
కేరళలో మరో గ్యాంగ్‌రేప్
19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
తిరువనంతపురం: కేరళ నిర్భయ ఘటన తరహాలో ఓ న్యాయ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్, హత్య ఘటనను మరిచిపోకముందే అదే రాష్ట్రంలో మరో దళిత నర్సింగ్ విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది. వర్కల ప్రాంతంలో బీఎస్‌సీ నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల దళిత విద్యార్థినిపై మంగళవారం ఆమె స్నేహితులే అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం బాధితురాలు తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతోంది. నిందితులు పరారీలో ఉన్నారు.మేజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు.
వాంగ్మూలం ఆధారంగా ముగ్గురిపై కేసు నమోదు చేశామని, వైద్య పరీక్షల్లోసామూహిక అత్యాచారం జరిగినట్టు వెల్లడైందని పోలీసులు తెలిపారు. తనకు తెలిసిన ఆటో డ్రైవర్‌తో కలసి బాధితురాలు ఆటోలో వెళ్లిందని, ఆ తర్వాత మరో ఇద్దరు స్నేహితులు వారిని కలిశారని, నిర్జన ప్రదేశానికి ఆటోని తీసుకెళ్లి ముగ్గురూ కలసి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పారు. అపస్మారక స్థితిలో ఫిట్స్‌కు గురై బాధితురాలు సహాయం కోసం కేకలు వేయగా.. స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారన్నారు. ప్రత్యేక వైద్యుల బృందం బాధితురాలికి చికిత్స అందిస్తోందని, ఆమె ఆరోగ్యపరిస్థితి స్థిరంగా ఉందన్నారు.
చిత్రహింసలు పెట్టి చంపేశారు
కొచ్చి: కేరళలోని పెరంబవూరులో గతవారం నిర్భయ ఘటనను గుర్తు చేస్తూ దారుణ హత్యకు గురైన దళిత న్యాయ విద్యార్థినిని చిత్రహింసలు పెట్టి చంపేసినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది. బాధితురాలి శరీరంపై మొత్తం 38 గాయాలు ఉన్నట్టు గుర్తించారు. పోస్టుమార్టం నివేదికలో బాధితురాలిపై అత్యాచారం జరిగినట్టు వెల్లడైందని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదికను అలప్పుజ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ విభాగం రూపొందించింది. మరోవైపు బుధవారం ఉదయం కేరళ సీఎం ఊమెన్ చాందీ పెరంబవూరు చేరుకుని బాధితురాలి తల్లిని పరామర్శించారు. నిందితులను ఆరెస్ట్ చేస్తామని, బాధితురాలి సోదరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఈ సందర్భంగా చాందీ బాధితురాలి తల్లికి హామీ ఇచ్చారు. బాధితురాలి కుటుంబానికి రూ. పది లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్టు వెల్లడించారు. కేరళ దళిత యువతి హత్యపై లోక్‌సభ, రాజ్యసభ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.