కేంద్రానికి అన్నా హజారే హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం భూ ఆర్డినెన్సు బిల్లును తీసుకొస్తే సేవాగ్రామ్ (మహారాష్ట్ర) నుంచి ఢిల్లీకి మార్చిలో పాదయాత్ర మొదలుపెడతానని గాంధేయవాది అన్నా హజారే కేంద్రానికి అల్టిమేటం ఇచ్చారు. పాదయాత్ర చేపడితే రెండు మూడు నెలల పాటు కొనసాగుతుందని హెచ్చరించారు. మహారాష్ట్రలోని వార్ధాలో వచ్చే నెల 9న సమావేశమై పాదయాత్రపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో శుక్రవారం అన్నా హజారే మీడియాతో మాట్లాడారు.
కేంద్రం తెచ్చిన భూ ఆర్డినెన్సులోని అంశాలే భూసేకరణ 2013 సవరణ బిల్లులోనూ ఉన్నాయన్నారు. చర్చల కోసం ప్రధాని మోదీ ఆహ్వానిస్తే వెళ్తారా అని విలేకరులు ప్రశ్నించగా ‘మోదీకి నా పేరంటే అలర్జీ. నా సహచరులు ఆయనతో చర్చిస్తారు. ప్రభుత్వంతో చర్చించడం ద్రోహం కాదు’ అని బదులిచ్చారు.