ
1942 అక్టోబరు 11న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌లో జన్మించిన అమితాబ్ హరివంశ్ బచ్చన్ భారతీయ సినిమాలో అత్యంత ప్రభావవంతమైన నటుడిగా ప్రఖ్యాతి గాంచారు. 1970లలో విడుదలయిన జంజీర్, దీవార్ సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్‌ని ఏర్పరుచుకున్నారు. తన పాత్రలతో భారతదేశపు చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందారు. అనతికాలంలోనే బాలీవుడ్‌లో షెహెన్ షా, స్టార్ ఆఫ్ ది మిలీనియం, బిగ్ బి అనే బిరుదులను పొందారు. నాలుగు దశాబ్దాల్లో దాదాపు 190 సినిమాలలో ఆయన నటించి, మెప్పించారు. 1970, 80, 90లలో తెరపై అమితాబ్ ఆధిపత్యం కొనసాగింది.  అప్పట్లో ఫ్రెంచి దర్శకుడు ఫ్రాంన్సిస్ ట్రుఫట్ భారతీయ సినిమాని "వన్ మాన్ ఇండస్ట్రీ"గా అభివర్ణించారు. దీంతో ఆయన అ‍ప్పట్లోనే ఆయన స్థానం ఏంటో అర్థమవుతుంది. తాజాగా చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరాలోనూ బిగ్‌బీ నటిస్తున్నారు.

ఉత్తమ నటునిగా నాలుగు జాతీయ అవార్డులు, అంతర్జాతీయ స్థాయి సినిమా ఫెస్టివల్స్ ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు. 15 ఫిలింఫేర్ అవార్డులు గెలుపొందారు. ఉత్తమ నటుడు కేటగిరికిగాను 40సార్లు నామినేట్ అయి ఫిలింఫేర్‌కు అతి ఎక్కువ సార్లు నామినేట్ అయిన నటుడుగా రికార్డు సృష్టించారు. నటునిగానే కాక, నేపధ్య గాయకుడిగా, నిర్మాతగా, టెలివిజన్ యాంకర్ గానూ తన ప్రతిభ చాటుకున్నారు.

1984లో భారత ప్రభుత్వం అమితాబ్ ను పద్మశ్రీతోనూ, 2001లో పద్మ భూషన్ తోనూ, 2015లో పద్మవిభూషన్ తోనూ గౌరవించింది. 2007లో ఫ్రెంచి ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన "లెగియన్ ఆఫ్ హానర్"తో గౌరవించింది.  హాలీవుడ్ లో మొదటిసారి 2013లో "ది గ్రేట్ గేట్స్బే" అనే సినిమాతో అడుగుపెట్టారు బచ్చన్. 1980లో రాజకీయాలలో కొంత కాలంపాటు క్రీయాశీలకంగా పనిచేశారు. తాజాగా ఆయన సినిమా పరిశ్రమకు చేసిన సేవకుగాను ప్రతిష్టాత్మక దాదాసాహేబ్‌ ఫాల్కే అవార్డు కమిటీ ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.

అభినందనల వెల్లువ...
ప్రతిష్టాత్మక దాదాసాహేబ్‌ ఫాల్కే అవార్డుకు ఎంపికనైన సందర్భంగా అమితాబ్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమ రూపురేఖలను మార్చిన గొప్ప నటుడికి ఈ అవార్డు అభించిందని సీఎం అభిప్రాయపడ్డారు. కాగా దేశ వ్యాప్తంగా బిగ్‌బీకి అభినందనలు వెల్లువెత్తుత్తున్నాయి.  సినీ, రాజకీయ ‍ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement