మరో 670 మంది తరలింపు
న్యూఢిల్లీ: అంతర్యుద్ధంలో చిక్కుకున్న యెమెన్‌నుంచి భారత ప్రభుత్వం ఆదివారం మూడు విమానాల్లో మరో 670 మంది భారతీయులను తరలించింది. దీంతో అక్కడి నుంచి తరలించిన భారతీయుల సంఖ్య 2,300 కు చేరుకుంది. ‘ఆపరేషన్ రాహత్’కు విశేష కృషి చేస్తున్న ఎయిరిండియాకు విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ కృతజ్ఞతలు తెలిపారు.
యెమెన్‌లోని అశ్‌షిహర్ నుంచి 203 మందిని ఐఎన్‌ఎస్ సుమిత్ర నౌకలోకి చేర్చామని విదేశాంగశాఖ ప్రతినిధి తెలిపారు. వీరిలో 182 మంది భారతీయులు కాగా ముగ్గురు పాకిస్తానీలతో పాటు మరో ఆరు దేశాలకు చెందినవారున్నారు. అల్‌ముకల్లాహ్ పట్టణాన్ని అల్‌కాయిదా చేజిక్కించుకోవడంతో అక్కడికి చేరాల్సిన నౌకను దారిమళ్లించి 25 కి.మీ. దూరంలోని అశ్‌షెహర్ పోర్టులో నిలిపారు. చిన్నచిన్న బోట్లలో 203 మందిని ఐఎన్‌ఎస్ సుమిత్రలోకి చేర్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పోర్టుకు మూడు కిలోమీటర్ల దూరంలో నౌకను నిలిపినట్లు అధికారులు తెలిపారు.
11 మంది భారతీయులను రక్షించిన పాక్
యెమెన్ ఆగ్నేయ ప్రాంతంలో అల్‌కాయిదా ఆధీనంలో ఉన్న మొకల్లా పట్టణంనుంచి తమపౌరుల్ని తరలించిన పాక్ నౌక వారితో పాటుగా 11 మంది భారతీయులను రక్షించింది. 35 మంది విదేశీయులతో సహా 183 మందిని నౌకలో చేర్చినట్లు పాక్ విదేశాంగ అధికారి తెలిపారు. వీరిలో 8 మంది చైనీయులు, 11 మంది భారతీయులు, నలుగురు బ్రిటన్ దేశస్తులు ఉన్నారని ఆ అధికారి తెలిపారు. ఈ నెల 7న నౌక కరాచీ పోర్టుకు చేరుకుంటుంది. యెమెన్ నుంచి 2,300 మంది భారతీయులను తరలించడంలో మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం విజయవంతమైందని బీజేపీ పేర్కొంది.